Share News

యుద్ధ భయాలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:17 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతానికి ధరలు పెరగనప్పటికీ యుద్ధం ఇదేవిధంగా కొనసాగితే నిత్యావసర ధరలు భగ్గుమనే చాన్స్‌ లేకపోలేదు.

యుద్ధ భయాలు

మార్కెట్‌లో ధరల టెన్షన్‌

పెరగనున్న వంటింటి బడ్జెట్‌

సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన

నరసాపురం, మార్చి 4(ఆంధ్రజ్యోతి) : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతానికి ధరలు పెరగనప్పటికీ యుద్ధం ఇదేవిధంగా కొనసాగితే నిత్యావసర ధరలు భగ్గుమనే చాన్స్‌ లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్‌ జలరవాణాలో కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని మూసివే యడంతో వాణిజ్య నౌక రాకపోకలు ఆగిపోయాయి. నిత్యావసర వస్తువులతోపాటు ఆయిల్‌ దిగుమతులు నిలిచిపోయాయి. ఇటు వంట నూనెల నుంచి వంటింట్లో వాడే పప్పుదినుసుల దిగుమతులు నిలిచిపోనున్నాయి. నిత్యావసర ధరలు పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడనుంది. మరోవైపు పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌ యుద్ధంతో డ్రైఫ్రూట్స్‌ దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికే కొన్ని డ్రైఫ్రూట్స్‌ ధరలు పెరిగాయి. యుద్ధం ఇదేవిధంగా కొనసాగితే వీటి ధరలు మరింత పెరిగే చాన్స్‌ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పశ్చిమ జిల్లాలో 200 వరకు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు 10 లక్షల లీటర్లపైనే దిగుమతులు నిలిచి పోతే వినియోగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. యుద్ధం మొదలై ఐదు రోజులైంది. ఇప్పటికే బ్యారల్‌పై పది డాలర్లు పెరిగింది. రానున్న రోజుల్లో బ్యారెల్‌ రూ.100కు చేరే చాన్స్‌ ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే పెట్రోల్‌ ధర లీటరు రూ.150కు వెళ్లే చాన్స్‌ ఉందని బంకు యాజమానులు చెబుతున్నారు. వీటి ధరలు పెరిగితే కూరగాయల నుంచి నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉందని జిల్లా పెట్రోల్‌ బంకుల ఆసోసియేషన్‌ అధ్యక్షుడు నాగేశ్వరరావు హెచ్చరిస్తున్నారు. ఇటు ఆయిల్‌ ధరలు పెరుగుతాయన్న భయంతో అక్వా రైతులు చాలామంది ముందస్తుగా నిల్వ చేసుకుం టున్నారు. అవసరానికి అనుగుణంగా టిన్నుల్లో స్టాక్‌ పెట్టుకున్నారు. గత రెండు రోజుల నుంచి గ్రామీణా ప్రాంత బంకుల్లో ఈ సందడి కనిపిస్తుంది.

వంట నూనె నుంచి పప్పుదినుసుల వరకు..

వంటింట్లో ఎక్కువగా వాడే వంట నూనెలు, సోయా, సన్‌ఫ్లవర్‌, పప్పు దినుసులు వంటి నిత్యావసర వస్తువుల్ని భారత్‌.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఎక్కువగా బ్రెజిల్‌, ఉక్రెయిన్‌, సింగపూర్‌, మలేషియా నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇటు వంట నూనెలు తీసుకొచ్చే నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న రోజుల్లో నూనె ధరలు పెరిగే చాన్స్‌ ఉందని ఆయిల్‌ డీలర్లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జీఎస్టీ తగ్గినా.. నూనె ధరలు మాత్రం కేజీ రూ. 110 దిగలేదు. అన్ని రూ.120 నుంచి రూ.150 మధ్యే ఉన్నాయి. యుద్ధం ఇదేవిధంగా ఉంటే వీటి ధరలు మరింత పెరిగే భయం ఉంది. ఇక పప్పుదినుసుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం కందిపప్పును నాగపూర్‌, కర్నూల్‌, నిజామాబాద్‌ నుంచి వస్తున్నాయి. ఇటీవల దిగుబడులు లేక సప్లై తగ్గింది. పూర్తిగా విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చింది.

పెరుగుతున్న డ్రైఫ్రూట్స్‌ ధరలు..

కొవిడ్‌తో డ్రైఫ్రూట్స్‌ వినియోగం బాగా పెరిగింది. అత్యధికంగా పిస్తా, బాదం, కర్జూరం, వాల్‌నట్స్‌ వంటి డ్రైఫ్రూట్స్‌ ఆప్ఘనిస్థాన్‌, ఇరాన్‌ నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇవి ఢిల్లీ నుంచి విజయవాడ మార్కెట్‌కు వస్తాయి. అక్కడ నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని అన్ని పట్టణాల్లో డ్రైఫ్రూట్స్‌ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రస్తుతం పిస్తా కేజీ రూ.1500 ఉంది. వాల్‌నాట్స్‌ కేజీ రూ.1200, బాదం కేజీ రూ.1000 ఉంది. ప్రస్తుతం దిగుమతులు నిలిచిపోవడంతో రెండు రోజుల నుంచి వీటి ధరలు కేజీకి రూ.100 చొప్పున పెరుగుతూ వస్తున్నాయి హోల్‌సేల్‌ మార్కెట్‌లో స్టాక్‌ లేకపోవడంతోపాటు ప్రస్తుతం రంజాన్‌ సీజన్‌ కావడంతో డ్రైఫ్రూట్స్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ధరలు పెరగడం సామాన్య, మధ్య తరగతి ప్రజలు వీటిని కొనాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.

ప్రజల్లో ధరల భయం

ప్రస్తుతం యుద్ధ భయంతో ప్రజల్లో ధరల భయం నెలకొంది. యుద్ధం ఇదేవిధంగా కొనసాగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నిత్యావసర ధరలు పెరిగే ఆవకాశం ఉందన్న ఆందోళన సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో నెలకొంది. దీని నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా ఆయిల్‌, పప్పు దినుసుల ధరలు పెరగకుండా చూడాలి.

– పాలూరి బాబ్జి, వ్యాపారి

Updated Date - Mar 05 , 2026 | 12:17 AM