పల్లె పోరుకు సిద్ధమేనా ?
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:43 AM
గ్రామ పంచాయతీ పాలకవర్గాల కాల పరిమితి ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో ముగియనుంది. ఈలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
ఏప్రిల్ 2తో పంచాయతీ పాలక వర్గాల కాలపరిమితి ముగింపు
ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
మార్చి 9న పంచాయతీల ఓటర్ల జాబితా ప్రచురణ
ఈసారి విలీన గ్రామాలకు ప్రకటన
అవకాశం ఇవ్వాలని నేతల వద్దకు ఆశావహుల క్యూ
కూటమిలో ఏ పార్టీకి ఎన్ని కేటాయించేను ?
బీసీ రిజర్వేషన్‌లపై ఏ నిర్ణయం తీసుకుంటారో ?
(భీమవరం–ఆంధ్రజ్యోతి) గ్రామ పంచాయతీ పాలకవర్గాల కాల పరిమితి ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో ముగియనుంది. ఈలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. జిల్లాలోని మొత్తం పంచాయతీల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు లెక్కలు తీస్తున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి ఇప్పటికే మండలాల వారీగా ఓటర్ల జాబితాలను పంపించారు. వాస్తవానికి 2025 జనవరి ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం వద్ద ఉంది. జిల్లా పంచాయతీ కార్యాలయంలోనూ ఉన్న అదే జాబితాను మండలాలకు పంపారు. అక్కడి నుంచి జల్లాలలోని 403 పంచాయతీలకు చేరుకున్నాయి. ఎన్నికల సంఘం తాజాగా 2026 జనవరి ఒకటో తేదీ నాటికి ఉన్న జాబితాను ప్రచురించాలని ఆదేశాలు జారీచేసింది. వాస్తవానికి 2025 తర్వాత తొలగించిన, కలిపిన ఓటర్ల వివరాలు పంచా యతీల వద్ద ఉన్నాయి. సదరు వివరాలతో కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. కలపాల్సిన వాటిని 2025 ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారు. తొలగించాల్సిన ఓటర్లను తీసివేస్తున్నారు. పంచాయతీల వారీగా ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశించిన విధంగానే మార్చి 9 నాటికి కొత్త ఓటర్ల జాబితా సిద్ధం కానుంది. ప్రభుత్వం సన్నద్ధంగా ఉంటే అదే జాబితాతో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
నేతల వద్దకు క్యూ
ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సమరానికి పార్టీలు కాలు దువ్వు తున్నాయి. ఆశావహులు పోటీకి సిద్ధపడుతు న్నారు. నియోజక వర్గాల్లో తమ పార్టీ నేతలను కలుసుకుని ఆశీస్సులు పొందుతున్నారు. తమకు అనుకూలంగా రిజర్వేషన్‌లు వస్తే పోటీలో ఉంటామని ముందుగానే తమ అభిమతాన్ని నేతలవద్ద చెప్పుకొస్తున్నారు. పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహించనున్నారు. దాంతో జిల్లాలోని కీలక పంచాయతీల్లో త్రిముఖ పోరు ఉన్నట్టు కనిపిస్తోంది. కూటమిలో మాత్రం విజయం తమదే అన్న ధీమా వ్యక్తమవుతోంది. గ్రామాల్లో బలంగా ఉండే నాయకులకు నేతలు ఆశీస్సులు అందిస్తున్నారు. పోటీకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు పంపుతున్నారు.
రెండు నియోజకవర్గాల్లో చిక్కులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మధ్య సయోధ్య కుదరనుంది. వైసీపీ హయంలోనే తెలుగుదేశం, జనసేన పార్టీలు జిల్లావ్యాప్తంగా అనధికార పొత్తు కుదుర్చుకున్నాయి. క్షేత్రస్థాయి లోనే రెండు పార్టీల నాయకులు ఒక్కటై పోటీ పడ్డారు. తాడేపల్లిగూడెం, ఆచంట, భీమవరం నియోజకవర్గాల్లో ఆశాజనకమైన ఫలితాలు సాధించారు. ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య అధికారిక పొత్తు ఉంది. తాడేపల్లి గూడెం,నర్సాపురం నియోజకవర్గాల్లో నేతల మధ్య పొసగడం లేదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అది కాస్త ఎక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు కూటమి పార్టీల్లో ఆశావహులను కాస్త ఇబ్బందికి గురిచేస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ పరంగా జరగవు. కూటమి నియోజకవర్గ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలు పొత్తు ధర్మం ఏ మేరకు ఉంటుందనే దానిపై చర్చ సాగుతోంది. భీమవరం, ఉండి, తణుకు, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఇబ్బందులు లేవు. పంచాయతీ ఎన్నికల్లో సదరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు అనుకునే అభ్యర్థులను రంగంలోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు పార్టీ పరంగా జరిగే అవకాశం ఉన్నందున తాడేపల్లిగూడెం, నర్సాపురం నియోజకవర్గాల్లోనూ పొత్తు అభ్యర్థులే రంగంలో ఉంటారు. ఎటొచ్చి పంచాయతీ ఎన్నిక ల్లోనే కూటమి నాయకుల వ్యూహం ఏమిటనే దానిపై తాడేపల్లిగూడెం, నర్సాపురం నియోజక వర్గంలో చర్చ నడుస్తోంది.
రిజర్వేషన్‌లపై ముందస్తు అంచనా
రిజర్వేషన్‌లపై ఇప్పటికే గ్రామస్థాయిలో ఒక అంచనాకు వస్తున్నారు. గడిచిన నాలుగు ఎన్నిక లను బేరీజు వేసుకుంటూ ఈసారి రిజర్వేషన్ ఏమవుతుందనే దానిపై ఒక స్పష్టతకు వచ్చే స్తున్నారు. అదే కేటగిరీలో నేతలు పోటీ పడేందుకు నాయకులను కలుసుకుంటున్నారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులు అటు తెలుగుదేశం, ఇటు జనసేన నేతలను, ఎమ్మె ల్యేలను కలుసుకొని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోటీకి సై అంటున్నారు. బీసీ రిజర్వేషన్‌ను ఈసారి పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ హయాంలో బీసీ రిజర్వేషన్‌ను పంచాయతీల్లో 24 శాతానికి కుదించారంటూ ఆయా వర్గాల్లో ఒకింత అసంతృప్తి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం దానిని మళ్లీ 34 శాతానికి పెంచాలంటూ నిర్ణయం తీసుకుంది. అదే జరిగితే ఈ సారి బీసీ సర్పంచ్ స్థానాలు పెరగనున్నాయి.
విలీన గ్రామాలకు జాబితా సిద్ధం
మున్సిపాలిటీల్లో విలీనం చేసిన పలు పంచాయతీలకు గతంలో ఎన్నికల జరగలేదు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపా లిటీల్లో విలీన గ్రామాలున్నాయి. ఈ సారి వాటికి మున్సిపాలిటీల నుంచి మినహాయించి ఎన్నికలు నిర్వహిస్తారని అంతా ఆశిస్తున్నారు. విలీన గ్రామాల్లోనూ పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా మార్చి 9న ప్రకటించనున్నారు. మున్సి పాలిటీల్లోను విలీన గ్రామాలను మినహాయించి ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది. మొత్తంగా స్థానిక ఎన్నికలపై గ్రామాల్లో కాస్త కదలిక మొదలైంది.