Share News

మున్సిపోల్‌..!

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:01 AM

మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాబితా సిద్ధం చేసే పనిలో అధికారుల నిమగ్నమయ్యారు.

మున్సిపోల్‌..!

ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు సమాయత్తం

కూటమిలో అప్పుడే మొదలైన చర్చ

పాత వార్డుల ఆధారంగానే ఓటరు జాబితా

మార్చి 9 నాటి జాబితా ప్రకటనకు అధికారుల కసరత్తు

రిజర్వేషన్‌పై అందరి ఉత్కంఠ

మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాబితా సిద్ధం చేసే పనిలో అధికారుల నిమగ్నమయ్యారు. పాత వార్డుల ఆధారంగానే జాబితా ప్రచురించనున్నారు. మరోవైపు రాజకీయ పక్షాలు చైర్మన్‌, కౌన్సిలర్ల రిజర్వేషన్‌ ఖరారుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కూటమి పార్టీలు సీట్ల ఒప్పందం చేసుకుని ఎన్నికలకు వెళ్లడానికి ఉత్సాహంగా ఉంటే వైసీపీ నాయకత్వ లేమితో డీలా పడింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ కోసం అధికా రులు కసరత్తు చేస్తున్నారు. పాత వార్డుల ఆధారంగానే జాబితా ప్రచురించనున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలి టీల్లో గడచిన ఐదేళ్ల నుంచి పాలకవర్గాలు లేవు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల సమస్య కారణంగా గతంలో ఎన్నికలు నిర్వహించ లేకపోయారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలకు వెళుతున్న తరుణంలో హైకోర్టు స్టేతో అప్పట్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటినుంచి నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు లేకుండానే ప్రత్యేక అధికారుల పాలనలో కొన సాగుతున్నాయి. నరసాపురం, తర్వాత ఆకివీడు నగరపంచా యతీగా మారడంతో ఎన్నికలు నిర్వహించారు. త్వరలోనే మునిసిపల్‌ పాలకవర్గాల గడువు ముగియ నుంది. తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవు తోంది. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నారు. ఐదేళ్ల పాటు పాలకవర్గాలు లేకపోవ డంతో ఈసారి మున్సిపల్‌ ఎన్నికలపై జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొంది. కూటమి మంచి జోష్‌ మీద ఉంది.

రిజర్వేషన్లపై ఉత్కంఠ

గతంలో విలీన గ్రామాల ఆధారంగా రిజర్వేషన్‌లు ప్రక టించారు. ఈసారి పాత వార్డుల ప్రకారం రిజర్వేషన్‌ ఖరా రు చేయనున్నారు. చైర్మన్‌ పదవికోసం ఎన్నో ఏళ్లుగా ఎదు రుచూస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో పాలకవర్గాలు లేని నాలుగు మున్సిపాలిటీలు కీలకమైనవే. వాటిలో భీమవరం జిల్లా కేంద్రమైంది. పాలకొల్లులో మంత్రి నిమ్మలకు మున్సిపల్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తణుకు మున్సిపాలిటీ ఎక్కువ పర్యాయాలు తెలుగుదేశం ఖాతాలో చేరింది. సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి సర్దుబాటులో భాగంగా తెలుగు దేశం వదులుకుంటూ వస్తోంది. ఈసారి తెలుగుదేశం పార్టీకి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ కీలకమైంది. కూటమి అధిష్ఠానం ఎన్నికలపై పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపు తోంది. రిజర్వేషన్‌ ఆధారంగా పోటీలో ఉండేలా కీలక నాయ కులకు దిశా నిర్దేశం చేస్తోంది. రిజర్వేషన్‌లే ఇప్పుడు కూటమి పార్టీలకు కీలకంగా కానున్నాయి. తదనుగుణంగా చైర్మన్‌ అభ్యర్థులను బరిలో దింపేలా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ఆశావహులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కూటమిలో సర్దుబాటుపై ఆసక్తి

జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమిలో మిత్ర ధర్మం పాటించేలా మునిసిపాలిటీలను మూడు పార్టీల మధ్య కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలను బేరీజు వేసుకుని సర్దుబాటు చేసే అవకా శాలున్నాయి. నామినేటెడ్‌ పదవుల పంపకంలోనూ అదే జరిగింది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి మధ్య సర్దుబాటు జరిగింది. తెలుగుదేశం ఆశావహులు సీట్లు వదు లుకున్నారు. జిల్లాలో అత్యధికంగా జనసేనకు మూడు సీట్లు కేటాయించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాలను జనసేనకు కేటాయించారు. ఉండి, పాల కొల్లు, తణుకు, ఆచంట నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ పడింది. జిల్లాలో పట్టణ పరిధి నియోజకవర్గాలు ఐదు ఉన్నాయి. ఉండి పరిధిలో ఆకివీడు కూడా నగరపంచాయతీ అయింది. ప్రస్తుతానికి భీమవరం, తాడేప ల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆకివీడు నగర పంచా యతీకి ఇంకా సమయం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల సర్దుబాటును దృష్టిలో ఉంచుకుని ఈసారి మున్సిపాలిటీల్లో కూటమి పార్టీలకు చైర్మన్‌ పదవులు కేటాయించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసా పురం తెలుగుదేశానికి కేటాయిస్తారంటూ ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు అంచనా వేసుకుని కొందరి నేతలకు పోటీ పడేలా సంకేతాలు కూడా పంపారు. మొత్తానికి కూటమిలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంచి జోష్‌ కనిపిస్తోంది.

వైసీపీకి నాయకత్వలేమి..!

కూటమికి ప్రత్యర్థి అయిన వైసీపీలో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనపడుతోంది. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్‌ రాజీనామా చేయడంతో అక్కడ నాయకత్వం లేక వైసీపీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నాయి. తాడేపల్లిగూడెంలో ఇటీవల నాయకత్వ మార్పు జరిగింది. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణను తప్పించి వడ్డి రఘురామ నాయుడుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికే అప్పటికే వైసీపీని వీడి అనేకమంది నాయ కులు తెలుగుదేశం, జనసేనలో చేరిపోయారు. పాలకొ ల్లులో తొలి నుంచి నాయకత్వంపై స్పష్టత లేదు. ఎప్పుడు ఎవరికి పార్టీ కార్యక్రమాలు ఇస్తారనే దానిపై కేడర్‌లో అయోమయం నెలకొంది. కొన్నాళ్లపాటు మాజీ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ పాలకొల్లు నియోజకవర్గంలో పార్టీ కార్య కలాపాలు నిర్వహించారు. ఇంకొన్నాళ్లు గుడాల భుజంగ రావుకు బాధ్యతలు అప్పగించారు. గడచిన ఎన్నికల్లో గుడాల గోపికి వైసీపీ టిక్కెట్‌ ఇచ్చారు. ఇలా నాయకత్వ మార్పులతో పాలకొల్లు వైసీపీ కొట్టుమిట్టాడుతోంది. తణుకు, నరసాపురంలో నియోజకవర్గ నాయకత్వం ఉన్నప్పటికీ కేడర్‌లో ఉత్సాహం లేదు. వైసీపీ శ్రేణుల్లో మునిసిపల్‌ ఎన్నికలపై ఉత్సాహం కానరావడం లేదు.

Updated Date - Feb 23 , 2026 | 12:01 AM