మార్కెట్‌లో ముందే చవితి సందడి
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:15 AM
మార్కెట్లో వినాయక చవితి సందడి ముందే వచ్చేసింది.ఎన్నడూ లేనివిధంగా వినాయకచవితికి ముందు రెండురోజులు సెలువుల వచ్చాయి. దీంతో వ్యాపారులు ముందస్తుగానే సన్నద్ధమయ్యారు. దీనికి తోడు రైతులు కూడా పండగ వెళితే ధర దక్కదేమో అనే ఆందోళనలో ఉన్నారు. దీంతో రైతులు తయార వకపోయినా మార్కెట్‌కు ముందుగానే అరటి గెలలు తీసుకొచ్చేశారు.
తాడేపల్లిగూడెం మార్కెట్‌కు అరటి గెలలు
చవితి దాటితే ధర ఉండదనే ఆందోళన
యాపిల్, బుట్టకట్టిన బత్తాయికి డిమాండ్
తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్నది. దీంతో మార్కెట్‌లో సందడి మొదలైంది. రకరకాల ప్రతిమల వినాయక విగ్రహాలు కూడా మార్కట్‌లో తారసపడుతున్నాయి. గ్రామాల్లో పందిర్లు వెలిశాయి. మట్టి విగ్రహాలనే వాడాలంటూ అవగాహన ర్యాలీలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు అరటి, ఇతర పండ్లను ముందుగానే తీసుకువచ్చారు. పండ్ల రేట్లు కూడా భారీగానే ఉన్నాయి..మార్కెట్లో వినాయక చవితి సందడి ముందే వచ్చేసింది.ఎన్నడూ లేనివిధంగా వినాయకచవితికి ముందు రెండురోజులు సెలువుల వచ్చాయి. దీంతో వ్యాపారులు ముందస్తుగానే సన్నద్ధమయ్యారు. దీనికి తోడు రైతులు కూడా పండగ వెళితే ధర దక్కదేమో అనే ఆందోళనలో ఉన్నారు. దీంతో రైతులు తయార వకపోయినా మార్కెట్‌కు ముందుగానే అరటి గెలలు తీసుకొచ్చేశారు. సాధారణంగా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఆదివారం సంత ఉంటుంది. ఆరోజు అరటి మార్కెట్ ఉండదు. దీంతో ఇప్పుడు రైతులు శుక్రవారం రోజునే పెద్ద సంఖ్యలో గెలలను తీసుకొచ్చారు. వరలక్ష్మి వ్రతానికి గెల రూ.500 నుంచి 1000 వరకు ధర పలికింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాణ్యత లేకపోవడంతో గెల రూ.300 నుంచి రూ.700 వరకు మాత్రమే పలుకుతోంది. శుక్రవారం నుంచి భాద్రపదమాసం (శూన్య మాసం) ప్రవేశించడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు పుల్‌స్టాప్ పడింది. శుభకార్యక్రమాలు ఈ మాసంలో ఉండవు. వచ్చే నెల 11 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు, వ్యాపారులకు వినాయక చవితి ఒక్కటే కనిపిస్తున్నది. వినాయక చవితి వెళితే ధర మరింత పడిపోయే అవకాశం ఉందని రైతులు గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారంరోజుల్లో తయారు అవుతాయనే గెలలను కూడా కోసి మార్కెట్‌కు తీసుకొచ్చేశారు. అయితే వీటిని చిరు వ్యాపారులు కొనుగోలు చేయడానికి అంత ఆసక్తి చూపలేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఖండవల్లి, తణుకు, పెరవలి ప్రాంతాల్లో పండించిన పంటతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో పండించిన అరటి గెలలను కోసుకుని రైతులు వ్యాన్లలో తీసుకువచ్చారు.
యాపిల్ అధరహో
మార్కెట్లో యాపిల్ ధరలు మాత్రం మండుతున్నాయి. బాక్స్ రూ.4000 నుంచి 4500 వరకు విక్రయిస్తున్నారు. సిమ్లా రకానికి చెందిన ఈ యాపిల్‌కు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. యాపిల్ బాక్స్‌లో 100, 125, 150, 175, 200 కాయలు పట్టే విధంగా ఉంటాయి. బాక్సుకు 100 కాయలు ఉంటే అవి పెద్ద సైజులో ఉంటాయి. ఈ బాక్సులు అన్నీ ఒకే ధరలో ఉంటాయి. బాక్సుకు 260 నుంచి 300 వరకు కాయలు ఉండేది మాత్రం రూ.3 వేలకు దొరుకుతుంది. బాక్సుకు 100 కాయలు ఉంటే సరాసరిన ఒక్క యాపిల్ హోల్‌సేల్‌గానే రూ.45 ధర పలుకుతుంది. దీన్ని రిటైలర్స్ కొనుగోలు చేసి ఏ ధరకు విక్రయిస్తారో చెప్పనక్కరలేదు. వినాయక చవితి పురస్కరించుకుని బాక్సుకు 260 నుంచి 300 కాయలు ఉండేవి ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎందుకంటే బరువు తక్కువగా ఉండి పాలవెల్లికి కట్టడానికి వీలుగా ఉంటాయి. సామాన్య, మధ్యతరగతి వారు కొనుగోలు చేయడానికి అందుబాటు ధరలో ఉంటాయని చెబుతున్నారు. దీనిలో భాంగా ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారులు ఢిల్లీ, సిమ్లా వెళ్లి కొనుగోలు చేసి తీసుకొచ్చి నిల్వచేశారు.
బుట్టకట్టిన బత్తాయికి డిమాండ్
మార్కెట్లో బుట్టకట్టిన బత్తాయికి డిమాండ్ వచ్చిపడింది. 100 కాయలు ఉండే ట్రే రూ.1500కు హోల్‌సేల్ వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇక బుట్టకట్టని బత్తాయి కిలో రూ.20 నుంచి 25 మధ్య అమ్ముతున్నారు. కొమ్ముగూడెం, చిన్నాయిగూడెం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో పండించిన బత్తాయి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వచ్చింది.