Share News

భీమవరం మున్సిపాలిటీకి విలీన భారం

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:48 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలం, చినఅమిరం పంచాయతీల కార్యదర్శులు నిధులను పక్కదారి పట్టించారు.

భీమవరం మున్సిపాలిటీకి విలీన భారం

లోటు బడ్జెట్‌తో వస్తున్న రాయలం, చినఅమిరం

రెండు పంచాయతీల్లో రూ.5 కోట్ల కుంభకోణం

కాజేసిన గ్రామ కార్యదర్శులు

రికవరీపై అధికారుల తాత్సారం

ఇకపై మున్సిపాలిటీదే రికవరీ బాధ్యత

లేదంటే మున్సిపాలిటీకి లోటే..

భీమవరం మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ స్థాయి ఉందని స్థానిక నేతలు చెబుతుంటారు. జిల్లాల పునర్విభజనతో పశ్చిమ గోదావరి జిల్లాకు కేంద్రమైంది. రాష్ట్రస్థాయిలో పేరుమోసిన విద్యా సంస్థలున్నాయి. జాతీయ రహదారులు వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. విలీన గ్రామాలతో జనాభా కూడా పెరగనుంది. ఏటా రూ.50 కోట్లు ఆదాయం వస్తే కార్పొరేషన్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే విలీన గ్రామాలతో ఆదిలో కొన్ని చిక్కులు కలుగుతున్నాయి. మున్సిపాలిటీలో విలీనమైన రాయలం, చినఅమిరం గ్రామ పంచాయతీలో లోటు బడ్జెట్‌లో ఉన్నాయి. ఆ భారం మునిసిపాలిటీ మోయాల్సి ఉంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలం, చినఅమిరం పంచాయతీల కార్యదర్శులు నిధులను పక్కదారి పట్టించారు. రెండు పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూలు చేసి సొంత ఖాతాల్లో జమ చేసుకున్నారు. దాదాపు రూ.5 కోట్లు మేర నిధులు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరు కార్యదర్శలను సస్పెండ్‌ చేసినా వారి నుంచి రికవరీ చేయాలి. ఇప్పటివరకు రికవరీ చర్యలు లేకపోవడంతో గ్రామ పంచాయ తీల్లో నిధులకు కటకటలాడే పరిస్థితి నెలకొంది. బిల్లులు కూ డా సక్రమంగా చెల్లించలేకపోతున్నారు. ఏలూరు అర్బన్‌ డెవల ప్‌మెంట్‌ అథారిటీ నుంచి రెండు పంచాయతీలకు రావాల్సిన బకాయిలు మంజూరు కాలేదు. మరోవైపు విలీన సమస్యతో పంచాయతీల్లో ఎన్నికల్లో నిర్వహించలేదు. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. రెండు పంచాయతీలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి.

రికవరీకి చర్యలు చేపట్టరే..?

ఆస్తిపన్ను సొమ్ములు సొంత ఖాతాలకు మళ్లించిన కార్యద ర్శులను అప్పటి వైసీపీ నేతలు కాపాడుతూ వచ్చారు. అధికా రులు అండదండలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వా త ఆస్తిపన్ను కుంభకోణం బయటకు వచ్చింది. బాధ్యులైన ఇద్దరు కార్యదర్శులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. దీనిపై సంబంధిత కార్యదర్శులు హైకోర్టును ఆశ్రయించారు. పక్కదారి పట్టిన సొమ్ము రికవరీపై ఎటువంటి కేసులు లేవు. కూటమి ప్రభుత్వం వారి నుంచి సొమ్ము రికవరీ చేయలేకపో వడంపై అధికార వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ఎంత వరకు నిధులు పక్కదారి పట్టాయనే విషయంపై విచారణ కమిటీని వేశారు. ఉన్నత స్థాయి అధికారుల వద్దకు నివేదిక చేరుకున్న ట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి ఇంకా జిల్లా పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌, సంబంధిత పంచాయతీల కు కూడా రాకపోవడంతో రికవరీ చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తయినా విచారణ నివేదిక బయటకు రాకపోవడంపై విస్మయం కలిగిస్తోంది. అదే లోటుతో రెండు పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. ఆ భారమంతా ఇప్పుడు మున్సిపాలిటీ భరించాల్సి ఉంటుంది. రికవరీ కూడా మున్ముందు మున్సిపాలిటీ పరిధిలోకి రానుంది.

ఇక ఆన్‌లైన్‌ చెల్లింపులు

పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిధులు దుర్విని యోగం అవుతున్నాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. దాంతో ఆస్తిపన్ను, నీటి పన్ను వసూళ్లకు స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ను తీసుకొచ్చింది. స్వర్ణ పంచాయతీ అమలులోకి వచ్చి న తర్వాత పన్నులన్నీ ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారు. పంచాయతీల ఆదాయం కూడా పెరిగింది. కానీ రికవరీల విషయంలో తత్సారం జరుగుతోంది, ఇతర పంచాయతీల్లో కొద్దిపాటి నిధు లు మాత్రమే రికవరీ చేయాల్సి ఉంది. రాయలం, చినఅమిరం పంచాయతీల్లో రూ.5 కోట్లు మేర నిధులు దుర్వినియోగం అయ్యాయి. దీనిపై అధికారులు దృష్టి పెట్టకపోతే ఆ భారం మున్సిపాలిటీ భరించాల్సి ఉంటుంది.

Updated Date - Oct 04 , 2026 | 11:48 PM