Share News

బియ్యం దుకాణాల్లో విజిలెన్స్‌ దాడులు

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:44 AM

ఏలూరు నగరంలో విజిలెన్సు, పౌరసరఫరా, తూనికలు కొలతలు అధికారులు సంయుక్తంగా బియ్యం అమ్మకాల షాపులు తనిఖీ చేసి అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా గుర్తించి 5 షాపులపై కేసులు నమోదు చేశారు.

బియ్యం దుకాణాల్లో విజిలెన్స్‌ దాడులు
బియ్యం దుకాణాల్లో తనిఖీలు చేస్తున్న విజిలెన్సు అఽధికారులు

ఏలూరు క్రైం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో పరిస్థితిని సాకుగా చూపెట్టుకుని కొంత మంది వ్యాపారస్తులు నిత్యావసర సరుకులు బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తూ ఉండడంతో విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం ఏలూరు నగరంలో దాడులు నిర్వహించారు. విజిలెన్స్‌ ఎస్పీ కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో విజిలెన్సు, పౌరసరఫరా, తూనికలు కొలతలు అధికారులు సంయుక్తంగా బియ్యం అమ్మకాల షాపులు తనిఖీ చేసి అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా గుర్తించి 5 షాపులపై కేసులు నమోదు చేశారు. వెంకటరమణా ట్రేడర్స్‌లో సోనామసూరి ఎంఆర్‌పీ రూ.1924 ఉండగా, రూ. 2200లకు విక్రయించడంతో కేసు నమోదు చేశారు. రమేష్‌ రైస్‌ అండ్‌ జనరల్‌ సోనామసూరి రైస్‌ ఎంఆర్‌పీ రూ.1790 ఉండగా రూ.1950కు, సోమశేఖర రైస్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌లో రూ.1700 ఉండగా రూ.2100కు, సౌజన్య వెంకట నాగలక్ష్మి దుర్గ రైస్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌లో ఎంఆర్‌పీ రూ.1800 ఉండగా రూ.2100కు, తనూజా రైస్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌లో రూ.1924 ఉండగా రూ.2150కి విక్రయించడాన్ని గుర్తించారు. ఈ ఐదు షాపులపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా నిత్యావసర సరుకులు అయిన బియ్యం, పప్పులు, కూరగాయలు వంటి వాటిని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ ఎస్పీ కె.నాగేశ్వరరావు హెచ్చరించారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, ఏవో జి.మీరయ్య, తూనికలు కొలతల అధికారి జి.వెంకట ప్రసాద్‌, జీఎస్‌డీటీ రమేష్‌ పలువురు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:44 AM