మురిసిన ముసునూరు
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:33 AM
ముసునూరులో సోమవారం గౌర్నెట్ పాప్ కార్నికా మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ కార్యక్రమం విజయ వంతమైంది.
మహిళా రైతులతో వ్యవసాయ రంగం బలోపేతం : ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
మొట్టమొదటి పాప్‌కార్న్ హైబ్రీడ్ విత్తనాలు ఆవిష్కరణ : గవర్నర్ నజీర్
చింతలపూడి ఎత్తిపోతలపూర్తి చేస్తాం.. సీఎం చంద్రబాబు హామీ
పాప్‌కార్నికా విత్తనాల ఆవిష్కరణసభలో ఉత్తమ రైతులకు సత్కారం
ఏలూరు/ముసునూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ముసునూరులో సోమవారం గౌర్నెట్ పాప్ కార్నికా మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ కార్యక్రమం విజయ వంతమైంది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ ‘నాకు తెలుగు తెలుసు.. అర్థమవుతుంది.. కానీ మాట్లాడలేను’ అంటూనే.. రైతు సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వివరించారు. మహిళా రైతులు వ్యవసాయ రంగంలోకి రావడం ద్వారా ఈ రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ముసునూరులో దేశంలోనే మొట్టమొదటి నాణ్యమైన నాన్ జీఎంవో పాప్‌కార్న్ హైబ్రీడ్ విత్తనాలను ఆవిష్కరించడం, ఎనిమిది రాష్ర్టాల ఉత్తమ రైతులకు సన్మానం చేయడం ఎంతో సంతోషకరమన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘వ్యవసాయం, ఉద్యాన ఉత్పత్తులు పండించే తీరులో మార్పులు రావాలి. ఎల్‌నినో ప్రభావంతో పంటలకు ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఏర్పడింది. మెట్ట మండలాలను సస్య శ్యామలం చేసే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి వున్న అడ్డంకులను అధిగమిస్తాం’ అని సీఎం రైతులకు భరోసా ఇచ్చారు.
ఉత్తమ రైతులకు ఘన సన్మానం
పాప్‌కార్నికా మొక్కజొన్న సాగులో మంచి దిగుబడులు సాధించిన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది మంది ఉత్తమ రైతులను ఉప రాష్ట్రపతి, గవర్నర్, సీఎం సత్కరించారు. ఏపీకి చెందిన యనమదల రామ్మోహన్ రావు, కలవగుంట్ల పెద వెంకటేశ్వరరావు, దావులూరి బాలకృష్ణ, నందిగం కిరణ్‌బాబు, కనిగంటి గంగాధర్, రాముడు, నాగరాజు, కనుగొల్ల రమణమ్మ, తెలంగాణకు చెందిన గురజాల నరసయ్య, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన రాజారాం బుధోధరి, మహారాష్ట్రకు చెందిన తాతారాంలను సత్కరించారు.
ఆకట్టుకున్న సీతారాముల విగ్రహాలు
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు సీతారామ లక్ష్మణుల ప్రతిమను అందించి సత్కరించారు. ఉప రాష్ట్రపతికి, సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్‌లకు మంత్రి పార్థసారథి నూజివీడు వీణలను బహుకరించారు.
ఘనస్వాగతం
ఉప రాష్ట్రపతి పర్యటన విజయవంతమైంది. గన్నవరం విమానాశ్రమం నుంచి రోడ్డు మార్గాన రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాప్‌కార్నికా ఫ్యాక్టరీకి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యా లయం నుంచి హెలికాప్టర్‌లో ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 9:30 నిమిషాలకు చేరుకున్నారు. వీరికి మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థ సారథి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, కలెక్టర్ వెట్రిసెల్వి, గౌర్మెట్ పాప్‌కార్నికా మేనేజింగ్ డైరెక్టర్ పట్టాభి రామారావు, సీఈవో యలమదల యుగంధర్, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఐజీపీ జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్, జేసీ అభిషేక్ గౌడ తదితరులు ఘన స్వాగతం పలికారు.
అభిమానుల కోలాహలం
ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎంలకు ముసునూరు గ్రామ ప్రజలు బారికేడ్ల వద్ద నిల్చొని అభివాదాలు చేసి.. స్వాగతం పలికారు. ఏడాది తర్వాత సీఎం నూజివీడు నియోజక వర్గానికి రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు హాజరుకావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. హెలిప్యాడ్ ప్రాంగణం జన సందోహంగా మారింది. నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మహిళలు, ప్రజలు, కూటమి నాయకులు భారీగా తరలివచ్చారు. హెలికాప్టర్ దిగిన సీఎం చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా ప్రజలు సైతం సీఎంకు అభివాదం చేస్తూ సీబీఎన్, సీబీఎన్ అంటూ ఆనందోత్సాహాలతో నినాదాలు చేశారు.
గొర్రెల పెంపకందారులకు రూ.12 కోట్ల చెక్కు అందజేత
గొర్రెల పెంపకందారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా డీసీసీబీ బ్యాంక్ సహకారంతో రూ.12 కోట్లతో 400 మందికి గొర్రెల కొనుగోలుకు రుణ సౌకర్యం నమూనా చెక్కును లబ్ధిదారులకు అందజేసి, రైతుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. గొర్రెల పెంపకం దారులు అభిమానంతో గొర్రె పిల్లను, నల్లటి కంబలిని సీఎంకు బహుకరించారు. గొర్రెల పెంపకందారులకు రుణ సౌకర్యం కల్పించిన డీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్, మంత్రి కొలుసు పార్థసారథిలను సీఎం అభినందించారు. గొర్రెల పెంపకం ద్వారా కుటుంబాలు ఆర్థిక స్థితిగతులను మెరుగు పరుచుకుని, ఆర్థికంగా బలపడి సమాజంలో గౌరవంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని అభివృద్ధి చేసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. సబ్ కలెక్టర్ బి.వినూత్న, జనరల్ మేనేజర్ ఎన్.రంగబాబు, తహసీల్దార్ దాసరి ప్రశాంతి, ఎంపీడీవో పి.ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.