నేడు ముసునూరుకు ఉప రాష్ట్రపతి రాక
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:16 AM
భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఏలూరు జిల్లా పర్య టనకు సోమవారం విచ్చేయనున్నారు
నూతన పాప్ కార్నికా సీడ్ ఆవిష్కరణ
ఉత్తమ రైతులకు సన్మానం
సీఎం చంద్రబాబు, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, మంత్రులు హాజరు
పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు
ముసునూరు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి):భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఏలూరు జిల్లా పర్య టనకు సోమవారం విచ్చేయనున్నారు.ప్రత్యేక విమా నంలో ఉపరాష్ట్రపతి 9:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ఉప రాష్ట్రపతి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా ఫ్యాక్టరీకి చేరుకుని నూతన పాప్ కార్నికా సీడ్‌ను ఆవిష్కరిస్తారు. బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉత్తమ రైతుల ను సన్మానిస్తారు.
ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం రాక
ఉప రాష్ట్రపతి పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 9.55 గం.లకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.15 గం.లకు ముసునూరు మండలం కాట్రేనిపాడులోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. చేరుకుంటారు. వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. 10.45కు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలసి సీఎం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం ఉప రాష్ట్రపతితో కలిసి సీడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి బయల్దేరి మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
ట్రాఫిక్ మళ్లింపు
ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ ఉన్నతాధి కారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గన్నవరం నుంచి ఉప రాష్ట్రపతి రోడ్డు మార్గం ద్వారా వస్తు న్న క్రమంలో కొత్తపల్లి, కాట్రేనిపాడు మీదుగా పాప్ కార్నికా ఫ్యాక్టరీకి వెళ్లే రహదారికిలో ఎటువంటి వాహనాలు రాకుండా ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ముసునూరు వైపు వచ్చే వాహనా లను వలసపల్లి వైపు, హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను నూజివీడు వైపు మళ్లించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ
ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ తెలిపారు. ఆదివారం గౌర్మెట్ పాప్‌కార్నికా ఫ్యాక్టరీలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భద్రతా విధులకు 459 మంది సిబ్బందిని వినియో గిస్తున్నాం. ఇందులో ముగ్గురు ఏఎస్పీలు, ముగ్గురు డీఏస్పీలు, 13 మంది సీఐలు, 31మంది ఎస్‌ఐలు, 309మంది ఏఎస్‌ఐలు, హెచ్‌సీ, పీసీ, డబ్ల్యూపీసీలు, 30మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 20 మంది రోప్ సిబ్బంది, 50 మంది హోంగార్డులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. సిబ్బంది పరస్పరం సమన్వ యంతో పని చేయా’లంటూ దిశా నిర్దేశం చేశారు. ఏఎస్పీలు వై.ప్రసాద్‌రావు, జి.ముని రాజా, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉప రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలి
మంత్రి పార్థసారథి
ముసునూరులో భారత ఉప రాష్ట్రపతి పర్యట నను అన్నిశాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ ఆశోక్ కుమార్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్, సీఎం కార్యక్రమాల సమ న్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, జేసీ డాక్టర్ ఎం.అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర భద్రతా అధికారు లతో కలిసి ఆదివారం మంత్రి ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వివిధ పంటలు పండించడంలో దేశంలోనే నూజివీడు నియోజకవర్గానికి గుర్తింపును, మంచి విజయాన్ని రైతన్నలు తీసుకురావడం శుభపరిణామం. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ఆదర్శ రైతులను సన్మానించడం చారిత్మాత్మక ఘట్టం. పర్యటన సజావుగా జరిగేలా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నా’మని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, తహసీల్దార్ దాసరి ప్రశాంతి, ఎంపీడీవో పి.ఏసుబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.