ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:40 AM
ముసునూరు మండలం కాట్రేనిపాడులో భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఈనెల 27న పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, కలెక్టర్ వెట్రిసెల్విల నేతృత్వంలోని అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
నూజివీడు (ముసునూరు)/నూజివీడు టౌన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):ముసునూరు మండలం కాట్రేనిపాడులో భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఈనెల 27న పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, కలెక్టర్ వెట్రిసెల్విల నేతృత్వంలోని అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత, కాన్వాయ్ వెళ్లే మార్గాలు, హెలీప్యాడ్, సభాస్థలిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్‌శాఖ, రెవెన్యూ, ఈసందర్భంగా రవాణ, ఇతరశాఖల అధి కారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రోటోకాల్, ముందస్తు జాగ్రత్తలు, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర ప్రణాళికలపై స్పష్టమైన మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడ, ఏఎస్పీ అడ్మిన్ ప్రసాదరావు, ఏఆర్ ఏఎస్పీ మునిరాజా, డీఎస్పీ ప్రసాద్, సబ్ కలెక్టర్ వినూత్న, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
22న పర్యటన షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత : ఎస్పీ
నూజివీడు రూరల్ సీఐ కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి 22న జరిగే ఏఎస్‌ఎల్ సమావేశం అనంతరం పర్యటన షెడ్యూల్, ట్రాఫిక్ డైవర్షన్లపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. ప్రధాన కూడళ్లు, ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఊళ్లకు వెళ్లే సమ యంలో ఇంటి వద్ద పోలీస్‌శాఖ అందించే ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవ లను వినియోగించుకోవాలన్నారు. ఉద్యోగం, వీసా ఇప్పిస్తామని డబ్బులు అడిగే వారిని నమ్మవద్దన్నారు. నూజివీడులో రోడ్లు విశాలంగా ఉన్నప్పటికీ ఇష్టానుసార పార్కింగ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయన్నారు. అనంతరం డీఎస్సీ కార్యాల యాన్ని పరిశీలించారు. త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. డీఎస్పీ ప్రసాద్, సీఐ నాగేంద్రకుమార్, ఎస్‌ఐలు జ్యోతిబసు, చిరంజీవి, పాల్గొన్నారు.