Share News

గోవిందా.. గోవింద

ABN , Publish Date - May 24 , 2026 | 12:23 AM

సుర్రుమంటున్న సూరీడి తాపాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు శనివారం శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు.

గోవిందా.. గోవింద
శ్రీవారి ఆలయ కేశఖండనశాల వద్ద భక్తుల రద్దీ

ఎర్రటి ఎండలోనూ చినవెంకన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ద్వారకాతిరుమల, మే 23 (ఆంధ్రజ్యోతి): సుర్రుమంటున్న సూరీడి తాపాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు శనివారం శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తన ప్రతాపాన్ని చూపింది. వేసవి సెలవులు కావడంతో భక్తులు రాక క్రమేపి ఆలయంలో పెరగడంతో వారికి సకలసౌకర్యాలు సమకూర్చడంలో అధికారులు నిమగ్నమయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న చోట టెంట్లు, వాటర్‌ క్యాన్‌లను ఏర్పాటు చేశారు. క్యూలైన్ల వద్ద కూలర్ల ద్వారా చల్లని గాలి వచ్చే సదుపాయాన్ని కల్పించారు. క్యూకాంప్లెక్స్‌ వద్ద సేవాదళ్‌ సభ్యుల ద్వారా మంచినీరు, వడ, జావను భక్తులకు అందించారు. దాదాపు 30వేల మంది పైబడి భక్తులు స్వామి దర్శనార్దం వచ్చినట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని విభాగాలను ఆలయ ఈవో త్రినాథరావు పర్యవేక్షిస్తూ భక్తులకు అదనపు సౌకర్యాల కల్పనకు సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు.

చల్లం‘గుండు’

నున్నటి గుండు.. ఆపై ఎర్రటి ఎండ.. చుర్రుమంటుంది కదూ... అందుకే ఆ గుండుపై చందన లేపనం పూస్తే.. ఆ హాయే వేరబ్బా అంటూ పలువురు భక్తులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. శ్రీవారి క్షేత్రానికి వచ్చి తలనీలాలను సమర్పించుకున్న భక్తులు భానుడి ప్రతాపానికి తట్టుకోలేక కొందరు తమ గుండులకు చందన లేపనం పూయించుకుని సేదతీరుతున్నారు.

Updated Date - May 24 , 2026 | 12:23 AM