కల్యాణ వైభోగమే..
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:37 AM
సర్వజగద్రక్షకుడైన చిన్నతిరుమలేశుడు సర్వాభరణ భూషితుడై పెండ్లి అలంకరణలో ఉండి, నుదుటున కల్యాణ తిలకం.. బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకు తున్న అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్లను పరిణయమాడారు.
చిన్నతిరుమలేశుని కల్యాణం.. కడురమణీయం
ఐదో రోజు కొనసాగుతున్న వేంకటేశ్వరస్వామి దివ్య బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సర్వజగద్రక్షకుడైన చిన్నతిరుమలేశుడు సర్వాభరణ భూషితుడై పెండ్లి అలంకరణలో ఉండి, నుదుటున కల్యాణ తిలకం.. బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకు తున్న అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్లను పరిణయమాడారు. ఈ కల్యాణ ఘడియలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తజనులు తరించారు. ఈ అద్భుత దృశ్యం పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నతిరుపతివాసుని ఆలయంలో ఆదివారం రాత్రి ఆవిష్కృతమైంది. ఈనెల 21 నుంచి ప్రారంభమైన శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగాఐదో రోజైన ఆదివారం ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ముందుగా వేర్వేరు తొళక్క వాహనాలపై శ్రీవారు, అమ్మవార్లను ఉంచి అలంకరించి ఆలయ తూర్పుగోపుర సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకు తెచ్చారు. అంతకు ముందే వేదికను పచ్చిపూలతో, కళాసౌందర్యాలతో నయనానందకరంగా అలంకరించారు. వేదికపై ఉంచిన బంగారు సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి అలంకరించి అర్చకులు కల్యాణతంతును ప్రారంభించారు. ఆదివారం ఉదయం క్షేత్ర తిరువీధుల్లో సింహవాహనంపై అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్లు సమేతంగా కొలువైనఆ దేవదేవుడు భక్త్తులకు దర్శనమిచ్చారు. యోగమూర్తిగా అభయహస్తాన్ని ఇస్తూ.. దుష్టజన సంహారానికి, భక్తజన సంరక్షణకు సంకేతంగా స్వామి సింహవాహనంపై ఊరేగారు.
కల్యాణతంతు ఇలా..
పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిగిన ఈ కల్యాణతంతులో భాగంగా ఆలయ అర్చకులు ముందుగా విష్వక్సేన ఆరాధన, పుణ్యహవాచన, రక్షాబంధన ఆరాధన చేశారు. దాన్ని స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. ఈ సమయంలో ఆలయ చైర్మన్ రాజా ఎస్‌వీ సుధాకరరావు, ఈవో వేండ్ర త్రినాథరావు దేవస్థానం
తరఫున కల్యాణమూర్తులకు పట్టువస్త్రాలను అందజే శారు. ఆ తరువాత అర్చకులు కల్యాణమూ ర్తులకు మధుపర్కాలను సమర్పించారు. సుముహూర్త సమయంలో జీలకర్ర, బెల్లం ధరింపచేసి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాలు వైభవోపేతంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారి కల్యాణవైభోగాన్ని వీక్షించి తరించారు.
జగన్మోహినిగా.. వెంకన్న
అపురూప లావణ్యాలను ఒలికిస్తూ.. మోహినీ అలంకరణలో శ్రీవారు భక్తజను లకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు ముగ్దమనోహర రూపలావణ్యాలతో జగన్మోహిని అలంకరణలో భక్తులను కటాక్షించారు.