Share News

శ్రీవారి హుండీల ఆదాయం రూ.1.27 కోట్లు

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:45 PM

వేంకటేశ్వరస్వామి ఆలయంలో 15 రోజులకు నిర్వహించిన హుండీల సొమ్ము లెక్కింపులో రూ.1,27,88,160 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.

శ్రీవారి హుండీల ఆదాయం రూ.1.27 కోట్లు
హుండీల సొమ్ము లెక్కిస్తున్న సిబ్బంది

ద్వారకాతిరుమల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : వేంకటేశ్వరస్వామి ఆలయంలో 15 రోజులకు నిర్వహించిన హుండీల సొమ్ము లెక్కింపులో రూ.1,27,88,160 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో అధికారులు, సేవా సిబ్బంది ఆధ్వర్యంలో హుండీలను తెరిచి లెక్కించారు. కరెన్సీ నోట్ల రూపంలో రూ.1,18,68,452. నాణేల రూపంలో రూ.7,14,320 లభించాయి. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,85,390, గోసంరక్షణ ట్రస్టుకు రూ.19,998 భక్తులు కానుకలుగా సమర్పించారు. ఈ పక్షం రోజుల్లో సగటున రోజుకు రూ.8,52,544 చొప్పున హుండీ ఆదాయం లభించాయన్నారు. నగదుతోపాటు 167 గ్రాముల బంగారం, 1.573 కిలోల వెండి, పలు విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. భీమవరం మావుళ్లమ్మ ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ అండ్‌ ఈవో బీఎల్‌ నగేష్‌బాబు, చింతమనేని హనుమంతరావు పాల్గొన్నారు.

ముగిసిన వరుణ యాగం

శ్రీవారి క్షేత్ర పాలకుడైన శివదేవుని ఆలయంలో రెండు రోజులుగా జరుగుతున్న వరుణయాగం గురువారం జరిగిన విశేష కార్యక్రమంతో ముగిసింది. ఆలయ ప్రాంగణంలో ఉంచిన వెయ్యి ఘటాలలో మంత్రపూత జలంతో అర్చకులు, పండితులు వేదమంత్రాలతో స్వామివారికి అభిషేకించారు. అనంతరం ఆలయ యాగశాలలో వరుణయాగం జరిగింది. సాయంత్రం శ్రీమహా పూర్ణాహుతీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు.

Updated Date - Oct 08 , 2026 | 11:45 PM