Share News

శ్రీవారి కనుమ ఉత్సవాలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:31 AM

శ్రీవారి క్షేత్రానికి సమీప గ్రామమైన దొరసానిపాడులో ఈనెల 16న కనుమ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

శ్రీవారి కనుమ ఉత్సవాలకు ఏర్పాట్లు
దొరసానిపాడులో కనుమ మహోత్సవానికి ముస్తాబవుతున్న మండపం

16న దొరసానిపాడులో ‘కనుమ’కు మండపం ముస్తాబు

14న గోదాకల్యాణం

15న నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు

ద్వారకాతిరుమల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి క్షేత్రానికి సమీప గ్రామమైన దొరసానిపాడులో ఈనెల 16న కనుమ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈక్రమంలో మండపాన్ని, పరిసరాలను సిబ్బంది సుందరీకరిస్తున్నారు. గ్రామంలో స్థానికులు పలు ప్రధాన కూడళ్లలో పోస్టర్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ ఏటా సంక్రాంతి పర్వదినాలలో కనుమ పండుగ రోజున సాయంత్రం చినవెంకన్న, ఉభయదేవేరులతో కలిసి ఆ గ్రామానికి అట్టహాసంగా వెళతారు. ఏడాదికోమారు తమ గ్రామానికి వచ్చే స్వామి ఆగమనం కోసం ఆ గ్రామస్థులు ఎంతో నియమనిష్టలు, భక్తిప్రపత్తులతో ఎదురుచూస్తారు. మాంసాహారాన్ని భుజించే కనుమ రోజున సైతం వారు ముట్టరు. ఉభయదేవేరులతో కొలువైన శ్రీవారు రాజాధిరాజ వాహనాన్ని అధిరోహించి క్షేత్రం నుంచి బయలుదేరి అక్కడ మండపానికి చేరుకుంటారు. అక్కడ జరిగే పూజలు భక్తులను అలరిస్తాయి. ఈనెల 14న భోగి రోజున గోదాదేవి కల్యాణాన్ని జరుపుతామని, అదేవిధంగా సంక్రాంతి రోజున నిత్యార్జిత కల్యాణాన్ని రద్దు చేస్తున్నామని భక్తులు గమనించాలని ఈవో వై.భద్రాజీ కోరారు.

మార్మోగిన గోవింద నామస్మరణ

గోవిందనామాలతో శ్రీవారి క్షేత్రం శనివారం శోభిల్లింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి ఉదయం నుంచి భక్తులు 18 వేల మంది వరకు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

గోదాదేవి సమేతంగా ఊరేగిన స్వామి, అమ్మవార్లు

గజ, అశ్వ సేవల నడుమ శ్రీవారి ధనుర్మాస ఉత్సవం శనివారం ఉదయం క్షేత్రపురవీధుల్లో వైభవంగా జరిగింది. ముందుగా ఆల యంలో స్వామి, అమ్మవార్లను గోదాదేవి సమేతంగా తొళక్కవాహనంపై ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం పూజాధికాలను నిర్వహించి హారతులు ఇచ్చారు. ఆ తరువాత అట్టహాసంగా తిరువీధులకు తీసుకురాగా ప్రతీ ఇంటిముందు స్వామివారి దివ్యమూర్తులకు అర్చకులు హారతులు పట్టారు.

Updated Date - Jan 11 , 2026 | 12:31 AM