వాహనాల బదిలీ.. ఇక ఈజీ
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:21 AM
వాహనాల కొనుగోలుదారుల మధ్య విక్రయదారుల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా నిముషాల్లోనే లావాదేవీలు పూర్తి అయిపోయే వెసులుబాటు వచ్చింది.క్షణాల్లోనే వాహనం కొనుగోలు చేసిన వ్యక్తిపై ఆటో అప్‌లోడ్ విధానాన్ని ఈ నెల 18 నుంచి అమలులోకి తీసుకువచ్చారు.
వాహనం విక్రయించిన వారి
ఫోన్ నంబర్‌కు ఓటీపీ
ఓటీపీ చెబితే వాహనం బదిలీ
ఏలూరు క్రైం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఒక మోటారు వాహనాన్ని మరొకరికి విక్రయించినప్పుడు బదిలీ చేయాలంటే విక్రయించిన వ్యక్తి ఆన్‌లైన్‌లో తన వేలిముద్రను వేసి అనుమతిని ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తిపలికి కేవలం ఆధార్‌కార్డుకు లింకు అయిన ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్తే వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి పేరున క్షణాల్లో రికార్డులన్నీ మారిపోతాయి. ఈ విధానాన్ని శుక్రవారం నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఒక మోటారు వాహనాన్ని విక్రయించిన వ్యక్తి ఆర్టీఏ ఆఫీసుకు వచ్చి ఆన్‌లైన్‌లో వేలిముద్రను వేసి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తంబ్ వేయాల్సిన వ్యక్తి ఖాళీ లేదనో తరువాత చూద్దామంటూ కాలయాపన చేస్తూ తరువాత అడ్డం తిరుగుతున్నారు. ఇలాంటి ఎన్నో గొడవలు, కేసులు నమోదు అయిన సంఘటనలు ఉన్నాయి. కొన్ని ఫైనాన్స్ కంపెనీల్లో మేనేజర్లుగా ఉన్న వారు వారు పనిచేసిన కాలంలో వారికి తంబ్‌ను అధికారికంగా అనుమతిస్తున్నారు. వారు మానివేయడంతో వారు ఎక్కడ ఉన్నారో తెలియక వారి తంబ్ కోసం ఫైనాన్స్ తీరిపోయి మొత్తం చెల్లించిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు అన్నింటికి పరిష్కారం చేస్తూ క్షణాల్లోనే వాహనం కొనుగోలు చేసిన వ్యక్తిపై ఆటో అప్‌లోడ్ విధానాన్ని ఈ నెల 18 నుంచి అమలులోకి తీసుకువచ్చారు.
వివాదాలు లేకుండా క్షణాల్లో పని
ప్రస్తుతం ఒక వ్యక్తి వాహనాన్ని మరొకరికి విక్రయించిన సమయంలో మొదటి యజమాని ఆధార్‌కార్డు, ఆ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూ రెన్సు, పొల్యూషన్, ట్రాన్స్‌పోర్టు అయితే అందుకు సంబంధించిన ధృవపత్రాలను ఒరిజినల్స్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో ఆ వ్యక్తి ఆధార్‌కార్డు అప్‌లోడ్ చేసి అతని ఫోన్ నంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. మొదటి యజమాని ఆధార్‌కార్డుకు లింకు అయిన ఫోన్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ జరిగి మరుక్షణంలోనే కొనుగోలు చేసిన యజమాని పేరు మీద ధృవపత్రాలన్నీ మారి పోతాయి. ఇప్పటి వరకూ విక్రయించిన యజమాని తన వేలి ముద్ర వేస్తే ఆ వాహనానికి సంబంధించిన రికార్డులన్నీ అప్‌లోడ్ చేస్తే వాటిని రవాణాశాఖ అధికారులు పరిశీలించి అఫ్రూవల్ చేసే వారు. కానీ ప్రస్తుతం రవాణాశాఖ అధికారులతో ఈ బదిలీ లావాదేవీల్లో ఎలాంటి పని లేకుండా అటో అప్రూవల్ చేశారు. అప్‌లోడ్ చేసిన రికార్డులన్నీ ఒరిజినల్ అయితే వాటిని సాఫ్ట్‌వేర్ పరిశీలించుకుని అనుమతి ఇచ్చేస్తుంది. దీంతో వాహనాల కొనుగోలుదారుల మధ్య విక్రయదారుల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా నిముషాల్లోనే లావాదేవీలు పూర్తి అయిపోయే వెసులుబాటు వచ్చింది. సెలవు రోజుల్లో కూడా ఈ సర్వర్లు పనిచేస్తూనే ఉంటాయి.