Share News

వసూళ్లలో ఫిట్‌!

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:29 PM

రవాణా వాహనాల సామర్థ్య ధ్రువీకరణ పత్రం(ఎఫ్‌సీ) జారీని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లు(ఏటీఎస్‌) వాహనదారులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.

వసూళ్లలో ఫిట్‌!
పాలకోడేరు మండలంలో ఉన్న ఏటీస్‌

ఎఫ్‌సీకి అదనపు బాదుడు!

ఏటీఎస్‌లో ఫిట్‌నెస్‌కు వాహనదారులపై అదనపు భారం

లారీ, బస్సులకు రూ.3 వేలు.. ఆటోకు రూ.700 వసూళ్లు

కొరవడిన అధికారుల పర్యవేక్షణ.. తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహారం

పర్యవేక్షణ కొరవడిందంటున్న వాహనదారులు

రవాణా వాహనాల సామర్థ్య ధ్రువీకరణ పత్రం(ఎఫ్‌సీ) జారీని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లు(ఏటీఎస్‌) వాహనదారులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. పాలకోడేరు మండలంలో ఏర్పాటు చేసిన ఏటీఎస్‌లో ప్రభుత్వ నిర్దేశిత ఫిట్‌నెస్‌ రుసుముతోపాటు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పెద్ద లారీలు, విద్యాసంస్థలు, ట్రావెల్స్‌ బస్సులకు రూ.3,500 వరకు, ఆటోలకు రూ.700, ఏడు సీట్ల క్యాబ్‌లకు రూ.1,000, టెంపోలకు రూ.1,500 వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

(భీమవరం, ఆంధ్రజ్యోతి):

వాహనాల ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏటీఎస్‌లను అమలులోకి తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తుండగా, ఏపీలో ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. దీనిద్వారా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఫిట్‌నెస్‌ కోసం గతంతో పోలిస్తే తమపై ఆర్థిక భారం పెరిగిందని వాహనదారులు చెబుతున్నారు. గతంలో రవాణా శాఖ అధికారులు స్వయంగా వాహనాలను తనిఖీ చేసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేసేవారని, ఇప్పుడు ఏటీఎస్‌లకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఫిట్‌నెస్‌ పొందేందుకు అయ్యే ఖర్చు పెరిగిందని వాహనదారులు చెబుతున్నారు. ఏటీఎస్‌ కేంద్రాలను ఏర్పాటుచేసిన నేపథ్యంలో ప్రభుత్వం రెండేళ్లపాటు ఫిట్‌నెస్‌ రుసుములో వెసులుబాటు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఏటీఎస్‌ నిర్వాహకులకు చెల్లించే విధానం ఉన్నట్లు సమాచారం. వాహనదారులు చెల్లిస్తున్న అదనపు సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

పర్యవేక్షణ ఎక్కడ?

ఏటీఎస్‌లలో ఫిట్‌నెస్‌ పరీక్షలు జరుగుతున్నప్పటికీ, రవాణా శాఖ అధికారులు వాటిపై పర్యవేక్షణ తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటీఎస్‌ల నిర్వహణతో తమకు నేరుగా సంబంధం లేదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. గతంలో రవాణా శాఖ అధికారులు వాహనాల ఫిట్‌నెస్‌ను పరిశీలించడంతోపాటు, వాహనాల్లో లోపాలు ఉన్నాయా? డ్రైవర్‌కు అవసరమైన అర్హతలు ఉన్నాయా? వంటి అంశాలను తనిఖీ చేసేవారు. డ్రైవర్‌ వయస్సు, ప్రథమ చికిత్స కిట్‌ అందుబాటులో ఉందా? తదితర అంశాలనూ పరిశీలించే వారని వాహనదారులు చెబుతున్నారు. ఏటీఎస్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ తరహా తనిఖీలు తగ్గిపోయాయని వారు అంటున్నారు. జిల్లాలో ఏటీఎస్‌ ప్రారంభమైన తొలినాళ్లలో విద్యాసంస్థల బస్సులపై తనిఖీలు నిర్వహించినప్పటికీ, ఆ తర్వాత అవి కొనసాగడం లేదు.

రహదారులపైనే తనిఖీలు

ప్రస్తుతం రవాణా శాఖ అధికారులు ప్రధానంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. లైసెన్స్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ వంటి పత్రాలు ఉన్నాయా? లేదా? అన్నదానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. పత్రాలు సక్రమంగా ఉంటే వాహనాన్ని విడిచి పెడుతున్నారు. వాహనం వాస్తవంగా రోడ్డుపై నడిచే స్థితిలో ఉందా? దాని సాంకేతిక సామర్థ్యం ఎలా ఉంది? వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు తక్కువగా ఉంటున్నాయి. అయితే ఫిట్‌నెస్‌ పరీక్షల నాణ్యత, ఏటీఎస్‌లలో అనుసరిస్తున్న విధానం, అదనపు రుసుములపై రవాణా శాఖ అధికారుల స్పష్టమైన వివరణ అవసరం.

ఏటీఎస్‌ కేంద్రానికి వెళ్లాలన్నా ఇబ్బందే

పాలకోడేరు మండలంలో ఏర్పాటు చేసిన ఏటీఎస్‌ కేంద్రానికి జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి వాహనాలను తీసుకెళ్లడం వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది. ఆటోలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దూర ప్రయాణం చేయాల్సి రావడంతో ఇంధన ఖర్చు పెరగడంతోపాటు ఒకరోజు మొత్తం వాహనాన్ని నడపలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఆటోలు నిర్ణీత పరిమితికి మించి ప్రయాణిస్తే కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వాహనదారుల్లో ఉంది. దీంతో ఫిట్‌నెస్‌ కోసం ఏటీఎస్‌ కేంద్రానికి వెళ్లడమే అదనపు వ్యయంగా మారుతోందని వారు పేర్కొంటున్నారు.

మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు వినతి

జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు ప్రాంతాల్లోనూ ఏటీఎస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ సమస్యను మొగల్తూరుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా విస్తీర్ణం, వాహనాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని మరిన్ని ఏటీఎస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తే దూరభారం తగ్గుతుందని వాహనదారులు చెబుతున్నారు. అధికారిక ఫీజులు, అదనపు చెల్లింపులు, ఏటీఎస్‌ పరీక్షల విధానం, రవాణాశాఖ పర్యవేక్షణపై స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - Oct 08 , 2026 | 11:29 PM