తాడేపల్లిగూడెంలో వందేభారత్‌కు హాల్ట్
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:27 AM
తాడేపల్లిగూడెంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మరో 15 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని శ్రీనివాస వర్మ వెల్లడించారు.
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
భీమవరంటౌన్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మరో 15 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని శ్రీనివాస వర్మ వెల్లడించారు. జిల్లాలో రైల్వే సర్వీసుల విస్తరణలో తాము సాధించిన పురోగతిని వివరిస్తూ, గతంలో ఉన్న 9 ప్రత్యేక రైళ్లను ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మార్చినట్లు ప్రకటించారు. సికింద్రాబాద్– అనకా పల్లి (17043/44), చర్లపల్లి – భువనేశ్వర్ న్యూ ఎక్స్‌ప్రెస్ (17067/68) రైళ్లు ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. చర్లపల్లి – అనకాపల్లి (17045/46), చర్లపల్లి – అ నకాపల్లి (17053/54), కాకినాడ టౌన్ – హిసార్ ఎక్స్‌ప్రెస్ (17 295/96) రైళ్లు తాడేపల్లిగూడెంలో నిలుపుదల సౌకర్యం కలిగి ఉన్నాయన్నారు. ని యోజకవర్గంలోని ఇతర ప్రాంతాల ప్రయాణికుల కోసం తిరుపతి – నరసాపురం (17427/28) రైలు ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు, నరసాపురం స్టేషన్లలో ఆగుతుందన్నారు. కాకినాడ టౌన్ – లింగంపల్లి (12775/76), కాకినాడ టౌన్ – మైసూర్ ఎక్స్‌ప్రెస్ (17289/90) రైళ్లు తణుకు, భీమవరం టౌన్, ఆకివీడులో నిలుస్తాయని తెలిపారు. చర్లపల్లి – న రసాపురం ఎక్స్‌ప్రెస్ (17061/62) రైలు ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు, నరసా పురం స్టేషన్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని మంత్రి శ్రీనివాస వర్మ వివరించారు.
త్వరలో ఎన్‌హెచ్ – 165 నిర్మాణ పనులు
జాతీయ రహదారి –165 నిర్మాణ పనులు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని, త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్‌హెచ్–165 రహదారి నిర్మాణంపై కొందరు అనవసర అపోహలు సృష్టిస్తున్నారన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో స్వయంగా మాట్లాడడంతో రూ.2,400 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల రీసర్వే నిర్వహించాల్సి రావడంతో అలైన్‌మెంట్‌లో చిన్న మార్పులు, నిర్మాణ వ్యయంలో స్వల్ప పెరుగుదలతో కేంద్ర క్యాబినెట్ అనుమతి పొందాల్సి ఉందన్నారు. అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామన్నారు.
మావిగన్ ఆలోచనలు ఎలా వస్తాయో..!
మావిగన్ అనే పదం ఏదో మలయాళం పదంలా ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఇటువంటి ఆలోచనలు ఎలా వస్తాయో, ఇలాంటి వింత సలహాలు ఎవరు ఇస్తారో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులంటూ ప్రజలను గందరగోళానికి గురిచేశారన్నారు.
మహిళా సాధికారత దిశగా ముందడుగు
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా దేశం చారిత్రాత్మక అడుగు వేయబోతోందని శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఖాయమని మంత్రి వర్మ ధీమా వ్యక్తం చేశారు.