వనామి రొయ్యకు మంచుగండం
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:50 AM
వనామి రొయ్యకు పొగమంచు గండం పొంచిఉంది. ఉదయం వేళల్లో మంచుదట్టంగా కురుస్తుండటంతో చెరువుల్లో నీటిపై మంచు దుప్పటి కమ్ముకోవడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి వనామి రొయ్యలు కౌంట్‌కు రాకుండానే చిన్నసైజు రొయ్యలు చనిపోతున్నాయి.
ఆక్సిజన్ కొరతతో చనిపోతున్న రొయ్యలు
కలిదిండి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): వనామి రొయ్యకు పొగమంచు గండం పొంచిఉంది. ఉదయం వేళల్లో మంచుదట్టంగా కురుస్తుండటంతో చెరువుల్లో నీటిపై మంచు దుప్పటి కమ్ముకోవడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి వనామి రొయ్యలు కౌంట్‌కు రాకుండానే చిన్నసైజు రొయ్యలు చనిపోతున్నాయి. జిల్లాలో సుమారు లక్షా 10వేలు ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉదయం వేళ పొగమంచు దట్టంగా పడుతుండటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలు చెరువుల్లో ఆక్సిజన్ అందక చిన్నసైజురొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. వీటిని వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో ఏలూరు, ఆకివీడు మార్కెట్‌లో అయినకాడికి అమ్ముకుంటున్నారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టపోతున్నారు. ఎకరానికి రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారు. కనీసం ఖర్చులు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. చని పోయిన రొయ్యలు రంగు మారటంతో వాటిని వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో వాటిని గోతుల్లో వేసి పూడ్చుతున్నారు. రొయ్యలకు ఆక్సిజన్ అందించేందుకు లక్షల రూపాయలు వ్యయంతో ఏరియేటర్లు ఏర్పాటు చేసినప్పటికి ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. రొయ్యలు చనిపోతుండడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో పెట్టుబడులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పొగమంచు కారణంగా చెరువుల్లో నీటిపై తెల్లటి తెట్టు ఏర్పడటంతో ఆక్సిజన్ లోపిస్తుంది. దీంతో రొయ్యలు నీటి పై తేలాడుతుంటాయి. చెరువుల్లో ఆక్సిజన్ ఉత్పన్నమవడానికి ఉదయాన్నే చెరువుల్లో ఏరియేటర్లతో పాటు బోట్లను తిప్పుతూ ఆయిల్ ఇంజన్లతో నీటిని రీసైక్లింగ్ చేయాలి. దీంతో చెరువులో కెరటాలు రావడంతో ఆక్సిజన్ ఉత్పన్నమవుతుంది. మేతలు తక్కువగా వే యాలి. శీతాకాలంలో మంచు కారణంగా రొయ్యలకు వ్యాధులు, వైరస్ సోకు తాయి. వ్యాధులు సోకిన రొయ్యలను ల్యాబ్‌లలో పరీక్షలు జరిపి మందులు వాడాలి’ అని మత్స్యశాఖ జిల్లా ఇన్‌చార్జ్ అధికారి బి.రాజ్‌కుమార్ తెలిపారు.