యూరియాకు రెక్కలు!
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:27 AM
మండలంలో యూరియా అమ్మకాలు పక్కదారి పట్టాయు. మండల పరిధిలోని ఉప్పేరు ఎరువుల దుకాణం నుంచి ఇష్టారాజ్యంగా యూరియా విక్రయాలు అక్రమంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణకు అక్రమంగా తరలింపు
రూ.లక్షలు గడిస్తున్న అక్రమార్కులు
ఉప్పేరులో ఇష్టారాజ్యంగా అమ్మకాలు
వ్యవసాయ సిబ్బంది పాత్ర పైనా ఆరోపణలు
కుక్కునూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):మండలంలో యూరియా అమ్మకాలు పక్కదారి పట్టాయు. మండల పరిధిలోని ఉప్పేరు ఎరువుల దుకాణం నుంచి ఇష్టారాజ్యంగా యూరియా విక్రయాలు అక్రమంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా వ్యవసాయ శాఖ సిబ్బంది కన్నుసన్నల్లోనే జరుగుతోందని, వారి పాత్రపై విచారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక యూరియా బస్తా కొనుగోలు చేయాలంటే ఆ రైతుకి భూమి ఉండాలి. లేదంటే కౌలుకు భూమి సాగు చేస్తూ ఉండాలి. కానీ ఆధార్‌కార్డు ఉంటే చాలు అక్రమంగా యూరియా బస్తాలు ఇచ్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్
యూరియా అక్రమాలను అరికట్టేందుకు ఏపీ ప్రభు త్వం ఈ ఏడాది ఏపీఏఐఎంఎస్ – 2.0 అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌లో రైతులు తమ భూమి, ఆధార్ వివరాలు ఇస్తే ఫోన్‌లింక్‌కు వచ్చే ఓటీపీ, లేదంటే వేలిముద్ర ద్వారా యూరియా, ఇతర ఎరు వులు పొందవచ్చు. కుక్కునూరు, వేలేరుపాడు మండ లాల్లో దాదాపు 30 వేల ఎకరాల భూములున్నాయి. ఆదివాసీ రైతాంగం దాదాపు ఐదు వేల ఎకరాల పోడు భూములు సాగు చేస్తున్నారు. ఆ భూములకు పట్టా లేనందున భూమి వివరాలు, పత్తి గింజల కొనుగోలు రసీదు చూపించి ఆధార్‌కార్డుతో ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే యూరియా బస్తా ఇచ్చే వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. ఇది అక్రమార్కుల పాలిట వర మైంది. ఉప్పేరులో కొంతమంది అక్రమార్కులు వంద లాది మంది ఆదివాసీలను తీసుకొచ్చి వారు పత్తిపంట వేసినా, వేయకపోయినా వారి వివరాలు రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించారు. అనంతరం ఎరువుల దుకాణంకు వెళ్లి యూరియా బస్తాలను ఎక్కువ మొత్తంలో పొందారు. ప్రభుత్వం ఇచ్చిన యాప్ ప్రకా రం ఎకరం పత్తికి రెండు విడతలగా రెండు యూరి యా బస్తాలు, జామాయిల్‌కు ఒక విడతగా ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలి. ఉప్పేరులో ఈ నిబం ధనలు ఏవి పాటించకుండా నకిలీ పత్తి కొనుగోలు రసీదులు చూపించి అధిక మొత్తంలో యూరియా పొందినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అనంతరం అక్ర మార్కులు ఆ యూరియాను తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్లి ఒక్క యూరియా బస్తాను రూ.400 – 700 వరకు అమ్ముతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై స్థానిక వ్యవసాయ సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, వారి పాత్ర ఇందులో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో శనివారం రాత్రి జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషాఉప్పేరులోని ఎరువుల దుకాణంలో తనిఖీలు జరిపారు. రైతులకు బిల్లులు ఇవ్వలేదని ఆ షాప్‌ను సీజ్ చేశారు. కాగా ఈ వ్యవహారంపై మండల వ్యవసాయాధికారి బాలాజీ వివరణ ఇస్తూ.. ‘నిబంధనల ప్రకారం యూరియా సరఫరా జరిగింది ప్రభుత్వం ఇచ్చిన వెసులు బాటుతోనే ఆధార్ కార్డుతో పత్తిగింజల కొనుగోలు రసీదుతో యూరియా అందించా’మన్నారు.