ఏలూరు, నూజివీడులకు అర్బన్ హెల్త్ సెంటర్లు
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:30 AM
ఏలూరు జిల్లాలో రెండు అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
నూజివీడు టౌన్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లాలో రెండు అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో ఏలూరు గాలాయిగూడెం, నూజివీడు బంగినపల్లి తోటలో ఏర్పాటు చేయనున్నారు. నూజివీడులో ఇప్పటికే రెండు అర్బన్ పీహెచ్‌సీలు ఉండగా, గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం హెల్త్ క్లినిక్‌లు పేరుతో పేరుతో బంగినపల్లితోట, కోనేరుపేటలలో ఏర్పాటుచేశారు. బంగినపల్లి తోటలో భవన నిర్మాణాన్ని స్థానిక ఎంపీపీ పాఠశాలలో నిర్మించడాన్ని కోర్టు ఆదేశాలతో నిలిపివేశారు. అక్కడి నుంచి అర్బన్ పీహెచ్‌సీ భవనాన్ని ఆర్‌ఆర్ పేటలో నిర్మించే ప్రయత్నంలో కోవిడ్ పరిస్ధితులలో స్థానికులు వ్యతిరేకించారు. చివరకు నూజివీడు శివారు ఎమ్మార్ అప్పారావు కాలనీకి తరలించి రూ.80 లక్షలతో భవన నిర్మాణం పూర్తిచేశారు. బంగినపల్లి తోటలోని అద్దె భవనంలో నడుస్తున్న అర్బన్ పీహెచ్‌సీని ఎమ్మార్ అప్పారావు కాలనీలోకి తరలించేందుకు అధికారులు నిర్ణయం తీసుకోగా, బంగినపల్లితోట, కొత్తపేట తదితర ఐదారు వార్డుల ప్రజలు అర్బన్ పీహెచ్‌సీ తరలింపును వ్యతిరేకిస్తూ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి విన్నవించటంతో, మరో అర్బన్ పీహెచ్‌సీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నూజివీడుతోపాటు ఏలూరులో అవసరాలను బట్టి అక్కడ కూడా వీటిని ఏర్పాటు చేశారు.