పంచాయతీలపై పెత్తనం
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:05 AM
ఇంటి ప్లాన్‌లు గానీ, లేఅవుట్‌లకు అనుమతులు గానీ సింహభాగం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోనే మంజూరవు తున్నాయి.
పైసా ఇవ్వని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులన్నీ అక్కడి నుంచే
పల్లెల్లో ఆదాయానికి గండి
జిల్లాలో బకాయిలపై లెక్కతేలని వైనం
పదేళ్లుగా ఎదురుచూపులే
పట్టణాలకు మాత్రం చెల్లిస్తున్న ఇడా
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
పంచాయతీల్లో చిగురిస్తున్న ఆశలు
భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులపై పంచాయతీలు తమ అధికారాలను కోల్పోయాయి. చిన్న పాటి నివాసాలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నాయి. లేదంటే ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో అనుమతులు తెచ్చుకుంటున్నారు. దీంతో పంచాయతీల ఆదాయానికి గండి పడడంతో పాటు అధికారాల్లో కోత పడింది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఇంటి ప్లాన్‌లు గానీ, లేఅవుట్‌లకు అనుమతులు గానీ సింహభాగం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోనే మంజూరవు తున్నాయి. పల్లెల్లో లేఅవుట్ వేస్తే సిబ్బంది తనిఖీలకు వెళుతున్నారు. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఇడా) ఇచ్చే ఎల్‌పీ నంబర్ చూపిస్తున్నారు. దాంతో పంచాయతీ సిబ్బంది వెనుదిరుగు తున్నారు. ఎవరైనా ఇడాకు అనుమతులు పెట్టుకుంటే అక్కడ సిబ్బంది వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు ఎటువంటి అధికారం లేదు. పట్టణాల్లో అయితే ఇడా నుంచి మున్సిపాలిటీలకు ఆన్‌లైన్‌లో అనుమతులు వస్తాయి. ఇక్కడ సిబ్బంది తనిఖీ చేసి అంతిమంగా అనుమతులు ఇస్తారు. అప్పుడే నిర్మాణాలు సజావుగా జరుగుతాయి. ఏవైనా ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినా సరే మున్సిపల్ సిబ్బంది అడ్డుకునే అధికారులున్నాయి. ఇటువంటివేమీ పంచాయతీల్లో కానరావడం లేదు. ఇదిలా ఉంటే ఈడా ఏర్పాటైనప్పటినుంచి పంచాయతీలకు రావాల్సిన ఆదాయం ఇవ్వడం లేదు. పంచాయతీల్లో లేఅవుట్‌లకు, నిర్మాణా లకు ఈడా అనుమతి ఇస్తే అక్కడే స్థల, భవన యజమానులు సొమ్ములు చెల్లిస్తున్నారు. ఇడా ఖాతాలోనే అవి జమ అవుతున్నాయి. ఆ సొమ్ములను తిరిగి పంచాయతీ లకు జమ చేయాలి. ఇప్పటి దాకా ఒక్క పైసా కూడా జమ చేయలేదు.
పట్టణాలకు మాత్రమే జమ
పట్టణాల్లో ప్లాన్‌లు, లేఅవుట్‌లకు అనుమతులు ఇస్తే వచ్చే ఆదాయంలో 80 శాతం నిధులను ఇడా తిరిగి సంబంధిత మున్సిపాలిటీలకు జమ చేస్తోంది. పంచా యతీలకు మాత్రం మొండి చేయి చూపుతోంది. ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా దీనిపై దృష్టి పెట్టలేదు. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ 2016లో ఏర్పడింది. అప్పటినుంచి జిల్లాలోని పంచాయతీలన్నీ దాంట్లోనే విలీనం చేశారు. లేఅవుట్ అనుమతులు అక్కడ నుంచే లభిస్తున్నాయి. ఆదాయం అంతా ఇడా ఖాతాకే వెళుతోంది. పంచాయతీ నిధులకు కటకట ఏర్పడుతోంది. తమ ఆదాయంపై ఉడా పెత్తనం చేస్తోందన్న భావన పంచాయతీ సిబ్బందిలో నెలకొంది.కనీసం అనుమతులు విషయంలోనూ తమకు తెలియడం లేదంటూ పంచాయతీలు ఘొల్లుమంటున్నాయి
ఆశలు నెరవేరేనా ?
ఇటీవల పంచాయతీ రాజ్ శాఖమంత్రి, డిప్యూటీ సీఎం దీనిపై సమీక్ష నిర్వహించారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు జమ చేయడం లేదని అధికారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. బకాయిలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. అనుమతులు విషయంలో కూడా తమ ప్రమేయం కనీసం ఉండడం లేదంటూ పంచాయతీ శాఖ అధికారులు ఆయన దృష్టిలో పెట్టారు. దీనిపై చర్చ జరగడంతో బకాయిలు విడుదల కానున్నాయంటూ పంచాయతీల్లో కాస్త ఆశలు చిగురించాయి. ఇడా నుంచి బకాయిలు వస్తే పంచా యతీల అభివృద్ధికి, నిర్వహణకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలకు కోట్ల రూపాయల్లోనే బకాయిలు రావాల్సి ఉంది.
మేజర్ పంచాయతీల్లోనే అధిక ఆదాయం
జిల్లాలో 404 పంచాయతీలున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల చుట్టూ మేజర్ పంచాయతీలున్నాయి. అక్కడ అనుమతులన్నీ ఇడా నుంచే లభిస్తున్నాయి. భీమవరం పరధిలో రాయలం, పెదఅమిరం, చినఅమిరం, విస్సాకోడేరు వంటి మేజర్ పంచాయతీలున్నాయి. వాటికి ఇడా నుంచి కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇలా అన్ని పట్టణాల పరిధిలోనూ మేజర్ పంచాయతీల ఆదాయం ఇడాకే జమ అవుతోంది. ఇటీవల జిల్లాలో అధిక ఆదాయం, జనాభా ఉన్న పంచాయ తీలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తించారు. జిల్లాలో 20 పంచాయతీలను రూర్బన్ పరిధిలోకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆదాయం కూడా ఇప్పటిదాకా ఇడా ఖాతాలోనే ఉంది. పంచా యతీలపై అనుమతుల రూపంలో ఇడా పెత్తనం చెలాయించే పరిస్థితి ఏర్పడిం దంటూ అంతా చర్చించుకుంటు న్నారు. పంచాయతీలకు రావాల్సిన ఆదాయం లభించకపోవడం తోనే ఇటువంటి వాదన బలంగా వినిపిస్తోంది.