Share News

అన్నీ సమస్యలే..

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:31 AM

పశ్చిమ గోదావరి జిల్లాలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఇటీవల ఆంధ్రజ్యోతి చేసిన పరిశీలనలో కొన్ని సమస్యలు బయటపడ్డాయి.

అన్నీ సమస్యలే..
భీమవరం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో స్థలం లేక బయట ఉంచిన స్ట్రెక్చర్‌, మందుల బాక్స్‌లు

అంతంతమాత్రంగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల సేవలు

కొన్ని సెంటర్లలో వేధిస్తున్న సిబ్బంది కొరత.. రోగులకు తప్పని ఇబ్బందులు

పశ్చిమ గోదావరి జిల్లాలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఇటీవల ఆంధ్రజ్యోతి చేసిన పరిశీలనలో కొన్ని సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా కొన్ని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో అత్యాధునిక పరికరాలు ఉన్నప్పటికీ రోగులకు సరైన అవగాహన లేక ఆసుపత్రులకు వచ్చి వినియోగించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. మరికొన్ని సెంటర్లలో వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఆంధ్రజ్యోతి పరిశీలనలో బయటపడిన కొన్ని సమస్యలపై ప్రత్యేక కథనం.

‘భీమవరం’లో మందుల బాక్సులు బయటే..

భీమవరంటౌన్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : భీమవరం గునుపూడిలోని ఆర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో సరైన స్థలం అందుబాటులో లేకపోవడంతో మందుల బాక్సులు బయట ఉంచాల్సి పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆంధ్రజ్యోతి హెల్త్‌ సెంటర్‌ను విజిట్‌ చేసినప్పుడు ఈ దృశ్యం కనిపించింది. కొత్త భవనం నిర్మించినప్పటికీ అందులో ఏర్పాటుకు ఇంకా అనుమతి లేక పోవడంతో ఈ దుస్థితి నెలకొంది. మందులు ఇచ్చే ప్రాంతం చిందర వందరగా కనిపించింది. ఈ హెల్త్‌ సెంటర్‌కు ప్రతీ రోజు 50 మంది వరకు వైద్య సేవలు అందుకునేందుకు వస్తారని చెబుతున్నారు. కుక్కకాటుకు మందులతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. పట్టణంలోని దుర్గాపురం, గునుపూడి, సుంకర పద్దయ్యగారి వీధి, మారుతీ నగర్‌, బలుసుమూడి ప్రాంతాల్లో అర్బన్‌ సెంటర్లు ఉండగా అన్నిచోట్ల డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉండగా దుర్గాపురం అర్బన్‌ హెల్త్‌ సెంటరకు మాత్రం ఇన్‌చార్జి వైద్యుడు పనిచేస్తున్నారు. ఇక్కడ కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఫార్మాసిస్టులు లేకపోవడంతో సిబ్బందితోనే నడచిపోతోంది.

పాలకొల్లు సెంటర్‌ సమస్యలమయం

పాలకొల్లు అర్బన్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పాలకొల్లు పట్టణంలోని 9వ వార్డు ఆదిత్య కాలనీలో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో పలు సమస్యలు నెలకొని ఉన్నాయి. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ భవనాన్ని 1992లో నిర్మించారు. ఈ భవనం శిథిలావస్థకు చేరింది. సుమారు పదేళ్ల క్రితం పాతభవనానికి చేరువగా మరోభవనం నిర్మించారు. కొత్త భవనం, పాతభవనాల్లో కొంత భవనం బాగుంది. పాత భవనం శ్లాబ్‌లు పెచ్చులూడిపోతున్నాయి. టాయ్‌లెట్‌లు రెండు ఉన్నప్పటికీ కానీ పనిచేయడం లేదు. సిబ్బంది, ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్‌ పద్ధతిపై ఒక డాక్టర్‌, స్టాఫ్‌ నర్సులు ఇద్దరు, ల్యాబ్‌ నిర్వాహకుడు ఒకరు, ఫార్మాసిస్టు ఒకరు, పీఈవో ఒకరు మహిళ, పురుష అసిస్టెంట్టు ఇద్దరు, సూపర్‌వైజరు ఒకరు, 8 మంది ఏఎన్‌ఎంలు, 13 మంది ఆశాలు విధులు నిర్వహిస్తుంటారు. దీని పరిధిలో 8 సచివాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు సుమారుగా 60 మంది రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు.

తణుకు సెంటర్‌కు రోగులు అంతంతమాత్రమే..

తణుకు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): తణుకు పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో సౌకర్యాలు ఫుల్‌గా ఉన్నాయి. రోగులు మాత్రం అంతంతమాత్రంగా వస్తున్నారు. పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం మూడు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసింది. ఆయా సెంటర్లలో అన్ని రకాల పరీక్షలు చేసే అత్యాదినిక పనిముట్లు ఉన్నాయి. కాని పూర్తిగా వినియోగించుకునే స్థాయిలో రోగులు మాత్రం రావడం లేదు. ప్రజలకు ఆయా సెంటర్లపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. బ్యాంకు కాలనీలో సెంటరుకు ఫార్మాసిస్టు, ఎన్‌జీవో కాలనీలో అటెండరు, కొమ్మాయి చెర్వుగట్లు సెంటర్‌కు ఫార్మాసిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఖాళీలు ఉన్నాయి. ఆయా సెంటర్లకు సరాసరి రోజుకు 30 నుంచి 40 వరకు మాత్రమే రోగులు ఆయా సెంటర్లలో సేవలు వినియోగించుకుంటున్నారు.

నరసాపురంలో మూడు సెంటర్లకు ఇద్దరే డాక్టర్లు

నరసాపురం : నరసాపురం పట్టణ పరిధిలో మూడు ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఇద్దరు మాత్రమే వైద్యులు ఉన్నారు. ఒక కేంద్రానికి ఏడాదిగా ఇన్‌చార్జి మెడికల్‌ అధికారితో విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ రోగులకు రెండురోజులకు ఒకసారి డాక్టర్‌ ఉండాల్సి పరిస్థితి నెలకొంది. పట్టణంలోని ఎన్టీఅర్‌ కాలనీ, ఆరుంధతిపేట, సాయిపిల్లల సమీప వీధిలో మరో పీహెచ్‌సీ ఉంది. వీటిలో ఆరుంధతి ఆరోగ్య కేంద్రానికి ఏడాదిగా డాక్టర్‌ లేరు. ఎన్టీఆర్‌ కాలనీ వైద్యులే ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరోజు ఎన్టీఆర్‌ కాలనీ, మరోరోజు ఆరుంథతి పేటలో రోగులకు అందుబాటులో ఉంటున్నారు. నిత్యం ఒక్కొక్క కేంద్రానికి 60నుంచి 80మంది రోగులు వస్తున్నారు. మందుల కొరత లేదు. ల్యాబ్‌ పరీక్షలు చేస్తున్నారు.

తాడేపల్లిగూడెం సెంటర్‌లో సిబ్బంది కొరత

తాడేపల్లిగూడెం రూరల్‌ : తాడేపల్లిగూడెం పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఒక డిజిటల్‌ అసిస్టెంట్‌, ఫార్మాసిస్ట్‌ విధులు నిర్వర్తిస్తుండగా పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లతోపాటు పీహెచ్‌సీలకు ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌లను డిప్యూటేషన్‌ వేయడంతో వారానికి మూడురోజులు బయట విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంది. ఈమేరకు ప్రతిరోజు 70 మంది వరకు ఓపీ ఉండే వీకర్స్‌కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఇద్దరు స్టాఫ్‌ నర్సులే పనిచేయాల్సి వస్తోంది.

Updated Date - Feb 28 , 2026 | 12:31 AM