గుర్తు తెలియని మరణం
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:56 AM
రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాల్లో గుర్తు తెలియని మృతదేహాలు వచ్చినప్పుడు, రోడ్డు పక్కన యాచకులు మృతి చెందితే ఆ మృతదేహాలను మార్చురీల్లో 72 గంటలపాటు ఉంచి వారికి సంబంధించినవారు ఎవరూ రానిపక్షంలో వాటిని ఖననం చేయాల్సిన బాధ్యత సంబంధిత పోలీసులదే.
మార్చురీలో మూడు రోజులు మగ్గాల్సిందే..
ఖననం చేసేందుకు సొమ్ముల కోసం సిబ్బందికి తప్పని తిప్పలు
ఇతర రాష్ట్రాలకు మృతదేహాల తరలింపు ప్రహసనమే
ఏలూరు క్రైం, మార్చి 23(ఆంధ్రజ్యోతి):రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాల్లో గుర్తు తెలియని మృతదేహాలు వచ్చినప్పుడు, రోడ్డు పక్కన యాచకులు మృతి చెందితే ఆ మృతదేహాలను మార్చురీల్లో 72 గంటలపాటు ఉంచి వారికి సంబంధించినవారు ఎవరూ రానిపక్షంలో వాటిని ఖననం చేయాల్సిన బాధ్యత సంబంధిత పోలీసులదే. మృతదేహాలను తీసుకెళ్లి బరియల్ గ్రౌండ్‌లో డబ్బులు వెచ్చించి ఖననం చేయించాల్సి ఉంటుంది. ఆయా స్టేషన్ల పరిధిలో మృతదేహాలను తీసుకువెళ్ళేందుకు వాహనాల ఖర్చుతోపాటు కూలీ ఖర్చు, ఖననం చేసే ఖర్చు సుమారుగా రూ. 5 వేలు వరకు అవుతుంది. ఆ ఖర్చును భరించేందుకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. లెక్కప్రకారం ఖననం చేసే ఖర్చును ప్రభుత్వమే భరించాలి. జిల్లా మీదుగా 16వ నంబర్ జాతీయ రహదారి వెళ్తుం ది. దక్షిణభారత దేశం నుంచి ఉత్తర భారత దేశా నికి ఉన్న ప్రధాన రైలు మార్గం ఏలూరు జిల్లా మీదుగానే వెళ్తుం ది. రైలు బోగి నుంచి ప్రమాదవ శాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోతే వారు ఎక్కడ వారు ? ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారనే వివరాలు తెలిసిన తరువాతే వారి కుటుంబ సభ్యులకు రైల్వే పోలీ సులు సమాచారం ఇవ్వగలుగు తారు. కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఆ మృతదేహం ఏలూరు ప్రభుత్వా సుపత్రి మార్చురీలోనే ఫ్రీజర్లలో భద్రపరుస్తూ ఉంటారు.
బంధువులు రావడానికి రెండు మూడు రోజులు పట్టడంతో వారు వచ్చేటప్పటికీ మృతదేహం కుళ్లి దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం వేల రూపాయల ఖర్చుతో కూడుకుని ఉంది.
మృతదేహాల తరలింపు..కష్టాలు
జిల్లాలో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రెండు మహాప్రస్థానం ఉచిత వాహనాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి నుంచి మృత దేహాలను జిల్లా పరిధి వరకే ఉచితంగా తీసుకువెళ్ళడానికి మహాప్రస్థానం వాహనం వినియోగిస్తున్నారు. కానీ పక్క జిల్లాలకు వెళ్లాలంటే అనుమతులు ఉండడంలేదు. వేరే రాష్ట్రాలకు తరలించాలంటే ఆ మృతదేహాల బంధువులు వేల నుంచి లక్షల రూపాయలు ప్రైవేటు అంబులెన్సులకు ఇవ్వాల్సిందే. అవి కూడా ఫ్రీజర్ బాక్స్‌లు కల్గిన ప్రైవేటు అంబులెన్సులను వినియోగించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇలాంటి ఫ్రీజర్ బాక్సు కల్గిన ఒక్క అంబులెన్సు లేనేలేదు. చివరకు బంధువులు ఇక్కడే ఉన్న శ్మశానవాటికల్లో ఎంతో కొంత ఇచ్చి అంత్యక్రియలను జరిపించుకుంటున్నా రు. లేని వారు అయితే అనాధ మృత దేహాలుగానే అంత్యక్రియలు జరిపేందుకు మున్సిపాల్టీకి అప్పగిస్తున్నారు.
ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో..
ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధి భీమ డోలు నుంచి గన్నవరం వరకు సుమారు 65 కిలోమీటర్లు పరిధి ఉంది. ఈ మధ్య దూరం లో రైలుపట్టాలపై ఏ మృతదేహం ఉన్నా ఏలూరు రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుం టారు. 2025లో మొత్తం 76 మృతదేహాలను అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీటిలో 57 మృతదేహాలను బంధువులు గుర్తించి దగ్గరగా ఉన్న వారు తమ గ్రామాలకు తీసుకెళ్లగా దూర ప్రాంతాల వారు తమ ప్రాంతాలకు మృతదేహాన్ని తీసుకువెళ్ళే ఆర్ధిక స్థోమత లేక కొందరు, మరికొందరు అప్పటికే మృతదేహం దుర్గంధం వెదజల్లడంతో తీసుకెళ్లలేక ఏలూరులో ఉన్న శ్మశాన వాటికల్లో ఖననం చేయిస్తున్నారు. గతేడాది మొత్తం 19 గుర్తు తెలియని మృతదేహాలను ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రైల్వే స్థలంలో ఖననం చేయించారు. బీహార్‌కు చెందిన ఒక మృతదేహానికి ఖననం జరిగిన నెల రోజుల తరువాత బంధువులు వచ్చి అతని వస్త్రాలు, ఫొటోలు గుర్తుపట్టి చివరకు ఆ వస్త్రాలు, ఆఖరిసారిగా పోలీసులు తీసిన మృతదేహ ఫొటోలను తీసుకున్నారు. ఖననం చేసిన సమాధి వద్ద వారు పూజలు చేయించుకుని అక్కడ నుంచి కొంత మట్టిని తమ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 మృతదేహాల విషయంలో ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేయగా 10 మృత దేహాలను గుర్తించారు. మరో రెండు మృతదేహాలను గుర్తించలేదు. వీటిని రైల్వే పోలీసులు ఖననం చేయించి మృతుల ఫొటోలు వారు ధరించిన వస్ర్తాలను భద్రపరిచారు. ఏ మృతదేహాన్ని అయినా మూడు రోజుల పాటు మార్చురీలో భద్రపరిచి అనంతరం మధ్యవర్తుల ద్వారా పంచనామా నిర్వహించి శవ పరీక్ష చేయించి ఆపై ఖననం చేయిస్తారు. జిల్లాలో లా అండర్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలోను ఇలాంటి మృతదేహాలు గతేడాది నుంచి 15 మృతదేహాలను ఎలాంటి కేసులు నమోదు చేయకుండా బెగ్గర్ బాడీలుగా గుర్తించి మున్సిపాల్టీకి, నగరపంచాయతీలకు అప్పగించారు. మరికొన్నింటిని పోలీసులే ఖననం చేయించారు.