Share News

కట్‌..కట్‌లు

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:50 AM

పశ్చిమ గోదావి జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతల కారణంగా పలు రంగాలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి.

కట్‌..కట్‌లు

అప్రకటిత విద్యుత్‌ కోతలు పలు రంగాలపై ప్రభావం

ఆక్వా చెరువుల్లో నిలిచిపోతున్న ఏరియేటర్లు

చిరు జల్లులకే సరఫరా బంద్‌.. జనరేటర్లతో పెట్టుబడి భారం

రొయ్య రైతుల లబోదిబో. మెట్టలో అన్నదాతలకు చుక్కలు

పరిశ్రమల్లో ఉత్పత్తికి ఆటంకాలు.. యజమానులకు నష్టం

పశ్చిమ గోదావి జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతల కారణంగా పలు రంగాలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. పరిశ్రమల ఉత్పత్తికి విఘాతం ఏర్పడుతోంది. ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు పనిచేయక నిలిచిపోయి రొయ్యలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మెట్ట ప్రాంతంలో బోర్ల కింద చేపట్టిన సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించాలని ఆయా వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఆకివీడు రూరల్‌/భీమవరం రూరల్‌/ తాడే పల్లిగూడెం రూరల్‌/తణుకు రూరల్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఆక్వా సాగు మనుగడకు విద్యు త్‌ సరఫరా ప్రాణాధారం. చెరువుల్లో ఏరియేటర్లు నిరంతరం తిరిగితేనే రొయ్యలు, చేపలకు అవస రమైన ఆక్సిజన్‌ అందుతుంది. అయితే, జిల్లాలో నిత్యం ఎదురవుతున్న విద్యుత్‌ సరఫరా లోపాలు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ రంగానికి పూర్తిస్థాయిలో విద్యుత్‌ అందించా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అమలు చేస్తున్న అప్రకటిత కోతలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నా యి. జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 17 వేల ఆక్వా విద్యుత్‌ కనెక్షన్లపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో కనీసం మూడు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం నిత్యకృత్య మైంది. ఉన్నట్టుండి కరెంట్‌ పోయినప్పుడు సబ్‌స్టేషన్లకు ఫోన్లు చేస్తే అవి పనిచేయవు. లేదంటే బిజీ టోన్‌ వస్తుంది. ఒకవేళ సిబ్బంది లైన్‌లోకి వచ్చినా ‘ఎంత సమయం పడుతుందో చెప్పలేం’ అంటూ దాటవేత సమాధానాలే ఇస్తున్నారు. గంటలు గడిచినా సరఫరా పునరుద్ధరణపై స్పష్టత ఉండటం లేదు.

వాతావరణంలో కాస్త మార్పు వచ్చి ఈదురుగాలులు వీచినా, చిరుజల్లులు కురిసినా సరఫరా తక్షణమే నిలిచిపోతోంది. అధికారులకు ఫోన్లు చేసినా స్పందించే నాథుడే కరవయ్యాడు. పాతబడిన విద్యుత్‌ తీగలను ఏళ్ల తరబడి మార్చకపోవడం, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వంటి నిర్వహణ లోపాలు సరఫరాకు ప్రధాన అడ్డంకులుగా మారాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ‘జంపర్లు కట్‌ అయ్యాయి’ అనే సమాధానమే వినిపిస్తుండటంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయంగా డీజిల్‌ జనరేటర్లను నడపాల్సి రావడంతో ఉత్పత్తి వ్యయం తడిసి మోపెడవుతోంది.

పరిశ్రమలకు ఈఎల్‌ఆర్‌ షాక్‌!

విద్యుత్‌ శాఖ ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) పేరుతో అమలు చేస్తున్న అప్రకటిత కోతలు పారిశ్రామిక రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. వారం, పది రోజులుగా ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుండటంతో ఉత్పత్తి రంగం పూర్తిగా స్తంభించిపోతోంది. రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు, ఒక్కోసారి అరగంట నుంచి గంటపాటు కరెంట్‌ తీసేస్తున్నారు. ఇటీవల ఒక రోజు ఏకంగా నాలుగు గంటలపాటు నిరంతరాయంగా కోత విధించడంతో ఉత్పత్తి కుంటుపడింది. ఫలితంగా కార్మికులకు పని లేకపోయినా వేతనాలు చెల్లించాల్సి వస్తోందని, ఇప్పటికే అంతంతమాత్రంగా నడుస్తున్న చిన్న పరిశ్రమలు ఇక మూతపడటం ఖాయమని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎనిమిది నెలల్లో నెల రోజుల పని వృథా

తణుకు పరిసరాలలోని తేతలి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌తోపాటు వివిధ గ్రామాల్లో వందకుపైగా తయారీ పరిశ్రమలు ఉన్నాయి. రెడీమేడ్‌ దుస్తులు, దారం మిల్లులు, సమోసాలు, నెయ్యి, వెల్డింగ్‌, వైర్‌మెస్‌, పేపరు, పేపర్‌ ప్లేట్లు, పేపర్‌ సంచులు, జూట్‌ సంచులు, బ్రాన్‌ ఆయిల్‌, లేత్‌ పరిశ్రమ, వాహనాల బాడీ తయారీ, పిండి, ఆయిల్‌ మిల్లులు మొదలైనవి వాటిల్లో దాదాపు పది వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఈఎల్‌ఆర్‌ పేరుతో విధించిన కోతల వల్ల దాదాపు నెల రోజుల పనిదినాలు వృథా అయ్యాయని యజమానులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు విద్యుత్‌ శాఖ నిర్వహణ పనుల పేరుతో ప్రకటించే షెడ్యూళ్లు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒక రోజు సెలవు ప్రకటిస్తామని చెప్పి, తీరా ఆ రోజు కాకుండా మరో రోజు కరెంట్‌ నిలిపివేయడంతో కార్మికుల హాజరు లేక పరిశ్రమల నిర్వహణ మరింత భారంగా మారుతోంది. ‘ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే విద్యుత్‌ కోతలను అమలు చేస్తున్నాం. గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా వారికి తక్కువ సమయం కోత విధిస్తూ, పరిశ్రమల కేటగిరీకి ఎక్కువ సమయం అమలు చేయాల్సి వస్తోంద’ని తణుకు ఎలక్ట్రికల్‌ ఏఈ రమణమూర్తి తెలిపారు.

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలు గృహ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తు న్నాయి. ధర్మాజిగూడెం పవర్‌ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిలో ఏర్పడిన అవరోధం కార ణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతోం దని అధికారులు చెబుతున్నారు. మరోవైపు లైన్ల మరమ్మతుల పేరుతో తరచూ సరఫరాను నిలిపివేస్తుండటం సమస్యను జటిలం చేస్తోం ది. రాత్రివేళల్లో ఈ కోతలు ప్రజలను తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఓ వైపు వాతావ రణ పరిస్థితులు వేడిగా మారి ఉక్కపోత వేధిస్తున్న సమయంలో కోతలు విధిస్తుండ టంపై అసహనం వ్యక్తమవుతోంది. అత్యవ సర సమయాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపో వడంతో ఇళ్లల్లో చిన్నారులు, వృద్ధులు, విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:50 AM