‘గుర్తుతెలియని’ మరణం
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:35 AM
రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాల్లో మృతి చెందిన వారి పరిస్థితి అగమ్యగోచరమే. గుర్తు తెలియని మృతదేహాలు వచ్చినప్పుడు వాటి కోసం పోలీసులు కొంతవరకు గుర్తించేందుకు ప్రయత్నాలు చేసినా అడ్రస్‌లు తెలియకపోతే ఇక ఖననం చేసేందుకు నానా అవస్థలు పడతారు.
రైలు, రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత
గుర్తు తెలియని మృతదేహాలుగా నమోదు
మూడు రోజుల తర్వాత ఖననం
ఎవరూ రాకపోతే పోలీసులదే బాధ్యత..
ఖనన ఖర్చుల కోసం కుమ్ములాటలు
ఇతర రాష్ట్రాలవారే ఎక్కువ
ఎవరో... ? ఎక్కడి వారో..? చివరి చూపుకు కూడా నోచుకోని అభాగ్యులు.. కన్నీరు కార్చే దిక్కులేని అనామకులు .. రోడ్డు ప్రమాదమో.. రైలు ప్రమాదమో బలి తీసుకుంటే గుర్తు తెలియని శవాలుగా మార్చురీల్లో మగ్గి చివరకు అనాధలుగానే జీవితాలను ముగిస్తుంటారు. రైలు ప్రమాదాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఎక్కువుగా ఉంటాయి.. ఎవరూ రాకపోవడంతో ఈ ఏడాదిలో సుమారు పదిమందిని పోలీసులే ఖననం చేశారు..
మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఆ మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో రైల్వే పోలీసులు వస్త్రాలు, పుట్టుమచ్చలను గుర్తించి 72 గంటల తర్వాత ఖననం చేశారు. రెండు రోజుల అనంతరం ఖననం చేసిన వ్యక్తి తాలూకా బంధువులు వచ్చారు. పోలీసులు చెప్పిన వస్త్రాలు, పుట్టుమచ్చలు ఆధారంగా తమ సంబంధీకులే అని గుర్తించారు. కానీ జరగాల్సి జరిగిపోయింది.
ఎవరూ రాకపోవడంతో చూసి చూసి చనిపోయిన ఒకామెను పోలీసులు ఖననం చేశారు. అయితే మరుసటి రోజు సంబంధీకులు వచ్చి తమ తల్లి ఇంటి నుంచి అలిగి వెళ్ళిపోయిందని వస్తుంది కదా అని ఇప్పటి వరకు వేచి చూశామని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే ఖననం చేసిన ప్రదేశాన్ని వారి బంధువులకు చెప్పడంతో వారు అక్కడికి వెళ్లి తర్వాత కార్యక్రమాలను చేసుకున్నారు.
భీమవరం క్రైం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాల్లో మృతి చెందిన వారి పరిస్థితి అగమ్యగోచరమే. గుర్తు తెలియని మృతదేహాలు వచ్చినప్పుడు వాటి కోసం పోలీసులు కొంతవరకు గుర్తించేందుకు ప్రయత్నాలు చేసినా అడ్రస్‌లు తెలియకపోతే ఇక ఖననం చేసేందుకు నానా అవస్థలు పడతారు. నిబంధనల ప్రకారం రైలు ప్రమాదాలు గాని, రోడ్డు ప్రమాదాలు గాని, అలాగే రోడ్డు పక్కన యాచకులుగాని ఎవరైనా గుర్తు తెలియనివారు మృతి చెందితే ఆ మృతదేహాలను మార్చురీల్లో 72 గంటలపాటు ఉంచుతారు. సంబంధించినవారు ఎవరూ రానిపక్షంలో వాటిని ఖననం చేయవలసిన బాధ్యత సంబంధిత పోలీసులదే. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో పోస్టర్లు అతికించడం, పేపర్ ప్రకటనలు ఇవ్వడం వంటి ప్రయత్నాలు చేస్తారు. చివరకు ఎవరూ రాకపోతే పుట్టుమచ్చలను గుర్తించి ఖననం చేస్తుంటారు. ఒకవేళ ఖననం చేసిన తర్వాత సంబంధించినవారు ఎవరైనా వస్తే వారికి ఫొటోలు, పుట్టుమచ్చల ద్వారా గుర్తించేలా ప్రయత్నిస్తారు. అయితే కొన్ని రైలు ప్రమాదాల్లో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వస్త్రాలు, పుట్టుమచ్చల ద్వారానే గుర్తుపట్టవలసిన పరిస్థితి. బంధువులు వాటి ఆథధధారంగా గుర్తిస్తే ఎక్కడ ఖననం చేశారో సంబంధిత పోలీసులు తెలియజేస్తారు.
ఖర్చుల కోసం ఇబ్బందులు
గుర్తు తెలియని మృతదేహాలను ఖననం చేసేందుకు సంబంధిత పోలీసులే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో కుమ్ములాటలు పడుతూ ఉంటారు. ఆయా స్టేషన్ల పరిధిలో మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు వాహనాల ఖర్చుతోపాటు కూలీ ఖర్చు, ఖననం చేసే ఖర్చు సుమారు రూ.5 వేలు అవుతుంది. ఆ ఖర్చును భరించేందుకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరించాలి. కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి సొమ్ములు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రైలు ప్రమాదాల్లో ఎక్కువ
ఎక్కువగా గుర్తు తెలియని మరణాలు రైలు ప్రమాదాల్లో జరుగుతుంటాయి. ఇతర రాష్ట్రాలకు చెందినవారు రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడిపోవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో రైల్వే పోలీసులు మృతదేహాలను గుర్తించి అక్కడకు వెళ్లి సంబంధిత ఆసుపత్రులకు మృతదేహాలను పంపిస్తారు. అక్కడ మార్చురీల్లో ఫీజర్లలో 72 గంటలపాటు ఉంచి సంబంధీకులు రానిపక్షంలో ఖననం చేస్తారు.
ఏడాదిలో పది మృతదేహాలు
భీమవరం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు నరసాపురం, అటు నిడదవోలు, ఇటు కైకలూరు వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఏడాది కాలంగా ప్రమాదాలు ఎక్కువగానే జరిగినప్పటికీ సుమారు 10 మృతదేహాలను సంబంధీకులు రాకపోవడంతో రైల్వే పోలీసులే 72 గంటలపాటు చూసి ఖననం చేశారు.
చివరి వరకూ ప్రయత్నిస్తాం
సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ,భీమవరం రైల్వే పోలీస్టేషన్
కొన్నిసార్లు రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు నిద్రమత్తులోనో, ప్రమాదవశాత్తో రైలు నుంచి జారిపడి మృతి చెందుతూ ఉంటారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉంటారు. ఆ మృత దేహాలను గుర్తించడం కష్టతరం. 72 గంటల పాటు మార్చురీల్లో ఫ్రీజర్‌లో ఉంచి అనంతరం ఖననం చేయిస్తాం. తర్వాత వారి సంబంధీకులు వస్తే పుట్టుమచ్చలు, ఫొటోలు ద్వారా వారు గుర్తిస్తూ ఉంటారు.మృతదేహాలను గుర్తించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం, వాట్సప్ ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉన్న పోలీసులకు మెస్సేజ్‌లు పంపడం వంటివి చేస్తాం. ఎవరూ రాకపోతే ఖననం చేస్తాం.