ఉగాది సందడి
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:32 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఉగాది పండుగ పూజలు గురువారం వైభవంగా నిర్వహిం చారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులు ఆయా దేవుళ్లను దర్శించుకుని పూజలు చేశారు.
భక్తులతో ఆలయాలు కిటకిట
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఉగాది పండుగ పూజలు గురువారం వైభవంగా నిర్వహిం చారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులు ఆయా దేవుళ్లను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయా ఆలయాల అర్చకులు అందజేసిన ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి.
కిటకిటలాడిన మావుళ్లమ్మ, సోమేశ్వరస్వామి ఆలయాలు
భీమవరంటౌన్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో భక్తులు భీమవరంతోపాటు పశ్చిమగోదారి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉగాదిని పురస్కరించుకుని మావుళ్లమ్మ ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ పూజలు చేసి తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూట్టారు. మధ్యామ్నం వరకు రద్దీ కొనసాగింది.
పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వీరవాసరం మండలం నవూడురు సెంటర్‌లోని పద్దాల వెంకమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో జాతర నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. సుమారు 20 గ్రామాల నుంచి భక్తులు తరలిరావడంతో వీరవాసరం– బ్రాహ్మణ చెరువు రోడ్డు కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
నేత్రపర్వం.. శ్రీవారికి ఉగాది ఉత్సవం
ద్వారకాతిరుమల, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమలేశుని దివ్యక్షేత్రంలో స్వామికి ఉగాది ఉత్సవం గురువారం రాత్రి శ్రీవారి నిత్య కల్యాణ మండప ఆవరణలో నేత్రపర్వంగా సాగింది. ఓ ప్రత్యేక వాహనంపై అర్చకులు, వేదమంత్రోచ్ఛరణల నడుమ అట్టహాసంగా కల్యాణమండపం వద్దకు చేరుకున్న స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన సింహాసనంపై ఉంచి పూజలు చేశారు. ఆలయ అర్చకులు, పండితులు పంచాంగ పఠనం గావించారు. అనంతరం పండితులు, దాతను సత్కరించారు. ఆలయ చైర్మన్ రాజా ఎస్‌వీ సుధాకరరావు ఆధ్యర్యంలో ఈవో యర్రంశెట్టి భద్రాజీ, ఈఈ భాస్కర్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆలయంలో భక్తులు కిటకిట
తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చినవెంకన్న క్షేత్రం భక్తులతో కళకళలాడింది. భక్తులు స్వామి, అమ్మవార్లను తెలుగు సంవత్సరం తొలిరోజున దర్శిస్తే ఏడాదంతా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో సందడిగా మారాయి. దేవస్థానం తీర్థవినియోగ ప్రాంతంలో ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేసింది.
కుంకుళ్లమ్మకు లక్ష గాజుల అలంకరణ
క్షేత్రదేవతగా విరాజిల్లుతోన్న కుంకుళ్లమ్మ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు గురువారం కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు లక్ష గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈనెల 27 వరకు జరుగనున్న ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మోరు గాజుల అలంకరణలో నిండు ముత్తెదువులా భక్తులకు దర్శనమిస్తారు. ముగింపు రోజు 27న ఆలయ ఆవరణలో మహిళలతో కుంకుమపూజ తర్వాత చండీహోమం ఉంటుందని అర్చకుడు భైరవస్వామి తెలిపారు.