ఉమ్మడి పశ్చిమలో రెండు కరోనా కేసులు
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:59 PM
ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
వేగివాడలో యువకుడికి, ఆరవిల్లిలో బాలింతకు నిర్ధారణ
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సూపర్ శానిటేషన్
ఏలూరు క్రైం/పెదవేగి/అత్తిలి, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడకు చెందిన ఓ యువకుడికి, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవిల్లి గ్రామానికి చెందిన బాలింతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వేగివాడకు చెందిన యువకుడికి రెండు కీడ్నీలు పాడైపోవడంతో నెలకు నాలుగుసార్లు డయాలసిస్ ఏలూరు సమీపం లోని వంగాయిగూడెం గుడ్ సమరిటన్ డయాలసిస్ సెంటర్‌లో చేయించుకుంటున్నాడు. అవయవదాత ద్వారా ఒక కిడ్నీని అమర్చు కోవడానికి విజయవాడలోని ఒక కిడ్నీ సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రికి ఈనెల 21న వెళ్లాడు. అక్కడ వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌గా రావడంతో వెంటనే అతనిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అయితే అతను ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన రిపోర్టు శనివారం సాయంత్రం ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయానికి రావడంతో డీఎంహెచ్‌వో డాక్టర్ శోభ పెదవేగి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్‌కు సమాచారం అందించి తక్షణ చర్యలకు ఆదేశించారు. ఆ గ్రామానికి వెళ్లిన వైద్య బృందం వ్యాధిగ్రస్తుడి గుర్తించి ఏలూరు ప్రభు త్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగానికి శనివారం సాయం త్రం 5 గంటలకు రావడంతో అతనిని అత్యవసరపు విభాగపు వైద్యురాలు డాక్టర్ రేష్మా పరిశీలించి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు పంపించారు. కరోనా కేసు ఆసుపత్రికి రావడంతో మెడికల్ సూపరింటెండెంట్ శ్యామల ఆదేశాలతో ఆసుపత్రి మొత్తాన్ని సూపర్ శానిటేషన్ నిర్వహిం చారు. వేగివాడలోను పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టారు.
బాలింతకు కరోనా పాజిటివ్ ..
ఆరవిల్లికి చెందిన బాలింతకు కరోనా పాజిట్‌వి నిర్ధారణ అయ్యింది. డెలివరీ కోసం రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్దిరోజుల క్రితం ఆమె చేరగా నాలుగు రోజుల క్రితం డెలివరీ అయ్యింది. ఈ సందర్భంగా రక్త పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అరవిల్లి పరిధిలోని మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం సమాచారం అందించారు. దాంతో స్థానిక వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టారు. జ్వరాలు, ఇతర రోగాలు ఏమైనా ఉన్నాయంటూ ఆరా తీశారు. ఇప్పటివరకు జిల్లాలో ఈ ఒక్క కేసు మాత్రమే నమోదైంది.