ఇక్కడా.. ఉక్కు.. తుక్కే!
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:19 AM
గత ప్రభుత్వ హయాంలో జగ నన్న కాలనీల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది.
నాలుగేళ్లుగా జిల్లా వ్యాప్తంగా 860 టన్నుల ఇనుము వృథాగా ..
చాలాచోట్ల వానలకు తడిసి తుప్పు..
గత ప్రభుత్వ హయాంలో కమీషన్ల కోసం కక్కుర్తి
అవసరం లేకపోయినా భారీగా కొనుగోలు
ఏఎంసీ నుంచి ఐరన్‌ను తొలగించండి..
జిల్లా అధికారులకు లేఖ
నరసాపురం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో జగ నన్న కాలనీల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. పేదలకు గూడు పేరుతో ఇళ్లు నిర్మించకుండానే అయినకాడికి దోచేశారు. పేరుకు సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించకుండా కోట్లు దోచేశారు. ఐరన్ నుంచి సిమెంట్, ఇంటి సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయలు కమీషన్లు కొట్టేశారు. అవసరం లేక పోయినా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఉపయోగించ కుండా వదిలేయండంతో కోట్లాది రూపాయిల ప్రభుత్వం సొమ్ము వృథా అయింది. రాష్ట్రవ్యాప్తంగా వంద కోట్ల విలువైన 16 వేల టన్నుల స్టీల్‌కు తుప్పు పట్టగా జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. జగనన్న కాలనీ పేరుతో చేపట్టిన ఈ అవినీతి నేడు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. అవసరం లేక పోయినా పెద్ద ఎత్తున ఐరన్ కొనుగోలు చేయడం వల్ల జిల్లాలో సుమారు 860 టన్నుల నాలుగేళ్లుగా ఆరుబయటే పడి ఉంది. ఎండ, వానలకు తడవడం వల్ల చాలా చోట్ల ఇనుప ఊచలు తుప్పు పట్టాయి. భీమవరం సబ్ డివిజన్‌లో 274 టన్నులు, నరసాపురంలో 249, తణుకు 148, ఉండి 69, పాలకొల్లు 10, ఆచంట 110, టీపీ గూడెంలో 10 టన్నుల ఐరన్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడిక్కడ పడి ఉన్న ఐరన్‌ను సబ్ డివిజన్ల వారీగా ఒక చోట భద్రప ర్చింది. కొనుగోలు చేసిన ఐరన్ క్వాలిటీని ల్యాబ్‌లో పరీక్షించింది. ఇలా వృథాగా ఉన్న ఐరన్‌లో 8 ఎంఎం, 10 ఎంఎం, 12 ఎంఎం ఉన్నాయి.
ఇళ్లు పేరుతో కొనుగోళ్లు
గత ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా 72 వేల గృహాలు మంజూరయ్యాయి. వీరిలో 11 వేల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంఽ దించి ఒక్కొక్క ఇంటికి రూ 2.16 లక్షలు చెల్లించే విధంగా ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తంలో రూ 1.80 లక్షలు కేంద్రం ఇచ్చే రుణం కాగా మిగిలిన రూ 30 స్వయం సహాయక సంఘం నుంచి లబ్థిదారులకు అందిస్తారు. ఈ మొత్తాన్ని లబ్థిదారుడు ఇళ్లు నిర్మించే ఏజెన్సీకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇళ్లు నిర్మించే ఏజెన్సీకి ప్రభుత్వం ఐరెన్, సిమెంట్‌తో పాటు ఇతర మెటీరియల్స్‌ను సబ్సిడీపై అందిస్తామని హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా పెద్ద మొత్తంలో ఐరన్, సిమెంట్, ఇతర మెటీరియల్ కొనుగోలు చేసి ఏజెన్సీలకు పంపిణీ చేసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా 860 టన్నులను ఏజెన్సీలకు అప్పగించింది. నిబంధనల ప్రకారం లేబర్, మిషనరీని ఉపయోగించి ఏజెన్సీ ఇళ్లు నిర్మించి అప్పగించాల్సి ఉంది. అయితే మొదట్లో ఉత్సాహంగా కట్టేందుకు ముందుకొచ్చిన ఏజెన్సీలు ఆ తరువాత గిట్టుబాటు కావడం లేదన్న సాకుతో వెనక్కి తగ్గాయి. కొన్నిచోట్ల బేస్‌మెంట్‌లు వేసి చేతులు దులుపుకున్నాయి. ప్రభు త్వమే మెటిరీయల్ కొనుగోలు చేసి అప్పగించడం వల్ల తమకు లాభాసాటిగా లేదని వెనక్కి తగ్గాయన్న వాదనలు అప్పట్లో వినిపించాయి. ఇటీవల ఆర్డీవో దాసిరాజుకు మాజీ సర్పంచ్ రంగారావు ఐరన్ తుప్పు పడుతుందని, దీన్ని భద్రపర్చాలని వినతిపత్రం అందించారు.
చాలా ఐరన్ నాసిరకమే
ఇక జిల్లాకు సరఫరా అయిన ఐరన్‌లో చాలా శాతం నాసిరకమైందన్న వాదనలు అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. బ్రాండెండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తే పెద్ద మొత్తంలో కమీషన్లు రావని భావించి తక్కువ ధరకు కొని వీటిని ఎక్కువ ఽధర కోడ్ చేశారన్న వాదనలు కూడా ఉన్నాయి. అప్పట్లో వచ్చిన ఈ ఆరోపణలపై జిల్లా అధికారులు ఐరెన్ క్వాలిటీని ల్యాబ్‌కు పంపి పరీక్ష కూడా చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా ఉండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో అధికారులు ఇప్పటి వరకు ఈ ఐరెన్‌ను దేనికి వినియోగించకుండా భద్రంగా ఉంచారు.
జిల్లా అధికారులకు లేఖ రాశాం
జక్కం శ్రీమన్నారాయణ, ఏఎంసీ చైర్మన్
నాలుగేళ్లుగా ఏఎంసీ కార్యాలయంలో ఐరెన్ వృథాగా పడి ఉంది. ఇటీవల పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ఐరెన్‌ను మార్కెట్ యార్డు నుంచి మరో చోటకు తరలించాలని జిల్లా అధికారులకు లేఖం రాశాం. వర్షం వస్తే యార్డు మునిగి పోతుంది. దీనివల్ల ఐరెన్ అంతా తుప్పు పట్టింది. ఉన్న ఐరెన్‌కు రక్షణ లేదు. అయితే ఇంతవరకు అధికారులు దీనిపై స్పందించ లేదు.