Share News

అక్వాన్‌..దడ!

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:58 PM

అక్వాన్‌.. దడ పుట్టిస్తోంది. వారం వ్యవధిలో వచ్చిన అర్నబ్‌, మురసు తుఫాన్‌ల బీభత్సానికి అల్లాడిన ప్రజలు, రైతులు ఇప్పుడు మళ్లీ అతి తీవ్ర తుఫాన్‌ వస్తోందంటేనే హడలిపోతున్నారు. అదీగాక ఇంతకు ముందు వచ్చిన రెండు తుఫాన్ల కంటే అత్యంత తీవ్రమైనదని వాతావరణ నిపుణు లు చెబుతున్నారు.

అక్వాన్‌..దడ!
తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఎర్రకాలువ జలాశయం నుంచి నీరు దిగువకు విడుదల

కోస్తా మీద మరో తుఫాన్‌ పిడుగు

అర్నబ్‌, మురసు తుఫాన్‌లు కంటే తీవ్రం

తీవ్ర ఆందోళనలో జిల్లా రైతాంగం

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్‌

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

అక్వాన్‌.. దడ పుట్టిస్తోంది. వారం వ్యవధిలో వచ్చిన అర్నబ్‌, మురసు తుఫాన్‌ల బీభత్సానికి అల్లాడిన ప్రజలు, రైతులు ఇప్పుడు మళ్లీ అతి తీవ్ర తుఫాన్‌ వస్తోందంటేనే హడలిపోతున్నారు. అదీగాక ఇంతకు ముందు వచ్చిన రెండు తుఫాన్ల కంటే అత్యంత తీవ్రమైనదని వాతావరణ నిపుణు లు చెబుతున్నారు. ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తుఫాన్‌గా ఆపై సాయంత్రానికే అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతు న్నారు. , ప్రస్తుతం విశాఖకు 730 కిలోమీటర్లు, చెన్నైకు 650 కిలోమీటర్లు, గోపాలపట్నానికి 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెబుతున్నారు. నెల్లూరు– తుని మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తీరం దాటే సమయంలో 145 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తాయని, తుఫాన్‌ తీరం దగ్గరకు వచ్చే సమయంలో 110 నుంచి 130 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం సముద్రంలో అలల ఉధృతి పెరిగిందని, ఈనెల 18 నుంచి కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో గాలుల తీవ్రతతో పాటు వర్షాలు ప్రారంభమవుతాయని, 19న భారీ నుంచి అతి భారీగా వర్షాలు, 20న భారీ నుంచి అత్యంత భారీగా వర్షాలు , పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. గత తుఫాన్ల కన్నా ఈసారి అత్యంత అప్రమత్తంగా ఉండాలని, గత తుఫాన్‌ల వల్ల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కాల్వలు నిండాయని, మళ్లీ తుఫాన్‌ వల్ల భారీగా వర్షాలు కురిస్తే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. తుఫాన్‌ హెచ్చరికలు దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. వరి మాసూళ్లు చేసిన ధాన్యంతో పాటు చేలల్లో పంటను రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోత కోసి కల్లాల్లో ఉన్న పంటను రక్షించుకోవడానికి కుప్పలుగా వేసి బరకాలు కప్పుకోవాలని, సాధ్యమైనంతవరకు 17వ తేదీ నాటికే వరి కోతలను పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్‌ బాషా రైతులకు సూచించారు.

అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి..

అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం అక్వాన్‌ తుఫాన్‌ సంసిద్ధతపై రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కల్వర్టులు, వాగులు, కాజ్‌వేలు దాటకుండా ప్రమాద హెచ్చరికలు , బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిబ్బందిని నియమించా లన్నారు. ఎక్కడా ప్రాణ నష్టం కలుగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జేసీ అభిషేకగౌడ ఇతర అధికారులు పాల్గొన్నారు.

వరద వస్తే ప్రమాదమే..!

ఇప్పటికే ఎర్రకాల్వ జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిమట్టం

ముందస్తు జాగ్రత్తగా 1,260 క్యూసెక్కుల నీరు విడుదల

జంగారెడ్డిగూడెంరూరల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): మరో తుఫాన్‌ హెచ్చరికలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. రిజర్వాయర్‌లోకి ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లో లేనప్పటికీ జలాశయంలో పూర్తిస్థాయిలో నీటి మట్టం ఉండడంతో పాటు, తుఫాన్‌ ప్రభావంతో కురిసే భారీ వర్షాలకు జలాశయంలోకి వరద పోటెత్తే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా రెండు గేట్లను సోమవారం ఎత్తి 1260 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెలలో సంభవించిన తుఫాన్‌ కారణంగా జలాశయంలో నీటి మట్టం 83.15 మీటర్లకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 83.50 మీటర్లు మాత్రమే. ప్రస్తుతం 4,106 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 4428 టీఎంసీలు కాగా, బఫర్‌ నిల్వ కేవలం 0.322 టీఎంసీలుగా ఉంది.

Updated Date - Nov 16 , 2026 | 11:58 PM