Share News

అన్నదాతల ఆశలపై ఆర్నబ్‌ నీళ్లు!

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:04 AM

జిల్లాలో ఆర్నబ్‌ తుఫాన్‌ అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొస్తాయ నుకున్న పంటలు దెబ్బతిన్నాయి. వరితో పాటు ఉద్యాన పంటలు తుఫాన్‌ బారిన పడ్డాయి.

అన్నదాతల ఆశలపై ఆర్నబ్‌ నీళ్లు!
లక్ష్మీపురంలో పడిపోయిన అరటితోట వద్ద రైతు రాంబాబు

జిల్లాలో 40,440 ఎకరాల్లో పంట నష్టం

పంటలు దెబ్బతిన్న రైతులు 19,343 మంది

ముంపులోనే 38,771 ఎకరాల్లోని వరి పంట

యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ..

(ఏలూరుసిటీ–అంధ్రజ్యోతి)

జిల్లాలో ఆర్నబ్‌ తుఫాన్‌ అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొస్తాయ నుకున్న పంటలు దెబ్బతిన్నాయి. వరితో పాటు ఉద్యాన పంటలు తుఫాన్‌ బారిన పడ్డాయి. రైతులకు కనీసం పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో భారీ వర్షాలకు చాలాచోట్ల రహదారులు దెబ్బ తిన్నాయి. జిల్లాలో 116 చెట్లు నేలకూలాయని అధికారుల నివేదికలు చెబు తున్నాయి. విద్యుత్‌ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఆర్నబ్‌ తుఫాన్‌ తీవ్రతకు, వీచిన పెను గాలులకు, ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 40,440 ఎకరాల్లో వరి పంటతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ జిల్లాలోని 38,771 ఎకరాల్లోని వరి పంట ముంపులోనే ఉంది. 75 ఎకరాల్లో మొక్కజొన్న, 5 ఎకరాల్లో కందులు, 37.5 ఎకరాల్లో పెసలు, 1,340 ఎకరాల్లో మినుము, 37.5 ఎకరాల్లో వేరుశనగ , 176 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. జిల్లాలోని 26 మండలాల్లోని 243 గ్రామాలకు చెందిన 19,343 మంది రైతు లు పంటలు నష్టపోయారు. ఇప్పటికే ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గగా తుఫాన్‌ ప్రభా వంతో సాగులో ఉన్న కాస్తా పంటలు కూడా దెబ్బతిన్నాయని, కనీసం పంట పెట్టుబడులు రాకుండా పోయాయని రైతులు వాపోతున్నారు. ఉద్యాన పంటలలో అరటి, బొప్పాయి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఉద్యాన శాఖాధికారుల నివేదికలు చెబుతున్నాయి. పలు చోట్ల భారీగా వీచిన గాలులకు కొబ్బరి, పామాయిల్‌ చెట్లు పడిపోయాయి. తుఫాన్‌ దెబ్బకు రహదారులు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. రహ దారులపై 116 చెట్లు పడిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడ్డాయి. సకాలంలో అధికారులు స్పందించి ఆ చెట్లను తొలగించారు. విద్యుత్‌ శాఖకు తీవ్రనష్టం వాటిల్లింది. పలుచోట్ల స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ లైన్లు తెగి పడ్డాయి. 33 కేవీ, 11 కేవీ ఫీడర్లు దెబ్బతిని విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. అయితే జిల్లా విద్యుత్‌ శాఖ సకాలంలో స్పందించి 38 విద్యుత్‌ బృందాలు యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు. జోరు వర్షంలోను విద్యుత్‌ సిబ్బంది విద్యుత్‌ స్తంభాలను తొలగించి వాటి స్థానే కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించగలిగారు.

54 సహాయక శిబిరాలు.. 1899కి ఆశ్రయం

తుఫాన్‌ ప్రభావ ప్రాంతాలలో 54 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి 1899 మంది ఆశ్రయం కల్పించామని కలెక్టర్‌ వెట్రిసెల్వి చెప్పారు. తుఫాన్‌ సమయంలో జిల్లా వ్యాప్తంగా 1895.60 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయిందని , సకాలంలో ప్రజలను అప్రతమత్తం చేయడం, జిల్లా యంత్రాం గం ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలు కారణంగా జిల్లాలో ప్రాణ, ఆస్థి నష్టాలు కలుగకుండా చేయగలిగామ న్నారు. ప్రభావిత కుటుంబాలకు అన్ని పునరావాస కేంద్రాలలో సహాయం, పునరావాసంతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించామన్నారు. పునరావాస కేంద్రం నుంచి వెళ్ళే ప్రజలకు బియ్యం , నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 440 చెట్లు కూలిపోగా వెంటనే వాటిని తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్దరించామని, కైకలూరు శాసనసభ నియోజకవర్గం, నిడమర్రు మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో విద్యుత్‌ పునరుద్ధరణ జరుగుతోందన్నారు. జిల్లాలో 153 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినగా 69 స్తంభాలను పునరుద్ధరించారన్నారు. 13 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు.

ఉంగుటూరులో 116.4 మి.మీ వర్షపాతం

గత 24 గంటల్లో జిల్లాలోనే అత్యధికంగా ఉంగుటూరు మండలంలో 116.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 67.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయింది. ద్వారకాతిరుమల 100.4, వేలేరుపాడు 95, జంగారెడ్డిగూడెం 94.4, నిడమర్రు 91.4, కైకలూరు 88.4, మండవల్లి 86.8, దెందులూరు 79.2, కొయ్యలగూడెం 78.2, కామవరపుకోట 77.6, ఏలూరు రూరల్‌ 73.8, ముదినేపల్లి 73, ఏలూరు అర్బన్‌ 69.8, కలిదిండి 68.4, జీలుగుమిల్లి 68, నూజివీడు 66.2, కుక్కునూరు 61.6, భీమడోలు 61.6, బుట్టా యిగూడెం, పోలవరం 52.4, లింగపాలెం 47.6, టి.నరసాపురం 47, ముసునూరు 46.6, పెదవేగి 42.8, పెదపాడు, చాట్రాయి 41.4, ఆగిరిపల్లి 38.8, చింతలపూడి 35.4 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.

బోరుమంటున్న రైతులు

పెదవేగి : మరో పదిరోజులు ఆగితే పంట కోత కొస్తుంది.. సొమ్ము చేతికందుతుందని ఎంతో ఆశతో ఉన్న రైతులకు ఆర్నబ్‌ తుఫాన్‌ అశని పాతంలా తాకింది. భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో కోతకొచ్చిన వరిపంట నేలపాలు అయింది. అరటితోటలను నిలువునా కూల్చివెళ్లింది. పెదవేగి మండలంలో 520 ఎకరాల్లో వరిపంట పాడైందని మండల వ్యసాయాధికారి సీహెచ్‌.శ్రీనివాసరావు తెలిపారు. అమ్మపాలెంలో మోర్ల రామాంజనేయులు ఐదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. మరో పది రోజుల్లో వరికోత కోయవచ్చని భావించాడు. ఇంతలో ఒక్కసారిగి విరుచుకుపడిన ఆర్నబ్‌ తుఫాన్‌ ధాటికి కోత కోయడానికి వీల్లేని విధంగా పంట నాశనమైందని ఆ రైతు ఆవేదన చెందుతున్నాడు. పంట పాడైనా యజమానికి కౌలు కట్టక తప్పదని, పెట్టుబడి కాదు కదా, కనీసం కూలి సొమ్ము కూడా రాదని మదనపడుతున్నాడు. ఇదే గ్రామంలో పోలిశెట్టి వీరయ్య పదెకరాలు, పామర్తి పాపారావు ఐదెకరాల్లో వరి పంట సాగుచేశారు. వారి పరిస్థితి ఇలాగే ఉంది. లక్ష్మీపురానికి చెందిన పూజారి రాంబాబు 7.5 ఎకరాల్లో అరటి పంట వేశాడు. కార్తీక మాసంలో అరటికి మంచి డిమాండ్‌ ఉంటుందని చేతికొచ్చిన గెలలను నరకకుండా ఉంచాడు. తుఫాన్‌ అరటిచెట్లను నిలువునా కూల్చేసి పోయింది. కార్తీకమాసం పూర్తయ్యేసరికి రూ.20 లక్షలు వస్తాయని ఎంతో ఆశతో ఉన్నానని, ఇంతలో తుఫాన్‌ నా ఆశలను అడియాసలు చేసిపోయిందని రైతు రాంబాబు విచారం వ్యక్తం చేస్తున్నాడు.

Updated Date - Oct 30 , 2026 | 01:04 AM