మూతపడిన ట్రామాకేర్
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:02 AM
జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను గంట సమయంలోపు ఆసుపత్రులకు తరలిస్తే వారి ప్రాణాలు కాపడవచ్చని వైద్యులు చెబుతుంటారు. దీనినే గోల్డెన్ అవర్‌గా వైద్యులు వర్ణిస్తారు.
43 పోస్టులకు 28 ఖాళీలు
ఉన్న సిబ్బందికి వేరే వార్డుల్లో డ్యూటీలు
అందని అత్యవసర వైద్య సేవలు
పట్టించుకోని ఆసుపత్రి అధికారులు
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను గంట సమయంలోపు ఆసుపత్రులకు తరలిస్తే వారి ప్రాణాలు కాపడవచ్చని వైద్యులు చెబుతుంటారు. దీనినే గోల్డెన్ అవర్‌గా వైద్యులు వర్ణిస్తారు. చతుర్భుజిగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగగా చెన్నై–కోల్‌కత్తా 16వ నంబర్ జాతీయ రహదారి ఏలూరు జిల్లా మీదుగానే వెళ్తుంది. జాతీయ రహదారి వెంబడి ప్రమాదాలు జరిగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదే శ్‌లో ఈ రహదారి వెంబడి 10 ట్రామాకేర్ సెంట ర్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఉంది. 2010లో ఈ సెంటర్లను ఏర్పాటు చేసి సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిపై 43 మందిని నియమించుకోవడానికి పోస్టులను మంజూరు చేసింది. న్యూరో సర్జన్, ఆర్థో స్పెషలిస్టు, ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు, 18 మంది స్టాఫ్ నర్సులు, ఎంఎన్‌వోలు 8, ఎఫ్‌ఎన్‌వోలు 4, ఈసీజీ టెక్నీషియన్లు ఇద్దరు, ల్యాబ్ టెక్నీషియన్లు ముగ్గురు, ఎక్స్‌రే టెక్నీషియన్లు ఇద్దరు, ఆక్సిజన్ టెక్నీషియన్ ఒకరు చొప్పున కాంట్రాక్టు పద్ధతిపై నియమించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ట్రామాకేర్ సెంటర్ కోసం ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేశారు. ఈ సేవలు 2022 వరకు కొనసాగినా ఆ తరువాత క్రమేపీ పోస్టులలో ఉన్న వారికి వేరే ఉద్యోగాలు రావడం, మరికొంతమంది రిజైన్ చేయడంతో క్రమేపీ ఖాళీలు ఏర్పడ్డాయి. 2017 నుంచి వీటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేయడంతో అప్పటి నుంచి వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధి లో కొనసాగింది. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిని టీచింగ్ ఆసుపత్రిగా మార్చడంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడి కల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వెళ్లడంతో డీఎంఈ ద్వారానే జీతాల చెల్లింపు, పోస్టుల భర్తీ కొనసాగించాల్సి ఉంది. డిస్టిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)ద్వారా ఈ ట్రామాకేర్‌లో ఉన్న కాంట్రాక్టు పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో న్యూరోసర్జన్ పోస్టు, ఆర్థో స్పెష లిస్టు, మూడు మెడికల్ ఆఫీసర్లు, ఎంఎన్‌వో పోస్టులు మూడు, ఎఫ్‌ఎన్‌వో పోస్టులు మూడు, స్టాఫ్ నర్సులు 14, ఈసీజీ టెక్నీషియన్ ఒకరు, ల్యాబ్ టెక్నీషియన్లు 2 పోస్టులు మొత్తం 28 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటి ని భర్తీ చేయడానికి ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడంతో చివరకు ట్రామా కేర్ యూనిట్‌నే మూసివేశారు. అత్యవసర ప్రమాదకరమైన కేసులను, తలకు దెబ్బతగిలిన కేసులను ఈ ట్రామాకేర్ ఐసీలో పెట్టి వైద్యం అందించాల్సి ఉన్నా అధికారులు పట్టించు కోకపోవడంతో నేడు ట్రామాకేర్ సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. పోస్టులు భర్తీ చేయడానికి కలెక్టర్ అనుమతి తీసుకుని నోటిఫికేషన్ జారీ చేసి డీఎస్పీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ట్రామాకేర్‌కు సంబంధించిన సిబ్బందిని, మిగిలిన వార్డులలో డ్యూటీలు వేసేశారు. పేరుకే ట్రామాకేర్‌లో పది మంచాలు ఉంచి అత్యాధునిక వైద్య యంత్ర పరికరాలను అక్కడ ఉంచి చూపిస్తున్నారే తప్పఒక్క ఐపీ పేషెంటును ఆ వార్డులో ఉంచడం లేదు. కేవలం అత్యవసర వైద్య చికిత్స చేయ డానికి మాత్రమే ఒకరిద్దరిని అక్కడ ఉంచుతున్నారు. ట్రామాకేర్‌కు ఒక నోడల్ ఆఫీసర్ ఉండాల్సి ఉండగా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులనే దీనికి ఇన్‌చార్జిగా తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్న తాధికారులు ఈపరిస్థితిని పరిశీలించి జిల్లాలో ట్రామా కేర్ యూనిట్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వైద్య విధాన పరిషత్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఉండగా ట్రామాకేర్ యూనిట్ ఎంతో చక్కగా పనిచేసి ఎంతో మంది ప్రాణాలను కాపా డారు. నేడు మూత పడడంతో ఆసుపత్రికి వస్తున్న క్షతగాత్రులను ఇక్కడ వైద్యులు లేరంటూ విజయవాడకు రిఫర్ చేస్తున్నారు. దీంతో మెడికల్ కళాశాల ఆసుపత్రి పేరు గొప్పగా ఉన్నా వైద్య సేవలో మాత్రం అఽథమస్థాయిలోనే ఉందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ట్రామాకేర్‌లో పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.