Share News

పట్టాలు తప్పిన గూడ్స్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:42 AM

విశాఖపట్టణం నుంచి బొగ్గు లోడుతో బయలు దేరిన గూడ్స్‌ రైలు కొవ్వూరు రైల్వేస్టేషన్‌ గూడ్స్‌ యార్డ్‌ వద్ద సోమవారం ఉదయం 7.12 గంటల సమయంలో పట్టాలు తప్పింది.

పట్టాలు తప్పిన గూడ్స్‌
లూపులైన్లలో ఆ రైళ్ల నిలుపుదల

రైళ్ల రాకపోకలకు అంతరాయం

విశాఖపట్టణం– విజయవాడ లైన్లలో నిలిచిన పలు రైళ్లు

గంటల పాటు ప్రయాణికుల పాట్లు

ఏలూరు క్రైం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : విశాఖపట్టణం నుంచి బొగ్గు లోడుతో బయలు దేరిన గూడ్స్‌ రైలు కొవ్వూరు రైల్వేస్టేషన్‌ గూడ్స్‌ యార్డ్‌ వద్ద సోమవారం ఉదయం 7.12 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీంతో విశా పట్టణం నుంచి విజయవాడ నడిచే రెండు వైపులా రైళ్ల రాకపోకలకు కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈ సమాచారాన్ని లోకో ఫైలెట్‌ వెంటనే అధికారులకు తెలియ జేశారు. దీంతో అధికారులు హుటాహుటిన క్విక్‌ రిలీఫ్‌ టీమ్‌లను ఒక వైపు రాజమహేంద్రవరం నుంచి మరోవైపు విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లల్లో పంపించారు. టీం అక్కడకు వెళ్ళి పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలును తిరిగి 9.35 గంటలకు పట్టాలపైకి ఎక్కించారు.దీంతో సుమారు మూడు గంటల పాటు ఇరువైపులా రైళ్ళ రాక పోకలను నిలిపివేశారు. వివిధ స్టేషన్లలో లూపులైన్లలో ఆ రైళ్లను నిలుపుదల చేశారు. రైలుపట్టాలు ఎక్కిం చిన తరువాత ఆ రైలును కొవ్వూరు యార్డులో ఉన్న లూప్‌ లైన్‌కు తరలించారు. అనంతరం రైళ్ళ రాకపోకలను యధావిధిగా కొనసాగించారు. అయితే కొన్ని రైళ్లు లూపు లైన్లో నిలుపుదల చేసి సుదూర ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను పంపించడం వల్ల 40 నిముషాల పాటు రైళ్లు ఆగిపోయాయి. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణం వెళ్లే వందే భారత్‌ రైలు (రైల్‌ నెంబర్‌ 20834) సాయంత్రం 3 గంటలకు వెళ్ళాల్సి ఉండగా గంటన్నర ఆలస్యంతో నాలుగున్నర గంటలకు బయలు దేరింది. విశాఖపట్టణం నుంచి విజయ వాడకు వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717) విశాఖ పట్టణంలో మధ్యాహ్నం 12.55కు బయలు దేరాల్సి ఉండగా సాయంత్రం 3.30 గంటలకు బయలుదేరి విజయవాడకు వెళ్లింది. రైల్‌ నెంబర్‌ 18507 విశాఖపట్టణం నుంచి తిరుపతి వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్టణంలో సోమవారం రాత్రి 7.10 నిమిషాలకు బయలు దేరాల్సి ఉండగా రాత్రి 8.50లకు బయలు దేరింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్‌పీఎఫ్‌, జిఆర్‌పీ, రైల్వే అధికారులు అప్రమత్త చర్యలు తీసుకున్నారు.

నిలిచిన రైళ్లు

తాడేపల్లిగూడెం రూరల్‌/నిడదవోలు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం పరిసరాల్లో రైళ్లను నిలుపుదల చేశారు. నవాబుపాలెం వద్ద రత్నా చల్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదల చేయడంతో ప్రయాణికులు గందరగోళంలో మునిగి పోయారు. దీంతో దగ్గర ప్రయాణం ఉన్నవారు రోడ్లపైకి వచ్చి రోడ్డు మార్గం గుండా బయ ల్దేరాల్సి వచ్చింది. తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో బోకారో ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదల చేశారు. బాదంపూడి సమీపంలో తిరుపతి–కాకినాడ రైలు నిలిచిపోయింది.నిడదవోలు రైల్వే స్టేషన్‌లో సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పాసింజర్‌ రైలు సుమారు మూడు గంటలకు పైగా నిలిచి పోయాయి. సికింద్రాబాద్‌ నుంచి అనకాపల్లి వెళుతున్న సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నిడదవోలు స్టేషన్లో సుమారు మూడు గంటలకు పైగా నిలిచిపోయింది. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ నిడదవోలు మారంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య సుమారు రెండు గంటలకు పైగా నిలిచిపోయింది.

Updated Date - Sep 01 , 2026 | 12:42 AM