Share News

రైలు దొంగలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:55 AM

నరసాపురం– బెంగళూరుల మధ్య నడస్తున్న వీక్లీ స్పెషల్‌ రైలులో శనివారం రాత్రి దోపిడీ దొంగల బీభత్సంతో ప్రయాణికులు ఉలికిపాటుకు గురయ్యారు.

రైలు దొంగలు

నరసాపురం–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో చోరీతో ఉలికిపాటు

రైల్వేను వెంటాడుతున్న భద్రతా సిబ్బంది కొరత

నరసాపురం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): నరసాపురం– బెంగళూరుల మధ్య నడస్తున్న వీక్లీ స్పెషల్‌ రైలులో శనివారం రాత్రి దోపిడీ దొంగల బీభత్సంతో ప్రయాణికులు ఉలికిపాటుకు గురయ్యారు. బాపట్ల జిల్లా సమీపంలో నాలుగు కోచ్‌ల్లో దొంగలు ప్రయాణికుల నుంచి దొరికినకాడికి దోచుకుపోయారు. అందులో జిల్లాలోని ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరిలో పలువురు విజయవాడలో దిగి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన రైల్వే అధికారుల్ని కూడా షాక్‌కు గురి చేసింది. ఒకేసారి పది మంది దొంగలు రైలు ఆపి దోపిడీకి దిగడంతో ప్రయాణికులు అడ్డుకోలేకపోయారు. మరోవైపు ఈ స్పెషల్‌ రైలులో పోలీస్‌ ఎస్కార్ట్‌ లేకపోవడం గమనార్హం.

పెరిగిన స్పెషల్‌ రైళ్లు.. ఎస్కార్ట్‌ కొరత

ఇటీవల రైల్వేలో స్పెషల్‌ రైళ్లు పెరిగాయి. నరసా పురం నుంచి వెళ్లే బెంగళూరు, అరుణాచలం, ఇటు భీమవరం మీదుగా వెళ్లే కాకినాడ, కేరళ మధ్య స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. వీటికి ఎస్కార్ట్‌ తక్కువుగా ఉంటుంది. ఒక్కోసారి అసలు ఉండటం లేదు. వీటిపైనే దొంగలు దృష్టి సారిస్తున్నారు. రెగ్యులర్‌గా నడిచే అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు విజయవాడ నుంచి రైల్వే పోలీసులతో పాటు జనరల్‌ పోలీసులు కూడా ఎస్కార్ట్‌గా వెళుతుంటారు. వీరి దగ్గర ఆయుధాలు ఉంటాయి. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉన్నందున ప్రతి రైలుకు నలుగురు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఐదు నుంచి ఆరు బోగీలకు ఒక పోలీస్‌ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఏ కోచ్‌లో దొంగతనం జరిగినా అక్కడికి వెళ్లాలంటే సమయం పడుతుంది. గతంలో నరసాపురం, శేషాద్రి, సర్కార్‌ వంటి రైళ్లకు ఆరుగురు పోలీసులు ఉండేవారు. ప్రస్తుతం సిబ్బంది కొరత వల్ల ఎక్కువ ఎస్కార్ట్‌ను రైల్వే అందించలేకపోతున్నది. వీటికి తోడు స్పెషల్‌ రైళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేయడం రైల్వేకు కత్తిమీద సాములా మారింది. ఇటీవల రైల్వేలో కొత్తగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ జరిగింది. వీరు విధుల్లోకి వస్తే కొన్ని రైళ్లకు ఎస్కార్ట్‌లు పెంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వేసవి మొదలైంది. రెగ్యులర్‌ రైళ్లతో పాటు స్పెషల్‌ రైళ్లు కూడా పెరుగుతాయి. వేసవి కావడంతో గాలి కోసం చాలామంది కీటికీలు తీసి ఉంచుతారు. ఇక్కడే దొంగల చూపు పడుతుంది. ఏ కోచ్‌లో మహిళలు ఎక్కువుగా ఉన్నారన్నది ముందుగా గ్రహించి దోపిడీ లకు పాల్పడుతున్నారు. రైల్వే పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రయాణికులు మాత్రం నగలు ధరించే విషయంలో తగ్గడం లేదు.విలువైన వస్తువుల్ని సంచుల్లో పెట్టి నిద్రలోకి జారుకుంటున్నారు. ప్రయాణి కులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు చెబుతున్నారు.కొన్ని రైళ్లలో భద్రత తగ్గడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. కనీసం ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నా దొంగలు భయపడతారు. గతంలో నరసాపురం, నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో కూడా ఇలాంటి దోపిడీలు జరిగాయి. స్పెషల్‌ రైలులో దోపిడీ జరగడం ఇదే తొలిసారి కావడంతో రైల్వే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

Updated Date - Apr 21 , 2026 | 12:55 AM