Share News

టౌన్‌ ప్లానింగ్‌లో చేతివాటం

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:55 PM

మునిసిపాలిటీ పరిధిలో కొందరు ఎల్‌టీపీలు నేరుగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. తమ సర్వీస్‌ చార్జీలతో పాటు, పట్టణ ప్రణాళిక అధికారులకు లాంఛనాలు ఇవ్వాలంటూ నిర్మాణదారుల నుంచి ముడుపులు తీసుకుంటున్నారు.

టౌన్‌ ప్లానింగ్‌లో చేతివాటం

లైసెన్స్‌డ్‌ టౌన్‌ ప్లానర్లదే హవా

అక్కడ నుంచే అనుమతులు

అఽధికారులకు ముడుపులంటూ వసూళ్లు

లేదంటే ముందుకు కదలని ప్లాన్‌

నిర్మాణాల సమయంలోనే

మునిసిపల్‌ అధికారులకు తెలిసేది

క్షేత్రస్థాయి పరిశీలనలో

బయటపడుతున్న అతిక్రమణలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పట్టణాల్లో భవన నిర్మాణాల అనుమతులను సులభ తరం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్‌డ్‌ టౌన్‌ ప్లానర్‌ల (ఎల్‌టీపీ) ద్వారా దరఖాస్తు చేస్తే అనుమతులు మంజూరవుతున్నాయి. గతంలో పట్టణ ప్రణాళిక విభాగానికి దరఖాస్తు చేసుకునేవారు. బహుళ అంతస్తుల భవనాలు, 300 చదరపు గజాలు దాటిన నివాసాలకు ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అనుమతులు ఇచ్చేది. ఇప్పుడు మునిసిపాలిటీ పరిధిలో ఉన్న ఎల్‌టీపీలు దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ప్లాన్‌ మంజూరవుతోంది. దీనివల్ల ప్లాన్‌ మంజూరులో జాప్యం ఉండదు. అధికారుల వద్దకు పదే పదే వెళ్లాల్సిన అవసరం లేదు. పారదర్శకత ఉంటుంది. చేతి వాటం ఉండదని ప్రభుత్వం భావించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కొందరు ఎల్‌టీపీలు నేరుగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. తమ సర్వీస్‌ చార్జీలతో పాటు, పట్టణ ప్రణాళిక అధికారులకు లాంఛనాలు ఇవ్వాలంటూ నిర్మాణదారుల నుంచి ముడుపులు తీసుకుంటున్నారు. అలా ఇవ్వని పక్షంలో దరఖాస్తులు ముందుకు వెళ్లడం లేదు. ఏదో వంక పెడుతున్నారు. నేరుగా మున్సిపాలి టీలకు వెళ్లి మాట్లాడితే అసలు పనే జరగడం లేదు. ఎల్‌టీపీలను ముందుగా కలుసుకోవాలి. అక్కడే మున్సిపాలిటీలో అధికారులు, సిబ్బందికి ఇవ్వాల్సిన ముడుపులు అందజేయాలి. అప్పుడే ప్లాన్‌ ముందుకు వెళుతుంది.

పరిశీలిస్తే భాగోతం బట్ట బయలు

నిర్మాణాలు చేపట్టినప్పుడు మాత్రమే ప్లాన్‌ పొందినట్టు పట్టణ ప్రణాళిక అధికారులు తెలుసుకుంటు న్నారు .లేదంటే నెలరోజులు అంత కంటే ఎక్కువ దినాలు వేచి చూడాల్సి వస్తోంది. అప్పుడే మున్సిపల్‌ అధికారుల లాగిన్‌లో ప్లాన్‌లు కనిపిస్తున్నాయి. అప్పటి దాకా మున్సిపల్‌ అధికారులకు కూడా నిర్మాణదారులు ప్లాన్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలియడం లేదు. పట్టణాల్లో నిర్మాణాలు జరుగుతుంటే మున్సిపల్‌ అధికా రులు పరిశీలిస్తున్నారు. అప్పుడే ప్లాన్‌ మంజూరైనట్టు తెలుస్తోంది. సెట్‌బ్యాక్‌లు, అతిక్రమణలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎల్‌టీపీలతో అంతా మాట్లాడుకున్నామని నిర్మాణ దారులు చెపుతున్నారు. ఇది విని అధికారులు ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానంలో సాఫ్ట్‌వేర్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేదు. ఫలితంగా దరఖాస్తులు అధికారుల లాగిన్‌లో కానరావడం లేదు. దీంతో మున్సిపల్‌ అధికా రులకు ప్లాన్‌ మంజూరు విషయం తెలియడం లేదు. దాంతో నిర్మాణాల్లో అతిక్రమణలపై ఏమీ చేయలేకపోతు న్నారు. నిలదీస్తే ఎల్‌టీపీలకు సొమ్ములు చెల్లించామంటూ చెప్పుకొస్తున్నారు. జిల్లాలో ఇది పెద్ద చర్చగా మారింది. పట్టణ ప్రణాళిక అధికారుల వద్దకు ముందుగా వెళ్లి వివరాలు తెలుసుకున్నా సరే కొందరు ఎల్‌టీపీలు కినుక వహిస్తున్నారు. సిబ్బంది లాంఛనాలు కూడా తమ ద్వారా వెళ్లాలని చెప్పుకొస్తున్నారు.

తెలివి మీరిన వారికే కాసులు

పట్టణ ప్రణాళిక విభాగంలో కాస్త తెలివి మీరిన అధికారులు మాత్రం ఎల్‌టీపీలపై పట్టు సాధించారు. వారితోనే లోపాయికారీ ఒడంబడికలు కుదుర్చుకున్నారు. దరఖాస్తు దారులకు, మున్సిపల్‌ అధికారులకు మధ్య వర్తులుగానూ ఎల్‌టీపీలు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే ఎల్‌టీపీలపై చర్యలు తప్పవంటూ ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. దీనిపై కొన్ని నెలలపాటు ఎల్‌టీపీలు పెన్‌డౌన్‌ చేశారు. దరఖాస్తులు చేసేందుకు నిరాకరించారు. ఎప్పుడైనా సరే ఎల్‌టీపీలే దరఖాస్తు చేస్తుంటారు. కానీ ఏదైనా అను మానాలున్నా అతిక్రమణలపై కాస్త వెసులుబాటు ఇవ్వా లన్నా నేరుగా మున్సిపల్‌ అధికారులతో మాట్లాడుకునే వారు. ఇప్పుడు ఎల్‌టిపిల హవా సాగుతోంది. అతిక్రమ ణలున్నాసరే ఇబ్బందులు పెడితే ఆ ప్రభావం నిర్మాణ రంగంపై పడుతుందన్న ఉద్దేశంతో జిల్లాలో పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని ఎల్‌టీపీలు తామే ముడుపులు తీసుకుంటున్నారు. అధికారుల పేరుతో దందా సాగిస్తున్నా రన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

Updated Date - Aug 07 , 2026 | 11:56 PM