కుర్చీ ఖర్చు ..రూ. కోట్లలో
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:47 PM
అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతోంది.. పరిస్థితి గతంలో మాదిరి లేదు. చిన్న పంచాయతీ అయినా రూ.20 నుంచి 30 లక్షలు పట్టుకోవాల్సి వస్తోంది. ఖర్చు తట్టుకునే అభ్యర్థికే గ్రామాల్లో ఆయా వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. మునిసిపాలిటీల్లో అయితే ఖర్చు రూ.కోట్లు దాటుతోంది..
చిన్న పంచాయతీకి రూ.15 లక్షలు..
మేజర్ అయితే రూ.కోటి పైమాటే
మున్సిపాలిటీకి రూ.15 నుంచి 20 కోట్లు !
పదవి కోసం ఎంతకైనా తెగింపు
పాలకొల్లు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) :గ్రామాల్లో ఇటు పట్టణాల్లో ఎన్నికల వేడి మామూలుగా లేదు.. పంచాయతీ, రెండో విడత మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి నామి నేషన్లు వేస్తున్నారు. అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతోంది.. పరిస్థితి గతంలో మాదిరి లేదు. చిన్న పంచాయతీ అయినా రూ.20 నుంచి 30 లక్షలు పట్టుకోవాల్సి వస్తోంది. ఖర్చు తట్టుకునే అభ్యర్థికే గ్రామాల్లో ఆయా వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. మునిసిపాలిటీల్లో అయితే ఖర్చు రూ.కోట్లు దాటుతోంది.. పదవి కోసం కొందరు ఎంత ఖర్చుకైనా వెనకాడని పరిస్థితి ఉంటే కొందరు ఆస్తులు అమ్మి బరిలో దిగుతున్నారు..ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య పండుగ కాదు –కోట్ల రూపాయల ఖర్చుతో జరిగే పెద్ద వ్యాపారం అయిపోయింది.. చిన్న పంచాయతీ నుంచి మున్సిపా లిటీ వరకు– ప్రతీ చోట అభ్యర్థులు చేస్తున్న ఖర్చు చూస్తే సామాన్య ఓటరు నోరెళ్లబెడుతున్నారు. రెండు జిల్లాల్లో కలిపి ఈ రెండు ఎన్నికలకు మొత్తం రూ.700 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
చిన్న పంచాయతీకి రూ.25 లక్షలు.. !
ప్రచారం, ప్లెక్సీలు, భోజనాలు, ప్రయాణం– అన్నీ కలిపితేనే ఈ లెక్క.. రెండు జిల్లాల్లో చిన్న పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం పోటీ చేస్తున్న ఒక్కొక్క అభ్యర్ధి సగటును రూ.25 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నారు. ఒక పంచాయతీలో ఇద్దరు ముగ్గురు పోటీలో ఉంటే ఒక్క పంచాయతీకే రూ.75 లక్షలు వరకు ఖర్చవుతుంది.ప్లెక్సీలు, బ్యానర్లు, మైక్‌లు, వాహనాలు, కార్యకర్తలకు భోజనాలు, టీలు,ప్రచార సామగ్రి, సోషల్ మీడియా ప్రచారం, చివరి రెండు రోజుల ప్రత్యేక ఖర్చులు ఇవన్నీ కలిపితేనే చిన్న పంచాయతీకి రూ.25 లక్షల ఖర్చు దాటుతోందని అభ్యర్థులే చెబుతున్నారు. మధ్య తరహా పంచాయితీల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువ. వార్డులు ఎక్కువ. పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది. అదుకే ఒక్కొక్క అభ్యర్ధికి రూ.50 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. కొన్నిచోట్ల సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల ఖర్చు కూడా కలిపితే ఒక్క పంచాయతీకి రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు వెళ్తోంది. మేజర్ పంచాయితీల పరిస్ధితి మరింత భారీగా ఉంది. ఒక్కొ అభ్యర్ధి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. జనాభా ఎక్కువ, ఓటర్లు ఎక్కువ ఉండడంతో సొమ్ము కూడా ఎక్కువే అవుతుంది. కొన్ని మేజర్ పంచాయతీల్లో ఇద్దరు బలమైన అభ్యర్థుల మధ్య పోటీ ఉంటే ఇద్దరి ఖర్చు రూ.2 కోట్లు దాటు తోంది. గెలిచిన సర్పంచ్‌కు ఐదేళ్లలో వచ్చే గౌరవ వేతనం, అలవెన్సులు కలిపినా ఈ ఖర్చులో పదో వంతు కూడా రాదని స్థానికులు లెక్కల వేస్తున్నారు.
మున్సిపాలిటీకి రూ. 15 నుంచి 20 కోట్లు
రెండు జిల్లాల్లో రెండో విడత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చు పంచాయితీల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఒక్కొక్క మున్సిపాలిటీకి మొత్తం రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.ఒక మున్సిపాలిటీలో 30 నుంచి 40 వరకు వార్డులు ఉంటాయి. ప్రతీ వార్డులో కౌన్సిలర్ అభ్యర్ధి రూ.10 నుంచి 20 లక్షలు, చైర్మన్ అభ్యర్ధి రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. వీటికి తోడు పార్టీల ఖర్చు, స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం, బహిరంగ సభలు, సోషల్ మీడియా, సర్వేలు– అన్ని కలిపితే రూ.15 నుంచి రూ. 20 కోట్లు దాటుతోంది.
రెండు జిల్లాల్లో మొత్తం లెక్క ఎంత..!
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వందల సంఖ్యలో పంచాయతీలు ఉన్నాయి. చిన్న, మద్య, మేజర్ పంచాయితీలు కలిపి– పంచాయితీ ఎన్ని కలకే రూ.500 కోట్లకు పైనే ఖర్చు అవుతోంది. మున్సిపాలి టీలకు మరో రూ.200 కోట్లకు పేనే. రెండూ కలిపితే రూ.700 కోట్లకు పైనే. ఈ డబ్బుతో రెండు జిల్లాల్లో ఎన్ని రోడ్లు వేయవచ్చు..? ఎన్ని తాగునీటి పథకాలు పూర్తి చేయవచ్చు ? ఎన్ని పాఠశాలలు బాగు చేయ వచ్చు..? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రూ. కోట్లు , లక్షలు ఖర్చు చేసిన డబ్బులు ఎలా తిరిగి వస్తుంది..? ఎన్నికల్లో డబ్బు పంచేవారు, ఖర్చు చేసే వారు గెలిచాక ఆ డబ్బును తిరిగి సంపాదించు కోవడానికి ప్రయత్నిస్తారని పెదవి విరుస్తున్నారు.