పైకిలేవని టమాటా
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:38 AM
మార్కెట్లో టమాటా ధర పైకి లేవడం లేదు. రెండు నెలలుగా ధరలు పతనమయ్యాయి. మదనపల్లి మార్కెట్లో కూడా ధర లేకపోవడంతో రైతులు తోటలను కోయడం మానేశారు.
దిగివచ్చిన దోసకాయ ధరలు
నిలకడగా కూరగాయలు.. అదేబాటలో ఉల్లి
తాడేపల్లిగూడెం, మార్చి 8(ఆంధ్రజ్యోతి):మార్కెట్లో టమాటా ధర పైకి లేవడం లేదు. రెండు నెలలుగా ధరలు పతనమయ్యాయి. మదనపల్లి మార్కెట్లో కూడా ధర లేకపోవడంతో రైతులు తోటలను కోయడం మానేశారు. కోత కూలి కూడా అక్కడి రైతులకు రావడం లేదు. కోసి మార్కెట్‌కు తీసుకొస్తే కూలి సొమ్ములు రావడం లేదని తోటల్లోనే వదిలేస్తున్నారు. వీటిని అక్కడ పశువులు తింటున్నాయి. తాడేపల్లిగూడెం మార్కెట్లో గత రెండు నెలలుగా టమాటా కిలో రూ.15 నుంచి 20 మధ్యనే అమ్ముతున్నారు.
ధర తగ్గిన దోసకాయలు
దోసకాయల ధర దిగి వచ్చింది. కేజీ రూ.50 నుంచి 60 వరకు వెళ్లిన దోసకాయ ధర ఒక్కసారిగా రూ.30కు వచ్చింది. ఇప్పుడు తెలికచర్ల, అనంతపల్లి, నల్లజర్ల ప్రాంతాల్లో వేసిన దోసతోటలు కాపుకాసి కోతకు వచ్చాయి. ఇక్కడ నుంచే ప్రస్తుతం మార్కెట్‌కు అధికంగా వస్తున్నాయి. మిగిలిన కూరగాయల ధరలు నిలకడగానే ఉన్నాయి. వంకాయలు కిలో రూ.40, బీర రూ50, దొండ రూ.40, కాకర రూ.40, క్యారెట్ రూ.40, బీట్‌రూట్ రూ.50, క్యాప్సికం రూ.80, హైబ్రిడ్ తెల్లచిక్కుడు రూ.40, హైబ్రిడ్ నల్లచిక్కుడు రూ.60, నాటు చిక్కుడు రూ.100, కంద రూ.80, పెండ్లం రూ.60, పొట్ల కాయ రూ.30, అరటి కాయలు 3 రూ.20లకు విక్రయిస్తున్నారు.
నిలకడగా ‘ఉల్లి’
ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర నుంచే ఉల్లి దిగుమతి అవుతోంది. మంచి నాణ్యత ఉన్న వంద కిలోలు రూ.1800కి హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. మార్కెట్లో హోల్‌సేల్‌గా రూ.క్వింటా రూ.1000 నుంచి 1800 మధ్య విక్రయాలు జరుగుతున్నాయి. ఇక రిటైల్ వ్యాపారులు నాణ్యమైన ఉల్లిని రూ.100కు 4 కిలోలు, మధ్య రకం రూ.100కు 5 కిలోలు వంతున విక్రయిస్తున్నారు. ఇక ఆటోల్లో తిరిగి అమ్మే వ్యాపారులు రూ.100కు 6 కిలోలు, 7 కిలోలు చొప్పున అమ్ముతున్నారు.
అల్లం కిలో హోల్‌సేల్‌గా రూ.50
హోల్‌సేల్ మార్కెట్లో నంబరు వన్ అల్లం కిలో రూ.50 అమ్ముతుంటే రిటైల్ మార్కెట్లో ఇదే అల్లాన్ని రూ.80కు అమ్ముతున్నారు. ఈవిధంగా వినియోగదారులను నిట్టనిలువునా రిటైల్ వ్యాపారులు దోచేసుకుంటున్నారు. అదేమి అని అడిగితే తరుగు వస్తుందని, కుళ్లిపోతుందని సాకులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నాటకలోని మైసూరు జిల్లా నుంచి తెచ్చిన నాణ్యత గల నంబర్ వన్ అల్లం హోల్‌సేల్‌గా రూ.10 కిలోలు రూ.500, రెండో రకం రూ. 470 రిటైల్ వ్యాపారులకు అమ్ముతున్నారు. హసన్, షిమోగా ప్రాంతాల నుంచి దిగుమతయ్యే అల్లంలో నాణ్యత తక్కువగా ఉండడంతో హోల్‌సేల్ వ్యాపారులందరూ మైసూర్ జిల్లా అల్లం వైపు మొగ్గుచూపుతున్నారు.
కొండెక్కిన నిమ్మ ధర
దిగుబడి తగ్గడంతో కేజీ రూ.30 నుంచి రూ.130 పెరిగిన వైనం
తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):
మార్కెట్‌లో నిమ్మ ధర కొండెక్కింది. వేసవిలో తాపాన్ని తీర్చుకునేందుకు ఉపయోగించే శీతల పానీయాల్లో అత్యధికంగా వినియోగించే నిమ్మకాయలు కొనలేని స్థితిలో ఉన్నాయి. ఓవైపు నిమ్మ దిగుబడి మందగించడం.. మరోవైపు నిమ్మకు డిమాండ్ పెరగడంతో కేజీ రూ.30 నుంచి రూ.130కి పెరిగిపోయింది. మార్కెట్‌లో కూరగాయలు కొన్న కొంతమంది వినియోగదారులు రెండు నిమ్మకాయలు ఇవ్వండి అని అడుగుతారని కొంతమంది వ్యాపారులు దుకాణాల్లో పెట్టేందుకు సాహసించడం లేదు. రానున్న రోజుల్లో నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్ననయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతివారం ఏలూరు నిమ్మ మార్కెట్‌లో పది టన్నుల వరకు వస్తుండగా తాజాగా ధరల పెరుగుదల, దిగుబడి లేకపోవడంతో నాలుగు టన్నులే దిగుమతి చేసుకునే పరిస్థితి ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మ దిగుబడి గణనీయంగా తగ్గడంతో బయట రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి దుగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
నిమ్మ దిగుమతి తగ్గింది..
గతవారం కేజీ నిమ్మకాయలు రూ.30 విక్రయించే వాళ్లం. ఈవారం నిమ్మకాయలు ధర అమాంతం పెరిగిపోయింది. కేజీ రూ.130 వరకు పలుకుతోంది. వ్యాపారం చేయలేక కొనుగోలు చేసినవి అమ్మలేక ఇబ్బంది పడుతున్నాం. మార్కెట్‌లో నిమ్మ దిగుమతి తక్కువగా ఉంది.
– కర్రి సత్యనారాయణ, నిమ్మ వ్యాపారి