నేడు ఆరవల్లిలో యోగి వేమన జయంత్యుత్సవం
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:02 AM
ఆవరవల్లి ప్రజల ఆరాధ్యదైవం యోగివేమన 101వ జయంత్యుత్సవాన్ని ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అత్తిలి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఆవరవల్లి ప్రజల ఆరాధ్యదైవం యోగివేమన 101వ జయంత్యుత్సవాన్ని ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సాధారణంగా సంక్రాంతి వచ్చిందంటే గ్రామా ల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఆరవల్లి గ్రామస్థులకు జనవరి 18న నిర్వహించే వేమన జయంతే పెద్ద పండుగ. గ్రామానికి చెందిన దేశ విదేశాలకు వెళ్లిన కొంతమంది, వృత్తి, ఉపాధి రీత్యా బయట ప్రాంతాలకు వెళ్లిన మరికొందరు వేమన జయంతి రోజున తప్పనిసరిగా స్వగ్రామానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలు, పిల్లలకు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
మానవ జీవితానికి సంబంధించిన అనేక నిత్యసత్యాలను తనదైన శైలిలో తేట తెలుగు పదాలతో వర్ణించి, తెలుగువారి హృదయాల్లో యోగావేమన చిరస్మరణీయునిగా నిలిచారు. వేమనకు, ఈ గ్రామానికి చారిత్రకంగా ఎటువంటి సంబంధం లేకపోయినా గ్రామస్థులకు వేమన ఆరాధ్య దైవమయ్యారు.
వేమన పండుగ చరిత్ర ఇలా..
యోగి వేమన పండుగపై గ్రామస్థులు ఆసక్తికరమైన విషయం చెబుతారు. 1926కు ముందు గ్రామంలో ఏటా అగ్ని ప్రమాదాలు సంభవించేవి, అలాంటి పరిస్థితుల్లో గ్రామానికి చెందిన వి.సత్యనారాయణరెడ్డి (దాసు) 1926 జనవరి 18న గ్రామంలో వేమన చిత్రపటాన్ని తాటాకు పందిరిలో ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు. ఈవిధంగా చేయడంతో గ్రామంలో అగ్ని ప్రమాదాలు తగ్గిపోయాయట. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 18న వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన యువత యోగివేమనరెడ్డి యువజన సేవా సంఘాన్ని నెలకొల్పి పలు సేవా అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు.
కాలభైరవ సంతర్పణ..
వేమన జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏటా జనవరి 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నసమారాధన నిర్వహిస్తారు. ఈ అన్నసంతర్పణ కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామ సింహాలైన శునకాలకు విస్తరాకులో ఆహార పదార్థాలను వడ్డించడం విశేషం. గ్రామానికి కాపలా ఉంటూ గ్రామాన్ని రక్షించేది కాలభైరవుడని, ప్రతి ఏటా గ్రామంలో కాలభైరవ సంతర్పణ పేరుతో గ్రామంలో ఉన్న శునకాలకు భోజనం వడ్డిస్తామని యోగి వేమన జయంతి ఉత్సవ కమిటీ చైౖర్మన్ వెలగల అమ్మిరెడ్డి తెలిపారు.