వరమివ్వు.. వరలక్ష్మీ
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:12 AM
సిరిసంపదలు, భోగభాగ్యాలు కల్గించే వరలక్ష్మీవ్రతాన్ని శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈనెల 21న మహిళలు వైభవంగా జరుపుకోనున్నారు.
నేడు వరలక్ష్మి వ్రతం
ద్వారకాతిరుమల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సిరిసంపదలు, భోగభాగ్యాలు కల్గించే వరలక్ష్మీవ్రతాన్ని శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈనెల 21న మహిళలు వైభవంగా జరుపుకోనున్నారు. వరలక్ష్మీదేవి వరాలను అనుగ్రహిస్తారని భక్తుల కోర్కెలను తీర్చే దేవతగా నమ్ముతారు. ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కల్గుతాయన్నిది భక్తుల నమ్మకం. ధనం, శ్రేయస్సు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం, ధైర్యం, శక్తి, విజయం ఇవన్నీ అష్టలక్ష్ములు రూపంలో మహిళాభక్తులకు అందుతాయని చెబుతారు.
వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత..
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్ములకు అర్చన చేసినంత ఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. అందువల్ల ప్రతీ ఏటా శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే వరలక్ష్మివ్రతాన్ని జరపడం సంప్రదాయం. వ్రతం ఆచరించే రోజున వేకువజామునే మహిళలు ఇంటిని రంగవల్లులతో అలంకరించి అమ్మవారిని మనసారా ఆహ్వానిస్తారు. పూజాగదిలో మండపాన్ని నిర్మించుకుని బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపై కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తరువాత కలశస్థాపన కార్యక్రమం చేపడతారు. అనంతరం అమ్మవారిని ఉంచి పూజాసామగ్రి సిద్ధం చేసుకుంటారు. తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిదిపోగులు తీసుకుని పసుపు రాసి దానికి ఐదు లేదా తొమ్మిది ముడులు వేసి తోరాలను తయారు చేసి ముందుగా వీటిని పూజించాలి. అమ్మవారికి ప్రీతికరమైన చేమంతులు. కలువ, నూరువరహాలుతో పూజించేందుకకు ఎంతో వ్యయప్రయాసలతో గురువారం సాయంత్రానికి అన్నీ సిద్ధం చేస్తారు. మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్త ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయ బద్ధమైనది. ఈవ్రతం సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీ దేవికి వివరించినట్టు స్కందపురాణం చెబుతోంది.
పూజకు శుభసమయం ఇలా..
ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 21న జరుపుకునేందుకు అనువని ప్రముఖ పంచాంగకర్త కాశీభొట్ల పార్వతీశ్వరశర్మ తెలిపారు. కొన్ని పంచాంగ గణనలను బట్టి ఆగస్టు 28 అని కొందరు భావిస్తున్నప్పటికీ ఇది సరికాదని.. శ్రావణమాస నియమం ప్రకారం సరైన తేదీ ఆగస్టు 21నే అని స్పష్టం చేశారు. ఈ వ్రతం పూజ ఆచరించేందుకు కొన్ని స్థిర లగ్నాలున్నాయని, ఆ సమయాల్లో చేసుకుంటే విశేషమైన శుభఫలితాలు కల్గుతాయని వారు వ్యాఖ్యా నిస్తున్నారు. పండితుల సూచనల ప్రకారం ఉదయం సూర్యోద యం తర్వాత నుంచి మధ్యాహ్నం వరకు ఉన్న సమయం పూజలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 10.30 గంటల మధ్య ఈ వ్రత పూజనిర్వ హించడం శుభప్రధమని పండితులు భావిస్తున్నారు.
పూజ సామగ్రి ధరలకు రెక్కలు
ఏలూరు రూరల్/తాడేపల్లిగూడెం/తణుకు/పాలకొల్లు అర్బన్/ భీమవరం టౌన్/ద్వారకాతిరుమల, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి) : వరలక్ష్మి పూజను ధరల పెరుగుదలతో ఏవిధంగా చేయాలో తెలియక భక్తులు ఆందోళన చెందుతున్నారు. పూజకు ఉపయోగించే ప్రతి వస్తువు ధరలు మరింత ప్రియమయ్యాయి. శ్రావణమాసంలో వచ్చే తొలిపండగ వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు పూజాసామగ్రి కొనుగోలు చేయడానికి బయటకు వచ్చిన వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. గతంలో లేని విధంగా మట్టితో చేసిన అమ్మవారి విగ్రహాలు ఈ ఏడాది పలు రంగుల్లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని ప్రధాన పట్టణాలలో మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వరలక్ష్మీ దేవి రూపులను కొనుగోలు చేసేందుకు మహిళలు బంగారు దుకాణాలకు తరలిరావడంతో ఏలూరు వన్‌టౌన్, టూటౌన్, ప్రధాన బజార్లు కిక్కిరిసిపోయాయి. ఆయా మార్కెట్లలో మల్లెలు కిలో రూ.1200 విక్రయిస్తున్నారు. మూర మల్లెలు రూ.200, మూర కనకంబరాలు రూ.100, విరజాజులు మూర రూ.100 విడిగా అమ్ముతున్నారు. ఇక చామంతిలో ఉన్న రకాలన్నీ కిలో రూ.600 వరకు విక్రయిస్తున్నారు. బంతిపువ్వులు కిలో రూ.100 దొరుకుతున్నాయి. కలువ పువ్వు ధర రూ.5 నుంచి రూ.10 వరకు, పూల దండ సైజును బట్టి, పువ్వుల రకాన్ని బట్టి దండ రూ.250 నుంచి 500 వరకు అమ్మ కాలు జరిగాయి. బెంగళూరు గులాబీలు కిలో రూ.400కు అమ్మారు.
అరటి పండ్లు అధరహో..
శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రెండోవారం రావడంతో అరటిపండ్లకు మరింత డిమాండ్ ఏర్పడింది. పెళ్లిళ్లు, శంకుస్థాపనులు వంటి శుభముహూర్తాలు ఉండడంతో వీటి ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చిన్న అరటి పండ్ల గెల రూ.500, పెద్ద అరటిపండ్ల గెల రూ.1000 వంతున అమ్మారు. విడిగా డజను అరటి పండ్లు సైజును బట్టి రూ.80 నుంచి రూ.100కు విక్రయించారు.
కొబ్బరి కాయ రూ.50
మార్కెట్లో కొబ్బరికాయల ధరలు మండుతున్నాయి. పెద్ద సైజులో కాయ కావాలంటే రూ.50 పెట్టేల్సిందే. చిన్న సైజు కాయ కూడా రూ.30పైనే అమ్మారు. కొబ్బరి విస్తీర్ణం ఉన్న దిగుబడి తగ్గడంతో కొబ్బరికి డిమాండ్ వచ్చిపడింది. కొంతమంది వ్యాపారులు 2027లో నిర్వహించే పుష్కరాలకు ఇప్పటినుంచే ముదర కాయలను నిల్వలు చేసుకుంటున్నట్టు సమాచారం. కొబ్బరి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
పండ్ల ధరలు మరింత ప్రియం
యాపిల్ డజను రూ.300, పొత్తులు ఒక్కోటి రూ.20, తమల పాకులు మోద రూ.60, బత్తాయిలు డజను రూ.200, జామ కాయ రూ.20, ద్రాక్ష కిలో రూ.150, దానిమ్మ డజను రూ.200 నుంచి 300 అమ్మారు. పత్రి కట్ట రూ.20, మారేడు కాయ రూ.20, బత్తాయి రూ.30, తామర పువ్వులు రెండు రూ.40, మొక్కజొన్న రెండు రూ.40, చామంతి పావుకేజీ వంద, తమలపాకులు కట్ట రూ.50 చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి.
పూజకు అవసరమైన ఆయిల్, బెల్లం, పంచదార ధరలకు పెరిగిపోయాయి. లీటర్ ఆయిల్(సన్‌ప్లవర్) రూ.185, పంచదార కిలో రూ.60, బెల్లం రూ.70, మినపగుళ్లు కిలో రూ.160, మినపప్పు పాతది రూ.130, కొత్తది రూ.115కు అమ్ముతున్నారు.