Share News

రెండో విడత పంచాయతీలకు నేడే పోలింగ్‌

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:57 AM

జిల్లాలో పల్లెపోరు రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎనిమిది మండలాల్లోని 166 పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది.

రెండో విడత పంచాయతీలకు నేడే పోలింగ్‌
కైకలూరు ఏఎంసీ కార్యాలయ ఆవరణలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ వద్ద ఎన్నికల సిబ్బంది

160 సర్పంచ్‌, 1219 వార్డు స్థానాలకు నిర్వహణ

గ్రామాలకు చేరిన పోలింగ్‌ మెటీరియల్‌

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ పొలీస్‌ బందోబస్తు .. వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి : డీపీవో

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పల్లెపోరు రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎనిమిది మండలాల్లోని 166 పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి ఆపై ఉపసర్పంచ్‌ ఎన్నికను నిర్వహిస్తారు.

జిల్లాలోని భీమడోలు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల మండలాల్లో మొత్తం 194 పంచాయతీ సర్పంచ్‌లు, 1,972 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయ గా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 28 పంచా యతీలు, 34 సర్పంచ్‌, 753 వార్డు స్థానాలు ఏకగ్రీవమ య్యాయి. దీంతో మిగిలిన 166 పంచాయతీల్లో 160 సర్పంచ్‌ పదవులకు, 1219 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది.

రెండో విడత ఏకగ్రీవాల్లోను కూటమి హవా

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 34 పంచా యతీ సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా ఇందులో 27 సర్పంచ్‌ పదవులు కూటమి పార్టీల అనుకూలురు, ప్రతిపక్ష వైసీపీ అనుకూలురు 7 స్థానాలను దక్కించున్నారు. కూటమి పార్టీలకు ఏకగ్రీవమైన సర్పంచ్‌ పదవుల్లో టీడీపీకి 25, జనసేన పార్టీకి 2 స్థానాలు దక్కాయి.

1,649 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

166 పంచాయతీల్లో 1,649 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సాధారణ పోలింగ్‌ కేంద్రాలతో పాటు సమస్యాత్మక, అతి సమస్యాత్మక, అత్యంత సమ స్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో అదనపు పోలీస్‌ బందోబస్తు, వెబ్‌ కాస్టింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. 20 జోన్‌లు, 54 రూట్స్‌గా విభజించారు. 30 మంది జోనల్‌ అధికారులను, 67 మంది రూట్‌ అధికారులను నియమించారు.

పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి

పోలింగ్‌ జరిగే 166 పంచాయతీలకు సంబంధించి ఎనిమిది మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎనిమిది డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి పోలింగ్‌ మెటీరియల్‌ను 162 వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. పోలింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది ఆ వాహనాలతో పాటు గ్రామాలకు తరలివెళ్లారు. 6,180 మంది పోలింగ్‌ సిబ్బంది తమ విధులను నిర్వర్తించనున్నారు. ఇందులో పీవోలు 2430, ఏపీవోలు 3750, మంది ఉన్నారు. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థుల గుర్తులతో గులాబీ రంగు బ్యాలెట్‌ పేపర్‌ను, వార్డు సభ్యుడికి పోటీ చేసే అభ్యర్థుల గుర్తులతో తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌ను పోలింగ్‌ కేంద్రంలో ఓటరుకు అందిస్తారు.

3.68 లక్షల మంది ఓటర్లు

రెండో విడత పోలింగ్‌ జరిగే మండలాల్లో మొత్తం 3,68,871 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓట ర్లు 1,81,442 మంది, మహిళా ఓటర్లు 1,87,417 మంది, ఇతర ఓటర్లు 12 మంది తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి : డీపీవో

ఎనిమిది మండలాల్లోని 166 పంచాయతీల్లో 160 సర్పంచ్‌, 1219 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి నిర్వ హించడా నికి అన్ని ఏర్పాట్లు చేశామని డీపీవో మల్లికార్జున రావు తెలిపారు. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

పొరపాట్లకు తావు ఇవ్వొద్దు : కలెక్టర్‌ వెట్రిసెల్వి

కలిదిండి/కైకలూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమి షన్‌ నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు పోలింగ్‌, కౌంటింగ్‌ విధులను నిర్వహించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. శనివారం కలిదిండి మార్కెట్‌యార్డు, కైకలూరు వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె సందర్శించి పరిశీలించారు. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియపై వారు పొందిన శిక్షణ గురించి అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. 673 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో అదనపు పోలీస్‌ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం కలిదిండి జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. డీఎల్‌పీవో విజయలక్ష్మి, తహసీల్దార్లు రామకృష్ణ,ఆర్‌.రామకృష్ణరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, అప్పారావు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ

కైకలూరు/ఏలూరు క్రైం :జిల్లాలో సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ అన్నారు.రెండో విడత పంచాయతీ ఎన్నికల నేప థ్యంలో పలు పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేశారు. శనివారం కైకలూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో కైకలూరు పంచాయతీ కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ర్యాలీలు, ఊరేగింపులు నిషేధమని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏఏస్పీ మునిరాజు, డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌, నిడమర్రు, కైకలూరు రూరల్‌, భీమడోలు సీఐలు రజనీ కుమార్‌, రవికుమార్‌, కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 12:57 AM