Share News

నేటి నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:22 AM

అంగన్‌వాడీ కేంద్రంగా సమాజ ఆరోగ్యంపై మరింత ఫోకస్‌ పెంచే దిశగా ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా ఈనెల తొమ్మిదో తేదీ నుంచి అక్టోబరు ఎనిమిదో తేదీ వరకు నెలరోజుల పాటు జాతీయ పోషణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు.

నేటి నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు

అంగన్‌వాడీ కేంద్రంగా కార్యాచరణ

పలు శాఖల సమన్వయంతో ప్రభుత్వ పథకాల పరుగుకు ఊతం

(ఏలూరు–ఆంఽధ్రజ్యోతి)/భీమవరం టౌన్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

అంగన్‌వాడీ కేంద్రంగా సమాజ ఆరోగ్యంపై మరింత ఫోకస్‌ పెంచే దిశగా ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా ఈనెల తొమ్మిదో తేదీ నుంచి అక్టోబరు ఎనిమిదో తేదీ వరకు నెలరోజుల పాటు జాతీయ పోషణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సమగ్ర ప్రణాళికను ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఐసీడీఎస్‌, ఇతర శాఖలు సమన్వయంతో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వారణాసిలో లాంఛనంగా బుధవారం మధ్యాహ్నం ప్రారంభం అయ్యాక, ఏలూరు, పశ్చిమ జిల్లాల్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏలూరు జిల్లా ఐసీడీఎస్‌ పీడీ పి.శారద, పశ్చిమ గోదావరి జిల్లా ఐసీడీఎస్‌ పీడీ డి.శ్రీలక్ష్మి తెలిపారు.

ఐదు థీమ్‌లు.. ఆహారంలో వైవిధ్యానికి ప్రాధాన్యం

9వ జాతీయ పోషణ మాసోత్సవంలో ఐదు ఽథీమ్‌లతో ఆహారంలో వైవిధ్యానికి పెద్దపీట వే యనున్నారు. ఆహారంలో సమతుల్య ఆహారం ఏ విధంగా చిన్నారుల నుంచి పెద్ద వయస్సుల వారీ వరకు ఏ విధంగా అందించాలి. అంగన్‌వాడీ కేంద్రంలో తాజాగా ఆహార పదార్థాలు అందించడం. సమాజంలో ఆహార అలవాట్లు మార్పులకు శ్రీకారం చుట్టడం. సరైన పోషణ ఇస్తే బాల్య వికాసానికి ఒనగూరే ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాల సద్వినియోగంలో శాఖల ఆవశ్యకతపై విస్రృతంగా ప్రచార కార్యక్రమాలను తేదీల వారీగా అంగన్‌వాడీ కేంద్రంగా జరపనున్నారు.

వంటకాల ప్రదర్శనలు..

ఏలూరు జిల్లాలో 2,225 అంగన్‌వాడీ కేంద్రాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,626 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో స్థానికంగా లభించే ఆహార ధాన్యాలను ఉపయోగించి మిల్లెట్లతో మురుకులు, జొన్న కేక్‌, ఇతర ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే సమాజ సభ్యులతో పాటు, స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీ మేనేజ్‌మెంట్‌ కమిటీలు కూడా భాగస్వామ్యంతోనే నెలవారీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

‘పీఎంఎంవీవై’ సలహాలు

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా అర్హులైన లబ్ధిదారుల పరిధిని విస్తరించడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలవనుంది. గర్భధారణ సమయంలో వెయ్యి రోజుల్లో తల్లిపోషణ, సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, గర్భిణులు, పాలిచ్చే తల్లులను గుర్తించి నమోదు చేస్తారు. ఈ కార్యక్ర మానికి కలెక్టర్లు, పలు శాఖల అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలందాయి. అదేవిధంగా హమారీ అంగన్‌వాడీ– హామారీ జిమ్మేదారి (మన అంగన్‌వాడీ– మన బాధ్యత) అనే స్ఫూర్తితో అంగన్‌ వాడీ కేంద్రాల సమాజ యాజమాన్య భావనను బలోపేతం చేసేలా పోషణ్‌ మాసోత్సవం జర పాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని ఏలూరు జిల్లా ఐసీడీఎస్‌ పీడీ పి.శారద, పశ్చిమ గోదావరి జిల్లా ఐసీడీఎస్‌ పీడీ డి.శ్రీలక్ష్మి తెలిపారు.

Updated Date - Sep 09 , 2026 | 12:22 AM