Share News

నేటి నుంచి అమరావతి ఏలూరు జిల్లాస్థాయి పోటీలు

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:20 AM

గురువారం నుంచి రెండురోజుల పాటు 6,7 తేదీలలో ఏలూరు అల్లూరి సీతారామరాజు క్రీడామైదానంలో జిల్లాస్థాయి పోటీలు జరుగనున్నాయి.

నేటి నుంచి అమరావతి ఏలూరు జిల్లాస్థాయి పోటీలు

ఏలూరురూరల్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి):మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న లక్ష్యం, ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఉద్దేశం ప్రతిభ ఉన్నా కానీ.. సరైన వేదిక లేదని బాధపడుతున్నారా ? మీ కోసమే రాష్ట్ర క్రీడాప్రాధి కార సంస్థ (శాప్‌) ‘అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026’ పేరుతో రాష్ట్రస్థాయి క్రీడా సంబరాలకు తెరలేపింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలనే తేడా లేదు. యువ అథ్లెట్లకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) సువర్ణా వకాశం కల్పిస్తోంది. వారిని జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణించేలా చేయడమే ముఖ్యఉద్దేశంగా ‘అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026’ క్రీడా సంబరాలు జరుగు తున్నాయి. పోటీల్లో భాగంగా ఇప్పటికే నియోజకవర్గ స్థాయి పోటీలు పూర్త య్యాయి. గురువారం నుంచి రెండురోజుల పాటు 6,7 తేదీలలో ఏలూరు అల్లూరి సీతారామరాజు క్రీడామైదానంలో జిల్లాస్థాయి పోటీలు జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో అండర్‌–17(బాలురు, బాలికలు), అండర్‌–23 (పురుషులు, మహిళలు) వయో విభాగాలలో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి విజేతలకు ఆగస్టు 20 నుంచి 25 వరకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.

బహుమతులు ఇలా..

ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.20,000, ద్వితీయ స్థానానికి రూ.15000 నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందిస్తారు. విజేతలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మూడు శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి శాప్‌ ప్రతిపాదనలు పంపింది.

ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియంలో..

ఆగస్టు 6న ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, హాకీ, ఖోఖో, వాలీబాల్‌ పోటీలు జరుగుతాయి. బాక్సింగ్‌ కండ్రిగగూడెంలోని బాక్సీయో ఫిట్‌ అకాడమీలో, చెస్‌ ఏఆర్‌డీజీకే స్కూల్‌లో, వెయిట్‌ లిఫ్టింగ్‌.. ఇండోర్‌ స్టేడియం వెయిట్‌ లిఫ్టింగ్‌ హాల్‌లో, యోగా.. యోగా ట్రైనింగ్‌ సెంటర్‌లో జరుగుతాయి. ఆగస్టు 7న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ పోటీలు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించనున్నారు. అవసరమైతే 8వ తేదీన కూడా పోటీలు నిర్వహించే అవకాశం ఉందని డీఎస్‌డీవో ఎస్‌ఏ అజీజ్‌ తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారు.

Updated Date - Aug 06 , 2026 | 12:20 AM