నేడే పురపోరు ఫలితాలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:48 AM
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసి పాలి టీల ఎన్నికల కౌంటింగ్ నేడు జరగ నుంది. ఈ మేరకు అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశా రు. పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు
తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
రెండు మునిసిపాలిటీల్లో తొలి ఫలితం 10 గంటలకు.. కార్పొరేషన్‌లో 11 గంటలకు వెల్లడయ్యే అవకాశం
కౌంటింగ్ హాలులోకి సెల్‌ఫోన్‌లు నిషేధం
ఏలూరు/ టూటౌన్/ఏలూరు క్రైం/నూజివీడు టౌన్/ జంగారెడ్డిగూడెం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, నూజివీడు మునిసి పాలి టీల ఎన్నికల కౌంటింగ్ నేడు జరగ నుంది. ఈ మేరకు అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశా రు. పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ సీఆర్‌ఆర్ కళాశాలలో జరగనుంది. ఈనెల 1న జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు సీఆర్‌ఆర్ కళాశాలలో స్ర్టాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. కౌంటింగ్ కోసం నగర పాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండు ఎన్నికల కౌంటింగ్ హాళ్లను ఏర్పాటుచేశారు. 62 డివిజన్లకు 62 టేబుళ్లు ఏర్పాటు చేశా రు. ఒక్కో టేబుల్ దగ్గర నలు గురు ప్రభుత్వ సిబ్బంది ఉండి బాక్సులు తెరచి మేయర్ ఓట్లను కార్పొరేటర్ల ఓట్లను వేరు చేస్తారు. అనంతరం 62 డివిజన్లలో మేయర్ ఓట్లను ఒక హాలులోకి చేరుస్తారు. అక్కడ మేయర్ ఓట్లు, మరో హాలులో డివిజన్లవారీగా కార్పొరేటర్ల ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ హాలులోకి అభ్యర్థితో పాటు ఏజెంట్‌ను అనుమతిస్తారు. సెల్‌ఫోన్‌లు, ఎటువంటి ఆహార పదార్థాలు అనుమతించరు. బయట ఏర్పాటు చేసిన చోట ఆహారం తినే ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్..జేసీ
ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌గౌడ, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, వన్‌టౌన్ సీఐ రామకృష్ణ, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు సోమవారం పరిశీ లించారు. కౌంటింగ్ హాలులో భద్రతా ఏర్పాట్లు, అధికారుల రాకపోకలు, అనుమతి కలిగిన వ్యక్తుల ప్రవేశం, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల పరి సరాలలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్‌ను నిర్ధేశిత ప్రాంతాల్లో జరిగేలా చూడాలని కలెక్టర్, జేసీ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎలాంటి ఉద్రిక్త పరి స్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
నూజివీడులో..
బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్లు తీర్పు నేడు రానున్నది. నూజివీడు మున్సిపల్ చైర్మన్ బరిలో వున్న ఆరుగురు అభ్యర్థులతోపాటు 36 వార్డు కౌన్సిల్ స్థానాలకు పోటీలో వున్న 81 మంది కౌన్సిల్ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. నూజివీడు మున్సిపల్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. మొత్తం 36 టేబుళ్లు ఏర్పాటుచేయగా రెండు రౌండ్లలో ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తికానుంది. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు సిబ్బంది చొప్పున 108 మందిని నియమించారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా 244 మంది పోలీస్ సిబ్బంది సైతం నియమించారు.
జంగారెడ్డిగూడెంలో..
జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలోని గొడౌన్‌లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కానుంది. మున్సిపల్ చైౖర్‌పర్సన్ అభ్యర్థులుగా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలువగా, 32 వార్డులలో 78 మంది పోటీలో నిలిచారు. కౌంటింగ్ కేంద్రంలో ఎనిమిది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. స్ర్టాంగ్ రూమ్ వద్ద, లెక్కింపు కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు పెట్టారు. ఉదయం ఏడు గంటలలోపు అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ హాలుకు చేరుకోవాలి.
రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి
చైౖర్‌పర్సన్ అభ్యర్థులకు 16 టేబుళ్లు, కౌన్సిలర్ అభ్యర్థులకు 16 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొదట స్ట్రాంగ్ రూమ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాలుకు తీసుకువచ్చి అధికారుల సమక్షంలో సీల్ ఓపెన్ చేసి లెక్కిస్తారు. చైర్‌పర్సన్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు, కౌన్సిలర్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు వార్డు వారీగా వేరు చేస్తారు. వీటిలో చెల్లని ఓట్లు, నోటా ఓట్లను వేరుచేస్తారు. చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ ఓట్లను వేర్వేరుగా ఓట్లు లెక్కిస్తారు. మొదటి రౌండ్ పూర్తి కాగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో సంబంధిత ఆర్వోలు తెలియజేస్తారు. రెండో రౌండ్ లెక్కింపు చేసిన అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్ధుల ఓట్లను ఆర్వోలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారిం చిన తర్వాత అధికారికంగా గెలుపును అక్కడికక్కడే ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపునకు 146 మంది సిబ్బందిని నియ మించారు. వీరిలో 18 మంది ఎన్నికల అధికారులు(ఆర్వో)కాగా 128 మంది కౌంటింగ్ సిబ్బందిగా విధులు నిర్వహించనున్నారు.
కౌంటింగ్ ఏజెంట్లది కీలక పాత్ర
ఓట్ల లెక్కింపులో రాజకీయ పార్టీల తరపున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించనున్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థితోపాటు 16 మంది కౌంటింగ్ ఏజెంట్లు, ఒక చీఫ్ కౌంటింగ్ ఏజెంట్‌తో కలిపి 18 మంది, 78 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు 78 మంది కౌంటింగ్ ఏజెంట్లు కలిపి ఒక ప్రధాన రాజకీయ పార్టీ తరపున 96 మంది కౌంటింగ్ హాలులో ఉంటారు. రెండు ప్రధాన పార్టీలకు కలిపి 192 మంది ఉంటారు. చైౖర్‌పర్సన్ అభ్యర్థులుగా పోటీ చేసిన కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు, వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థులు 14 మంది, వారి నుంచి మరికొంత మంది ఏజెంట్లు హాజరవుతారు.
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
జంగారెడ్డిగూడెం క్రైం: జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ సర్వం సిద్ధం చేసింది. మార్కెట్ యార్డ్ ఆవరణలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుండగా 150 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జంగారెడ్డిగూడెం సీఐ శుభాశ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి కేవలం అభ్యర్థులు, వారితోపాటు ఒక జనరల్ ఏజెంట్, మరో కౌంటింగ్ ఏజెంట్ మాత్రమే ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోనే అభ్యర్థుల వాహనాలను నిలిపివేయాలని, కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎలాంటి విజయయాత్రలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు.