నేడు మహాధర్నా
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:03 AM
ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని అంగన్‌వాడీలు మహాధర్నాకు సిద్ధమయ్యారు. సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు నిర్బంధిస్తారనే ఆలోచనలతో కొంతమంది అంగన్‌వాడీలు, సిబ్బంది ఆదివారం నుంచే విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
నేడు మహాధర్నా
సమస్యల పరిష్కారంపై ‘చలో విజయవాడ’కు పిలుపు
ఇప్పటికే తరలి వెళ్లిన కొంతమంది అంగన్‌వాడీలు
పెదవేగి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని అంగన్‌వాడీలు మహాధర్నాకు సిద్ధమయ్యారు. సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు నిర్బంధిస్తారనే ఆలోచనలతో కొంతమంది అంగన్‌వాడీలు, సిబ్బంది ఆదివారం నుంచే విజయవాడకు బయలుదేరి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సమస్యలు తీరతాయని ఆశించిన మాకు నిరాశే మిగిలిందని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు అలుపెరుగని పోరాటం చేస్తే జగన్ సర్కారు ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలలైనా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పోరాటానికి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని, ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో రిలే నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సోమవారం చోలో విజయవాడను వేదికగా చేసుకున్నారు. అంగన్‌వాడీలు విజయవాడకు బయలుదేరుతుంటే ప్రభుత్వ అధికారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 3,851 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఆరేళ్లలోపు బాలలు ఒక లక్షా 68 వేల మంది అంగన్‌వాడీ సేవలు పొందుతున్నారు. గర్భిణులు 15,635 వేల మంది, బాలింతలు 16,836 మంది సేవలు అందుకుంటున్నారు.
అప్పటి.. ప్రతిపక్ష నేత హామీ ఏమైంది ?
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలను పరామర్శించిన అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మీ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడా రాజీ పడకుండా ఆందోళన చేయండి.. మీకు మేము అండగా ఉంటాం అన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆ రోజున హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు గడచినా మా గోడును పట్టించుకోవడంలేదని అంగన్‌వాడీ యూనియన్ నేతలు అన్నారు.
ఏడేళ్లుగా ఒక్క రూపాయి పెరగలేదు
– టి.మాణిక్యం, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి
మార్కెట్ ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలను పెంచాలి. దశలవారీగా ఇప్పటివరకు పెరిగిన వేతనం నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. ఏడేళ్ల కిందట కార్యకర్తలకు రూ.11,600, సహాయకురాలికి రూ.7వేలు చేశారు. అప్పటి నుంచి వేతనాలు పెరగలేదని, కనీసం కూటమి ప్రభుత్వంలోనైనా మరోసారి వేతనాలు పెంచాలి.
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
– డీఎన్వీడీ ప్రసాద్, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు
అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న శ్రమ ఎనలేనిది. మహిళ గర్భందాల్చిన దగ్గరనుంచి వారి ఆరోగ్య సంరక్షణ చూస్తూ, ప్రసవం తరువాత బాలింతకు పోషకాహారంతోపాటు ఆరోగ్యానికి సంబం ధించిన సూచనలు, సలహాలు అందిస్తుం టారు. అనంతరం చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తారు. మరోవైపు పలు రకాల యాప్‌లతో అధిక శ్రమ చేస్తున్నారు. అటువంటి వారికి కనీస వేతనం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కనీస వేతనం రూ.26లు వేలు ఇవ్వాలి.
హామీలు అమలు చేయాలి
– పి.భారతి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షురాలు
ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేతగా సమ్మెకు మద్దతుగా నిలిచి, అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అంగన్‌వాడీల సమస్యలన్నీ పరిష్కరించాలి. రకరకాల యాప్‌లతో పెరిగిన పనిభారాన్ని తగ్గించాలి. ఒక్క రూపాయి వేతనం పెంచకుండా చేయిస్త్ను వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి.