తొలిరోజే నిరాశ
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:59 PM
జంగారె డ్డిగూడెం పట్టణంలోని 18, 32 పొగాకు వేలం కేంద్రా ల్లో బుధవారం పొగాకు అమ్మకాలను బోర్డు చైర్మన్ సిహెచ్. యశ్వంత్‌కుమార్ ప్రారంభించారు.
రూ. 265కు మించని పొగాకు ధర 8 గోపాలపురంలో విక్రయాలు నిలిపివేసిన రైతులు
జంగారెడ్డిగూడెం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): జంగారె డ్డిగూడెం పట్టణంలోని 18, 32 పొగాకు వేలం కేంద్రా ల్లో బుధవారం పొగాకు అమ్మకాలను బోర్డు చైర్మన్ సిహెచ్. యశ్వంత్‌కుమార్ ప్రారంభించారు. వేలం ప్రారంభం రోజున కిలో పొగాకు ధర రూ.265 పలకడంతో రైతులు నిరాశ చెందారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ మాట్లాడు తూ రాష్ట్రంలో 7 పొగాకు వేలం కేంద్రాల్లో బుధవారం అమ్మకాలు ప్రారంభమయ్యాయని ఎన్‌ఎల్‌ఎస్ పరిధి లో రైతులు 52 మిలియన్ కిలోల పొగాకు పండించ డానికి బోర్డు అనుమతి ఇచ్చిందని, అయితే 82 మిలి యన్ కిలోల పొగాకు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. రైతు దగ్గర ఉన్న ఆఖరి బెయిల్ వరకు బోర్డు ద్వారా అమ్ముకునేలా సహకరిస్తామన్నారు. ఆర్‌ఎం.జె.సురేంద్ర, ఆక్షన్ సూపరింటెండెంట్‌లు, రైతులు పాల్గొన్నారు.
డీలాపడిన రైతులు
ఆరుగాలం కష్టపడి పండించిన నాణ్యమైన పొగాకు ధర వేలం మొదటి రోజే నిరాశకు గురి చేసిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జంగారెడ్డిగూడెంలో రెండు వేలం కేంద్రాలతో పాటు కొయ్యలగూడెం, దేవరపల్లిలో వేలం ప్రారంభం రోజున కిలో పొగాకు ధర రూ.265 పలికింది. గోపాలపురం వేలం కేంద్రంలో రైతులు వేలంలో పాల్గొనలేదు. రైతు సంఘం అధ్యక్షుడు పరిమి రాంబాబు మాట్లాడుతూ పొగాకు కంపెనీలు రైతులను నిలువునా ముంచేశా యన్నారు. ఇదే ధర కొనసాగితే భవిష్యత్తులో పొగాకు పండించేది లేదన్నారు. రైతు సంఘం నాయకుడు పొన్నగంటి అనిల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిస్థితి అర్థం చేసుకుని ధర రూ. 360 వరకు పెంచాలన్నారు.
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం వేలం కేంద్రంలో వేలం నిర్వహణాధికారి శివకుమార్ పొగాకు అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిపల్లి క్లస్టర్ నుంచి 27 బేళ్లను వేలంలో ఉంచగా కేజీ రూ.265 పలికిందని తెలిపారు. ఐటీసీ, జీపీఐ తదితర కంపెనీలు కొనుగోలు చేశాయన్నారు.
గోపాలపురంలో అమ్మకాలు నిలిపివేత
గోపాలపురం: గత నాలుగున్నర దశాబ్దాల కాలంలో వర్జీనియా పొగాకు అమ్మకాలు ప్రారంభం రోజే నిలిచిపోవడం ఇదే మొట్టమొదటిసారి అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను బుధవారం పొగాకు బోర్డు కార్యదర్శి వేణుగోపాల్ వేలం ప్రారంభించగా ప్రారంభ ధర కిలో రూ.265 నిర్ణయించడంతో రైతులు పొగాకు అమ్మకాలు నిలిపివే శారు. గత ఏడాది ధర కంటే ఈ ఏడాది కిలోకి రూ.30 తగ్గించి కొనుగోళ్లను ప్రారంభించటం గత 42 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదన్నారు. రైతులతో ఆర్‌ఎం సురేంద్రకుమార్, కార్యదర్శి వేణుగోపాల్‌తో చర్చలు జరిపి కనీస ప్రారంభం ధర రూ.295కు కొనుగోలు చేస్తేనే తాము పంటను అమ్ముతామని తేల్చి చెప్ప డంతో పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించినా రైతులు ససేమిరా అన్నారు. బోర్డు కార్యదర్శి వేణుగోపాల్‌కు రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.
దేవరపల్లి: దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం ఉదయం 10.30కు వేలం ప్రారంభించారు. ప్రారంభ ధర రూ.265 పలకటంతో తొలుత రైతులు అమ్మకాలు నిలిపివేశారు. బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ పొగాకు రైతులతో మాట్లాడి సమస్యలు కేంద్ర పొగాకు బోర్డు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంద న్నారు. ఆర్‌ఎం జే.సురేంద్రకుమార్ రైతులతో చర్చిం చడటంతో మరలా వేలం ప్రక్రియ ప్రారంభమైంది. దేవరపల్లి మండలం చెరుకుమిల్లి గ్రామానికి చెందిన రైతులు 18 బేళ్లుకు వేలంలో పెట్టగా రూ.265ధర పలికింది. వేలాన్ని దేవరపల్లి పొగాకు వేలం నిర్వహణాధికారి హేమస్మిత నిర్వహించారు.