సొంతింటి కల సాకారమయ్యేలా..
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:35 AM
గ్రామీణ ప్రాంతంలో సొంతింటి కల సాకారం అయ్యేందుకు ప్రభుత్వం సహ కారం అందిస్తోంది. యూనిట్ కాస్ట్‌ను పెంచుతూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
యూనిట్ కాస్ట్ పెంచిన ప్రభుత్వం
లబ్ధిదారుల్లో కొత్త ఆశలు
ఇళ్ల కోసం 7,300 మంది దరఖాస్తు
సర్వే తర్వాత పెరిగిన సంఖ్య
గ్రామీణ ప్రాంతంలో సొంతింటి కల సాకారం అయ్యేందుకు ప్రభుత్వం సహ కారం అందిస్తోంది. యూనిట్ కాస్ట్‌ను పెంచుతూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.1.50 లక్షలు ఉండగా 2.39 లక్షలకు పెంచారు. గ్రామీణ ప్రాంత లబ్ధిదారుల్లో ఇళ్లు కట్టుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు ఇది వరకే దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఎంత సొమ్ము ఇచ్చేదీ లెక్క తేలక పోవడంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయలేదు. ఇటీవల పట్టణాలకు సంబంధించి 595 మందికి ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. పల్లెల్లో ప్రభుత్వమే మరో మారు సర్వే నిర్వహించి సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారుల లెక్క తేల్చింది. సర్వేకు ముందు జిల్లాలో 7,300 లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. సర్వేలో మరో 7,000 మంది లబ్ధిదారులను గుర్తించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 14,300 మంది లబ్ధిదారులు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్మును ప్రకటించడంతో ఇళ్లు కూడా త్వరలోనే మంజూరు కానున్నాయి.
ఒక్కో ఇంటికి రూ. 2.39 లక్షలు
లబ్ధిదారులకు ఇచ్చే రుణంతో సహా ఒక్కో ఇంటికి రూ. 2.39 లక్షలను ప్రభుత్వం సమకూర్చనుంది. అందులో రూ.41 వేలు లబ్ధిదారులకు రుణంగా మంజూరు చేస్తారు. ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది. మిగిలిన మ్తొం అంటే రూ. 1.98 లక్షలు లబ్ధిదారులకు అందిస్తుంది. గత ప్రభుత్వంలో రూ. 1.80 లక్షలు మాత్రమే ఇచ్చారు. పట్టణ, గ్రామీణ లబ్ధిదారులకు ఒకే రీతిలో ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పట్టణ లబ్ధిదారులకు రూ. 2.50 లక్షలకు పెంచింది. అదే పల్లెల్లో అయితే రూ. 1.99 లక్షలు ఇవ్వనుంది. మరో రూ. 40 వేల రుణానికి ప్రభుత్వమే వడ్డీ చెల్లించ నుంది. ఆ దిశగా విధివిధానాలు ఖరారు చేసింది.
సొంత స్థలం ఉన్నవారికి ప్రయోజనం
పల్లెల్లో సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ప్రయోజనం చేకూర్చ నుంది. గతంలో ఇచ్చినా సరే సకాలంలో బిల్లులు మంజూరు చేయలేదు. తాజాగా లబ్ధిదారులు తమకు తోచిన రీతిలో ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. పాడు బడిపోయిన ఇంటి స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు కానున్నాయి. పురాతనంగా నిర్మించుకున్న పెంకిటిల్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. మరోవైపు స్థలం ఉన్నా సరే ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయనుంది. జిల్లాలో దాదాపు 14,300 మందికి ఇళ్లు అవసర మని గుర్తించారు. వారంతా స్థలం ఉన్నవారేనని గుర్తించారు. అర్హతను నిర్ధారించారు.
ఉగాది నాటికి పెండింగ్ ఇళ్లు
ఇదివరకే ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపడుతున్న ఇళ్లు ఉగాదినాటికి అందు బాటులోకి తెచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వమే కాంట్రాక్టర్ల ద్వారా చేపడుతున్న ఇళ్లును కూడా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా భీమవరంలో మూడో కేటగిరీ ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణా లను కాంట్రాక్టర్ వేగవంతం చేసేలా అధికా రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉగాది నాటికి లక్ష్యానికి చేరువగా ఉండాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దాదాపు వెయ్యి ఇళ్లు పూర్తయ్యేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
గ్రామాల్లో ఇంటికి రూ. 2.39 లక్షలు
కేంద్రం వాటా రూ.95,400
రాష్ట్ర వాటా రూ.63,600
ఉపాధి హామీ నిధులు రూ.27 వేలు
స్వచ్ఛ భారత్ నిధులు రూ.12 వేలు
లబ్ధిదారునికి రుణం రూ. 41 వేలు