Share News

వేటకు వేళాయె

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:07 AM

వేట నిషేధ ఆజ్ఞలు తొలిగిపోవడంతో తీర ప్రాంత మత్స్యకారులు వేటకు రెడీ అవుతున్నారు.

వేటకు వేళాయె

తీరానికి చేరుకుంటున్న బోట్లు

సిద్ధమవుతున్న మత్స్యకారులు

భారం కానున్న డీజిల్‌ ధరలు

ప్రభుత్వం సబ్సిడీ పెంచేనా ?

గతేడాది వాయుగుండాలతో నష్టం

ఈ ఏడాదైనా గంగమ్మ కరుణిస్తుందా ?

నరసాపురం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వేట నిషేధ ఆజ్ఞలు తొలిగిపోవడంతో తీర ప్రాంత మత్స్యకారులు వేటకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి 60 రోజుల పాటు కేంద్రం సముద్రంలో వేటను నిషేధించింది. ఈరెండు నెలల కాలంలో సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి ఎక్కువుగా ఉంటుంది. ఈకాలంలో వేట సాగిస్తే మత్స్య సంపద హరించిపోయ్యే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకుని కేంద్రం ప్రతి ఏటా ఈ నిషేధాన్ని అమలు చేస్తూ వచ్చింది. జిల్లాలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని 19 కిలోమీటర్ల పరిధిలో ఈసారి వేట నిషేధాన్ని కఠినంగా అమలుపర్చారు. శనివారం అర్ధరాత్రి గడువు ముగియడంతో ఆదివారం తెల్లవారు జాము నుంచి వేటకు సామాగ్రిని రెడీ చేసు కుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బోట్లు తీరానికి చేరుకుంటు న్నాయి. మరోవైపు ఈ ఏడాది వేటపై మత్స్యకా రులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది వరుస తుఫాన్లు, వాయుగుండాలతో నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఈ ఏడాదైనా గంగమ్మ కరుణిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. పెరిగిన డీజిల్‌ ధరలు ఈసారి వేటపై భారంగా పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదికి రూ.150 కోట్లపైనే

మత్స్య సంపద ఎగుమతి

రాష్ట్రంలో నరసాపురం తీరం మత్స్య సంపదకు పెట్టింది పేరు. గోదావరి సముద్రం కలిసే ప్రదేశం కావడంతో ఇక్కడ అపార మత్స్య సంపద దొరుకుతుంది. ఈ కారణంగా స్థానికు లతో పాటు కాకినాడ, మచిలీపట్నం, నిజాం పట్నం నుంచి కూడా వేటాడేందుకు మత్స్య కారులు వస్తుంటారు. 500 బోట్లుపైనే ఇక్కడ వేట సాగిస్తాయి. విదేశీ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న పండుగొప్ప, మాగ, చందువా, టూనా, టేకు, రొయ్య వంటి మత్స్య సంపదలు పుష్కలంగా లభిస్తాయి. ఏటా రూ.150 కోట్లుపైనే మత్స్య సంపద ఎగుమతి అవుతుంది. ఈ వేటపై ఆధారపడి 2 వేల మంది పైనే జీవనం సాగిస్తున్నారు. వీరిలో మత్స్యకారులతో పాటు ఐస్‌ ఫ్యాక్టరీ నిర్వాహకులు, కార్మికులు, ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలు, ఎగుమతి లారీల సిబ్బందికి ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం నిషేధం ఎత్తివేయడంతో మళ్లీ కార్మికులంతా పనులకు రెడీ అవుతున్నారు.

ప్రభుత్వ సబ్సిడీపైనే ఆశలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.10 నుంచి రూ.20వేలకు పెంచింది. ఈ మొత్తాన్ని మే నేలలోనే గుర్తింపు పొందిన 1,780 మంది మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. ఇది మత్స్యకారులకు ఊరటనిచ్చింది. అయితే ఈసారి వేటకు పెరిగిన డీజీల్‌ ధరలు పెనుభారంగా మారే ప్రమాదం ఉంది. యుద్ధం కారణంగా డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ.16పైనే పెరిగింది. ఇది బోట్ల నిర్వాహకులకు భారమవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద బోట్లకు నెలకు 3 వేల లీటర్లు, చిన్న బోట్లకు 300 లీటర్ల వరకు రూ.9 సబ్సిడీపై డీజీల్‌ అందిస్తున్నది. ఒక బోటు సముద్రంలోకి వేటకు వెళ్లితే పది రోజులు ఉండాల్సి వస్తుంది. ఈ కారణంగా 5 వేల లీటర్ల వరకు ఖర్చు అవుతుంది. అదే చిన్నబోట్లు అయితే 500 లీటర్ల వరకు పడుతుంది. ఈ భారం తగ్గాలంటే ప్రభుత్వం సబ్సిడీ పెంచు తుందన్న ఆశతో మత్స్యకారులు ఉన్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగు ణంగా నిషేధ భృతిని రూ.20 వేలకు పెంచాం. డీజీల్‌పై ఇస్తున్న సబ్సిడీని కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పెరిగిన డీజీల్‌ ధర మత్స్యకా రులకు భారమే. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సబ్సిడీ పెంచేలా చూస్తాం..

–కొల్లు పెద్దిరాజు, మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్‌

Updated Date - Jun 15 , 2026 | 12:07 AM