పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పెద్దపులి
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:20 AM
రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం పాత చేగొండపల్లిలో బస చేసిన పెద్దపులి ఒక దూడపై దాడి చేసి చంపి.. మరో గేదెపై దాడికి పాల్పడిన అనంతరం ఆ ప్రాజెక్టు ప్రాంతాల్లోనే సంచరిస్తుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.
డ్రోన్ కెమెరాతో ఆచూకీ కోసం అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు
పోలవరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం పాత చేగొండపల్లిలో బస చేసిన పెద్దపులి ఒక దూడపై దాడి చేసి చంపి.. మరో గేదెపై దాడికి పాల్పడిన అనంతరం ఆ ప్రాజెక్టు ప్రాంతాల్లోనే సంచరిస్తుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. మంగళవారం ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు, షూటర్స్ పులిని పట్టుకునే ట్రాంక్విలైజర్ పరికరాలతో పులిని పట్టుకోవడానికి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పులి మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ సిగ్నల్స్ పలు కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా డ్రోన్ కెమెరాలతో పులి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గేదెపై దాడికి పాల్పడిన ప్రాంతం మైదాన ప్రాంతం కావడంతో పాడి పశువులు ఆ ప్రాంతంలో ఎక్కువగా మేతకోసం సంచరిస్తున్నందున పెద్దపులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అటవీశాఖ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలైన జంటగుహలు, హెడ్ రెగ్యులేటర్ 902 హిల్, ఎస్. కటింగ్ ప్రాంతాల్లో కార్మికులు ఎవరూ సంచరించకుండా అప్రమత్తం చేశారు. అడవిలోకి నిత్యం కట్టెలు కొట్టేవారిని, పశువులు మేపడం కోసం వెళ్లే వారిని, ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లకుండా ప్రాజెక్టు చెక్‌పోస్టు వద్ద భద్రతా బలగాలు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.