Share News

పాపికొండల్లో టైగర్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:20 AM

పాపికొండల అభయారణ్యంలో క్రమేపీ పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పులుల గణన ఇటీవల పూర్తయ్యింది.

పాపికొండల్లో టైగర్‌

పులులకు అడ్డాగా అభయారణ్యం

ప్రాథమిక సర్వేలో

ఏడింటిని గుర్తించిన అధికారులు

ముప్పు తిప్పలు పెడుతున్న

మన్నెంపులి సిద్ధారంలోనే మకాం

పాపికొండల అభయారణ్యంలో క్రమేపీ పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పులుల గణన ఇటీవల పూర్తయ్యింది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని పాపికొండల అభయారణ్యంలో ఎనిమిదేళ్ల క్రితం రెండు పులులు మాత్రమే ఉండగా, 2022లో ఆ సంఖ్య నాలుగుకు, తాజా సర్వేలో ఏడుకు చేరాయి. దీనిని అధికారికంగా ప్రకటిం చాల్సి వుంది.

వేలేరుపాడు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పాపికొండల అభయారణ్యం 2.60 లక్షల ఎకరాల్లో విస్తరించి వుంది. ఇక్కడ పులుల సంచారం పెరగడాన్ని ట్రాప్‌ కెమెరాల్లో గుర్తించారు. మొత్తం 160 ప్రాంతాల్లో 500కు పైగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసి నాలుగు నెలలుగా వాటి కదలికలను ఫొటోలు తీశారు.

పులుల వృద్ధికి అనుకూలం

రంపచోడవరం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు అటవీ శాఖా ధికారులు ఈ పులుల గణన చేపట్టారు. 391 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న పాపికొండల మధ్యలో గోదావరి నది ప్రవహిస్తోంది. ఇక్కడ పులు లకు అత్యంత అనుకూల వాతావరణం ఉన్నందున ఈ ప్రాంతంలో ఇవి వృద్ధి చెందుతున్నాయి. మనకు ఏ ఒక్కరి కళ్లు, వేలి ముద్రలు ఒకేలా ఉండవు. అలాగే చూడటానికి అన్ని పెద్ద పులులు ఒకేలా ఉన్నా వాటి ఒంటిపై ఉండే చారలు భిన్నంగా ఉంటాయి. దీని ఆధారంగా వీటిని గుర్తిస్తారు. ఒక పులికి ఉండే చారలు మరోపులికి ఉండవు. పాద ముద్రలు వేటికవే. వీటిని ప్రత్యేక నిపుణుల బృందం నిర్ధారించి ఎన్ని పులులు ఉన్నాయో లెక్క తేలుస్తారు. పాపికొండల అభయారణ్యంలో 500 ట్రాప్‌ కెమెరాల ద్వారా చిత్రీకరించిన ఐదు వేల ఫొటోలను శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ పరిపాలన కార్యాలయానికి పంపుతారు. ఈ ఫొటో డేటాను విశ్లేషించి ఢిల్లీలోని జాతీయ పులుల సంరక్షణ అథారిటీకి పంపించగా అక్కడ మరోసారి నిపుణుల బృందం డేటాను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్ని పులులు ఉన్నాయో అధికారి కంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి స్థానిక అధికారుల పరిశీలనలో ఏడు పులులు ఉన్నట్టు గుర్తించారు.

మన్యం పెద్దపులి మాటేమిటి..

పులుల గురించి ప్రస్తావన వస్తే ఠక్కున గుర్తుకొచ్చేది ఏజెన్సీలో తిరుగుతున్న పెద్దపులే. ఆరు నెలలుగా ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలకు ఇది కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవిలో ఉండే ఈ పెద్దపులి గ్రామా లకు వచ్చి నెలల తరబడి తిరగడం, ఆకలైతే ఏదొక పశువును చంపి తినడం పరిపాటిగా మారింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా ఏలూరు జిల్లాలోకి అటుపై తూర్పు గోదావరిలోకి ప్రవేశించి అక్కడ కొన్ని నెలలు ప్రజలను, అధికారులను ముప్పుతిప్పలు పెట్టి చివరకు రాయవరం మండలంలో దొరికింది. తర్వాత దానిని వైజాగ్‌ జూకి తరలించారు. అనంతరం మళ్లీ తీసుకొచ్చి పాపి కొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. జనావాసాల్లో తిరగడం అలవాటైన ఈ పెద్ద పులి అడవిలో ఉండకుండా మళ్లీ గ్రామాలబాట పట్టింది. తాజాగా వారం క్రితం వేలేరుపాడు మండలంలోకి ప్రవేశించి రెండు ఆవులపై చంపి తినేసింది. పశువులను చంపి తిన్న తరువాత కనీసం 4, 5 రోజులు సమీపంలోనే అడవిలో విశ్రాంతి తీసుకుంటూ మళ్లీ ఆకలైనప్పుడు పశువులపై దాడి చేస్తూ ప్రజలను, అటవీశాఖాధికారులు, రెస్క్యూ బృందాల సభ్యులను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రస్తుతం ఈ పెద్దపులి సిద్ధారం గ్రామ సమీప అడవిలోనే తిష్ట వేసి విశ్రాంతి తీసుకుం టోంది. దీనిని ఎలాగైనా బంధించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

Updated Date - Jul 10 , 2026 | 12:20 AM