Share News

వనం నుంచి జనంలోకి

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:08 AM

మహారాష్ట్ర అభయారణ్యంలో ఉండాల్సిన పులి ఇలా జనంలోకి ఎందుకు వస్తోంది..? వచ్చినా పదే పదే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎందుకు తిరుగుతోంది? అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్న పెద్దపులి సంచారం ఇప్పుడు అందిరిలోనూ అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

వనం నుంచి జనంలోకి

వనం నుంచి జనంలోకి

పెద్ద పులి మైదాన ప్రాంతాలకు తరచూ ఎందుకు వస్తోంది..?

మనుషులపై దాడి చేయకపోవడంతో అనుమానాలు

ఆడ పులిని తోడు తెచ్చే యోచనలో అధికారులు

మహారాష్ట్ర అభయారణ్యంలో ఉండాల్సిన పులి ఇలా జనంలోకి ఎందుకు వస్తోంది..? వచ్చినా పదే పదే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎందుకు తిరుగుతోంది? అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్న పెద్దపులి సంచారం ఇప్పుడు అందిరిలోనూ అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. అడవిలో సాటి జంతువులతో పోరాటాలను మర్చిపోయిందా? అక్కడ తోడు లేక.. మానవ ఆవాసాలను ఎంచుకుందా ? ఉండ్రాజవరం మండలం పసలపూడి నుంచి తిరుగు ముఖం పట్టిన పులిని మళ్లీ రాకుండా ఏం చేయాలి ? ఈ దిశగా అధికారులు ఆలోచన చేయాలి.

తణుకు రూరల్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో సంచ రిస్తున్న పెద్ద పులి 2025 డిసెంబరులో మహారాష్ట్రలోని తాడోబా – అంధేరీ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి బయ టపడింది. దీనికి అటవీ అధికారులు ఎక్స్‌ ప్లోరర్‌ అని పేరు పెట్టి మెడలో జీపీఎస్‌ ట్యాగ్‌ను అమర్చారు. ఇది మహారాష్ట్ర నుంచి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సుమారు 53 రోజుల్లో 650 కిలోమీటర్ల అటవీ ప్రాంతాల నుంచి ప్రయాణించి ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని మైదాన ప్రాంతంలో సంచరిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ప్రవేశించిన ఈ పెద్ద పులిని తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో ఫిబ్ర వరి 14న అటవీ శాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి బంధించి పాపికొండల నేషనల్‌ పార్క్‌ అడవుల్లో విడిచి పెట్టారు. అయితే ఈ అడవిని విడిచి మళ్లీ మైదాన ప్రాంతాలైన దేవరపల్లి నుంచి చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం మండలాల్లోని గ్రామా ల్లో తన సంచారాన్ని ప్రారంభించింది. తిరిగి అదే దారిలో వెనక్కి ప్రయాణించడంతో అటవీ శాఖ, పోలీసు సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు దానిని సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతం లో వదిలేందుకు శ్రమిస్తున్నారు.

ఈ ప్రాంతానికి అలవాటు పడింది..

అడవుల్లో సంచరించే పెద్ద పులి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఆరు నెలలుగా సంచరించడాన్ని బట్టి పరిశీలిస్తే పెద్ద పులి అడవిని మర్చిపోలేదని, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ఎక్స్‌ప్లోరర్‌ పులి మహారాష్ట్ర నుంచి ఏపీ వరకు సంచరించినా పంట పొలాలు, క్వారీలు, తోటలు, చిన్న చిన్న పొదల్లో ఉంటూ పశువు లను వేటాడుతూ బతకడం అలవాటు చేసుకుందని, ఎక్కడా మనుషులపై దాడి చేసి తిన్న దాఖలాలు లేకపోవడంతో ఈ ప్రాంత వాతావరణానికి అలవాటు పడి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైదా న ప్రాంతంలోని చెరకు తోటలు, నీటి వనరులు దీనికి సురక్షితమైన ఆవాసాలుగా కనిపించడంతో అడవికి వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే సంచరించడానికి అల వాటు పడిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిఘాను గమనించిందా?

అడవి నుంచి తప్పించుకుని జిల్లాలోని పంట పొలా ల్లో సంచరిస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ, పోలీసు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలను పెద్ద పులి గమనించి తప్పించుకుని తిరుగుతుందని పేర్కొంటు న్నారు. శుక్రవారం ఉండ్రాజవరం మండలం పసలపూ డిలో నిద్రలో ఉన్న పెద్ద పులిని బంధించేందుకు ట్రాప్‌ చేసే ప్రయత్నాలను దాటుకుని వెనక్కి వెళ్లిపోవడం నిజమే అనిపిస్తోంది. బోనులు, వాటి దగ్గరకు వెళ్లేం దుకు ఆవు పేడ వంటివి ఏర్పాటు చేసినా వాటిని దాటుకుని వెనక్కి వెళ్లడం అటవీ సిబ్బంది ప్రయత్నా లను పులి గమనించి తప్పించుకుంటున్నట్లుగా పేర్కొం టున్నారు. ఎంతైనా జంతువు కాబట్టి అధికారులు పెద్ద పులిని సురక్షితంగా బంధించి అడవిలో వదిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం పుణే నుంచి ప్రత్యేక నిపుణులను కూడా రప్పించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, రైతులు తమ పొలాలు, పశువుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.

తోడు కోసమే ఈ సంచారమా?

ఈ పెద్ద పులి అటవీ ప్రాంతాన్ని మర్చిపోయి ఇలా సంచరిస్తుందా అనే కోణంలో ఆలోచన చేస్తు న్నారు. సాధారణంగా పులులు తమ అటవీ స్థానా న్ని ఎప్పటికీ మర్చిపోవని, ఇది ఒంటరిగానే బయట ప్రపంచంలోకి వచ్చిందని, తిరిగి వెళ్లిపోగలదని పేర్కొంటున్నారు. దీనితోపాటు ఇది మగ పులి. దీని వయసు నాలుగు సంవత్సరాలు. సాధారణంగా పెద్ద పులుల్లో యవ్వన దశ మూడేళ్ల నుంచే ప్రారంభమ వుతుంది. అందువల్ల ఈ మగ పులి తగిన ఆడ పులి కోసం వెతుకుతూ సంచరిస్తుందేమోననే అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసింది. దీనిని బంధించిన తర్వాత తగిన ఆడ పులిని సమీ పంలో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అడవిలో జంతువుల మధ్య పోరాటంలో కొన్ని జంతువులు బయటకు వచ్చి తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయని, వాటిలో పెద్ద పులులే ఎక్కువగా సొంత స్థానాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:08 AM