పాపికొండల్లో స్వేచ్ఛగా తిరగలేక.. జనారణ్యంలోకి
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:51 AM
పాపికొండల నేషనల్ పార్కులో జీవనం సాగిస్తున్న వన్య ప్రాణులకు స్వేచ్ఛా భంగం కలుగుతుండడంతో జనావాస ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. కొన్ని తిరిగి అడవిలోకి వెళుతుండగా, మరికొన్ని వేటగాళ్ల ఉచ్చులకు, తుపాకీల తూటాలకు, రోడ్డు ప్రమాదాలకు, విద్యుదాఘాతాలకు బలవుతున్నాయి.
పాపికొండల్లో స్వేచ్ఛగా తిరగలేక.. జనారణ్యంలోకి
వన్యప్రాణుల చొరబాటు.. ప్రాణభయంతో దాడులు
పాపికొండల నేషనల్ పార్కులో జీవనం సాగిస్తున్న వన్య ప్రాణులకు స్వేచ్ఛా భంగం కలుగుతుండడంతో జనావాస ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. కొన్ని తిరిగి అడవిలోకి వెళుతుండగా, మరికొన్ని వేటగాళ్ల ఉచ్చులకు, తుపాకీల తూటాలకు, రోడ్డు ప్రమాదాలకు, విద్యుదాఘాతాలకు బలవుతున్నాయి.
పోలవరం, జూన్ 24(ఆంధ్రజ్యోతి):పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు 23 గిరిజన గ్రామాలు ప్రాజెక్టు ఎగువన ఏలూరు జిల్లా పరిధిలో 160.16 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండేది. ప్రాజెక్టు నిర్మాణానంతరం గ్రామాల తరలింపు తర్వాత అటవీ విస్తీర్ణం పెరగడంతో పాటు గోదావరి తీరం వెంబడి అడవులు వన్యప్రాణులకు ఆహారం దొరుకుతుండడంతో వాటి సంతతి గణనీయంగా పెరిగింది. పాపికొండల అడవుల్లో ప్రస్తుతం అడవి పక్షులు, అడవి కోళ్లు, పులులు, చిరుతలు, ఎర్రటి మచ్చల చిరుతలు, సిందుగులు, కొండ మేక అనబడే మొరిగే జింక, అడవి కుక్కలు, సాంబార్ జింకలు, మచ్చల జింకలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, హైనాలు, నక్కలు, కుందేళ్లు, బెట్టు ఉడతలు, సాధారణ ఉడతలు నదీ తీరంలో మొసళ్లు తమ సంతతిని వృద్ధి చేసుకున్నాయి. ఇవి కాకుండా నెమళ్లు, ఎర్ర అడవి నెమళ్లు, బ్రాహ్మణి బాతులు, కింగ్ ఫిషర్లు, గ్రద్దలు, మైనాలు, ఎర్ర, పసుపు ముక్కు పక్షులు హార్న్ బిల్స్, రాబిన్ పక్షులు, తూర్పు పెద్ద బంగారు పక్షి, గుడ్ల గూబలు జీవనం సాగిస్తున్నాయి. అరుదైన వృక్ష సంపద, వన మూలికలు విస్తృతంగా పెరుగుతున్నాయి.
జూ విచ్చలవిడిగా అడవుల నరికివేత
పొగాకు బ్యారన్లకు కట్టెల వినియోగం పెరగడంతో కొందరు అక్రమ కలప రవాణాదారులు పాపికొండల అభయారణ్యాలలోకి, అభయారణ్యం వెంబడి, అటవీ శాఖ ఏర్పాటు చేసిన హద్దుల వెంబడి వున్న అడవులను సరిహద్దు కంచెలుగా నిలుస్తున్న వెదురు అడవులను నరికి తరలించుకుపోతున్నారు. దీనివల్ల అడవుల నుంచి వన్యప్రాణులు బయటకు రావడానికి ఎక్కువగా మార్గం ఏర్పడడంతో అవి బయటకు వచ్చి జనావా సాల్లోకి చొరబడుతున్నాయి. విలువైన టేకు, బండారు, వేగిస కలప కోసం కలప స్మగ్లర్లు అడవుల్లోకి వెళ్లడం వల్ల జన సంచారం పెరిగి వన్యప్రాణులు ప్రాణభయంతో అడవుల నుంచి బయటకు వస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో బాంబ్ బ్లాస్టింగ్‌లు, భారీ యంత్రాల భారీ శబ్దాలకు వన్యప్రాణుల స్వేచ్చకు విఘాతం కలిగిస్తున్నా యి. పాపికొండల టూరిజం బోట్లలో టూరిస్టుల కోసం వినియోగించే డీజే సౌండ్ బాక్సుల శబ్ధాలు, ప్రాజెక్టు ఎగువన చేపల వేట చేస్తున్న మత్స్యకా రుల సంచారం. పాపి కొండల అడవుల్లోకి అక్రమంగా చొరబడుతున్న గొర్రెల మందల కాపరుల సంచారం వన్యప్రాణుల స్వేచ్ఛకు ఆటంకంగా మారడంతో తరచూ వన్యప్రాణులు అడవుల నుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి.
ఏం చేయాలి : ‘అటవీ అధికారులు వెంటనే స్పందించాలి. అడవుల హద్దుల పొడవునా వెదురు వనాలు గుబురుగా పెంచాలి. అడవుల్లోకి గొర్రెల మందలు, అక్రమ కలప స్మగ్లర్ల రాకపోకలు నివారించాలి. ప్రాజెక్టు ఎగువున చేపల వేట, టూరిజం బోట్లలో డీజే సిస్టం నియంత్రణపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’ అని జీవవైవిధ్య, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
గతేడాది జిల్లాలోకి వచ్చిన పెద్దపులి మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చి పదుల సంఖ్యలో పశువులను చంపివేసింది.
గతంలో పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట గ్రామ శివారు జీడిమామిడి తోటలో అడవుల నుంచి వచ్చిన కొర్ర గేదె(వైల్డ్ బఫెలో) ముగ్గురిపై దాడి చేసింది. వీరిలో ఒక వృద్ధురాలు మృతి చెందగా ఇద్దరు మహిళలు గాయపడ్డారు.
వింజరం పంచాయతీ తానాలకుంట గ్రామ శివారున రెండేళ్ల క్రితం అడవి పంది ఆస్పత్రికి వెళుతున్న ఆటోను ఢీకొని దాడి చేయగా ఒక పసివాడు సహా భార్యా భర్తలు గాయపడ్డారు.
మెత్తప్పకోటకు చెందిన ఒక మహిళపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది.
–––
ఉలిక్కిపడ్డ మన్యం
తూర్పు పాలకుంట సమీపంలో రెండు ఆవులపై పులి దాడి.. అటవీ అధికారుల గాలింపు
మత్తు మందు ఇచ్చి బంధించేందుకు ఏర్పాట్లు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
బుట్టాయగూడెం, జూన్ 24(ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లా ఏజెన్సీ వాసులను పెద్ద పులి హడలెత్తిస్తోంది. మూడు రోజుల క్రితం గోదావరిని దాటి వచ్చిన పులి బుధవారం తెల్లవారుజామున బుట్టాయగూడెం మండలం తూర్పు పాలకుంట శివారు సోయం వెంకటేశ్వరావు, కూరం వెంక టేశ్వరావులకు చెందిన రెండు ఆవులను చంపేసింది. ఒక ఆవును ఎనిమిది కిలోల వరకు తిని, మరో ఆవును శింగ రమ్మ కొండ అడవి లోపలికి తీసుకుపోయింది. ఈ ఘట నతో మన్యం వాసుల్లో భయాందోళన నెల కొంది. పులిని బంధించడానికి అటవీ అధి కారులు అడవిని జల్లెడ పట్టారు. పులి దాగివున్న కొండ ప్రాంతంలో మత్తు మం దు ఇంజక్షన్ ఇవ్వడానికి ఎత్తైన మంచె (పందిరి)ను రెస్య్కూ టీమ్ ఏర్పాటు చేసుకుంది. పులి మెడలో గతంలో అమ ర్చిన రేడియో ప్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా కద లికలను తెలుసుకుంటున్నారు. ఉదయం 11–12 గంటల మధ్యలో కదలికలు కనిపిం చడంతో అధికారులు, సిబ్బంది అప్రమ త్తమయ్యారు. పులి ఉన్న పరిసర ప్రాంతా లకు జనాలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, సబ్ డీఎఫ్‌వో వెంకటసుబ్బయ్య, రేంజర్ భానుప్రకాశ్, డీఆర్వో ప్రభాకర్‌లు పులిని బంధించే పనిలో ఉన్నారు.
ముప్పతిప్పలు పెడుతోంది: గతంలో 2025 జనవరిలో ఏజెన్సీకి వచ్చిన పులి వివిధ గ్రామాల్లో సంచరించి సుమారు 27 పశువులను చంపేసింది. చివరకు మెట్ట ప్రాంతమైన కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు పరిసర ప్రాంతాల్లో ఉండగా అటవీశాఖ అధికారులు అతికష్టంమీద బంధించి విశాఖపట్నం జూ కు తరలించారు. కొద్దిరోజుల తర్వాత దాని మెడలో రేడి యో ప్రీక్వెన్సీ ట్రాకర్ అమర్చి గోదావరి అవతల దట్టమైన అడవిలో విడి చిపెట్టారు. అయితే అది మరల ఏజెన్సీ గ్రామాల వైపు వస్తుండడంతో దాని ని బంధించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ అధికారులను రెండు నెలలుగా ముప్పతిప్పలు పెడుతోంది. రెస్క్యూ టీమ్ సిబ్బంది ప్రత్యేక వాహనంలో పులిని పట్టుకోడానికి తిరుగుతూ చివరకు ఏలూరు జిల్లా మన్యానికి చేరుకున్నారు. పులిని ఉన్న అడవి ప్రాంతానికి వెళ్ళి బంధించే పనిలో నిమగ్నమయ్యారు. బంధించడానికి ఇనుప బోనును వాహనంలో వెంట తెచ్చుకున్నారు.