అడవిలోనే పెద్దపులి
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:28 AM
పెద్దపులి పాపికొండల అడవుల్లోనే ఉందని ప్రజానీకం పెద్దపులి సంచారం పట్ల ఆందో ళన చెందవద్దని జిల్లా అటవీ శాఖాధికారి పీవీ సందీప్ రెడ్డి అన్నారు.
ప్రజానీకం ఆందోళన వద్దు
జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి
పోలవరం, ఏప్రిల్ 19 (ఆంధ్ర జ్యోతి): పెద్దపులి పాపికొండల అడవుల్లోనే ఉందని ప్రజానీకం పెద్దపులి సంచారం పట్ల ఆందో ళన చెందవద్దని జిల్లా అటవీ శాఖాధికారి పీవీ సందీప్ రెడ్డి అన్నారు. ఆదివారం అటవీ సంరక్షణాధికారి నీలకంఠనాధ రెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే దిగువన పెద్దపులి దూడపై దాడి చేసి చంపిన ప్రాంతాన్ని, పులి సంచరించిన ప్రాంతాల్ని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు అతిఽథి గృహం వద్ద ట్యాబ్ ద్వారా పులి కదలికల్ని పరిశీలించారు. పులి శింగన్నపల్లి, కొత్తూరు పరిసర ప్రాంతాల రిజర్వు ఫారెస్టులో సంచరిస్తున్నట్లు గుర్తించారు. వారికి సంబంధిత వివరాలను అటవీక్షేత్రాధికారి ఎస్‌కె వలీ, జంగారెడ్డిగూడెం డీఎఫ్‌వో వెంకట సుబ్బయ్య వివరించారు. అనంతరం జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం విశాఖ జూ నుంచి పులిని తీసుకొచ్చి రంపచోడవరం అడవుల్లో వదలడం జరిగిందని, పులి గోదవరి నదిని దాటి పోలవరం మైదాన ప్రాంతాల్లో సంచరించి పశువులపై దాడి చేసిందని, ప్రస్తుతం అది రిజర్వు ఫారెస్టులోనే సంచరిస్తుందన్నారు. పులి పశువుల్ని తినడానికి అలవాటు పడిందని, గడిచిన కాలంలో మనుషులపై ఎలాంటి దాడికి పాల్పడిన సంఘటనలు లేవన్నారు. ప్రస్తుతం సంచరిస్తున్న ప్రాంతంలో దానికి నీరు, ఆహారం సమృద్ధిగా ఉండడం వలన వెనక్కి వచ్చే అవకాశాలు లేవన్నారు. పులి జనావాసాల సమీపంలోకి వచ్చిన సందర్భాల్లో సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయడానికి పులి మెడకు అమర్చిన శాటిలైట్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా పులి కదలికల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న అటవీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక్కో సందర్భంలో పులి దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ అందని పరిస్థితుల్లో వినియోగించడానికి హైఫ్రీక్వెన్సీ యాంటీనాలను అందుబాటులో ఉంచామన్నారు. పులిని పట్టుకోవడానికి శ్రీశైలం అటవీశాఖ నుంచి ప్రత్యేక రెస్క్యూ సిబ్బందిని, ట్రాంక్విలైజర్ గన్స్, వలలు ఇతర సదుపాయాలతో సిద్ధపరిచినట్లు తెలిపారు. సిబ్బంది పులి కదలికలపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.